రాజకీయ జీవితంలో మొదటిసారి సస్పెండైన బాబు

ABN , First Publish Date - 2020-12-01T08:40:12+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ జీవితంలో తొలిసారి శాసనసభ నుంచి సస్పెండయ్యారు. 1978 నుంచి ఎమ్మెల్యేగా

రాజకీయ జీవితంలో మొదటిసారి సస్పెండైన బాబు

ప్రతిపక్ష నేతపై వేటు ఆనవాయితీ కాదు


అమరావతి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ జీవితంలో తొలిసారి శాసనసభ నుంచి సస్పెండయ్యారు. 1978 నుంచి ఎమ్మెల్యేగా ఉంటున్న ఆయన ఇంతవరకూ ఎప్పుడూ సస్పెండ్‌ కాలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం సోమవారం ఆయన్ను ఒకరోజు సస్పెండ్‌ చేసింది. 1989నుంచి ఐదేళ్లపాటు ఆయన ప్రతిపక్షంలో అసెంబ్లీలో క్రియాశీలంగా ఉన్నారు. అప్పుడు ఎన్టీఆర్‌ ప్రతిపక్ష నేతగా ఉండేవారు. అప్పట్లో సస్పెన్షన్‌ అస్త్రం అరుదుగా ప్రయోగించేవారు. ఆ తర్వాత 2004-14 వరకూ చంద్రబాబు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ సమయంలో కూడా ఆయన్ను ఎప్పుడూ సస్పెండ్‌ చేయలేదు. పరిటాల రవి హత్య అనంతరం అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో మొత్తం టీడీపీ ఎమ్మెల్యేలందరినీ సస్పెండ్‌ చేసినా చంద్రబాబును చేయలేదు. ప్రతిపక్ష నేతను సస్పెండ్‌ చేయకూడదన్న ఆనవాయితీ ఉండడమే దీనికి కారణం. వైఎస్‌ఆర్‌, పి.జనార్దన్‌రెడ్డి ప్రతిపక్ష నేతలుగా ఉన్నప్పుడే ఇదే ఆనవాయితీ పాటించారు.


కాగా, పరిటాల రవిని చంపినప్పుడు కూడా తాను పోడియం వద్దకు వెళ్లలేదని.. కానీ ఇప్పుడు రైతుల దుస్థితి చూసి కడుపు మండిపోయి పోడియం వద్దకు వెళ్లానని చంద్రబాబు చెప్పారు. ‘ఈ 18నెలల్లో ఏడుసార్లు వరదలు వచ్చాయి. 20 లక్షల ఎకరాల్లో పంటలు పోయాయి. ఈసారి పరిస్థితి మరీ దయనీయం. పండించిన పంట మట్టిలో కలిసిపోయి రైతులు దీనావస్థలో ఉన్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ ఘోరం. వారిని ఆదుకోవడానికి ఏం చేస్తారో నిర్దిష్టంగా చెప్పమంటే సోది చెప్పి తప్పించుకోవాలని చూశారు. రైతుల పరిస్థితిని పట్టించుకోని ప్రభుత్వ తీరు భరించలేక కసి, కోపంతో పోడియంలోకి వెళ్లాను. ఇవాళ నన్ను కాదు.. రైతులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. వారిని ఆదుకోలేని తన చేతగానితనాన్ని బయటపెట్టుకుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-12-01T08:40:12+05:30 IST