దమ్మాలపాటి కేసులో దర్యాప్తుపై స్టే!
ABN , First Publish Date - 2020-11-26T09:24:56+05:30 IST
రాజధాని భూముల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివా్‌సతోపాటు మరికొందరిపై ఏసీబీ నమోదు చేసిన కేసులో తదుపరి దర్యాప్తును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వుల్లో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోలేదు. అదేసమయంలో, ఈ కేసు వివరాలు మీడియాలో రాకూడదన్న(గ్యాగ్) ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపి వేసింది. ఏసీబీ దర్యాప్తు నిలిపివేతతోపాటు గ్యాగ్ ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన

హౖకోర్టు ఆదేశాలే కొనసాగింపు
జోక్యం చేసుకోని సుప్రీం కోర్టు
‘గ్యాగ్’ ఉత్తర్వులపై స్టే ఎత్తివేత
జనవరి ఆఖరు వరకు దమ్మాలపాటి
పిటిషన్‌పై నిర్ణయం వద్దని సూచన
హైకోర్టుకు సమాధానం చెప్పకుండా
సుప్రీంకోర్టుకు రావడమా?
ఇది హైకోర్టుపై అవిశ్వాస ప్రకటనే!
‘రాజధాని’లో రహస్యమేమీ లేదు
సాల్వే, రోహత్గీ స్పష్టీకరణ
ఫిర్యాదుపై దర్యాప్తు చేయొద్దా?
సర్కారు తరఫున ధవన్ ప్రశ్న
న్యూఢిల్లీ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాజధాని భూముల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివా్‌సతోపాటు మరికొందరిపై ఏసీబీ నమోదు చేసిన కేసులో తదుపరి దర్యాప్తును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వుల్లో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోలేదు. అదేసమయంలో, ఈ కేసు వివరాలు మీడియాలో రాకూడదన్న(గ్యాగ్) ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపి వేసింది. ఏసీబీ దర్యాప్తు నిలిపివేతతోపాటు గ్యాగ్ ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లం విలేకరుల సమావేశం పెట్టి వివరాలు వెల్లడించడంతో తమ ‘గ్యాగ్ ఆర్డర్’ నిష్ఫలమైందని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సుప్రీంకోర్టు దానిపై ఉన్న స్టే ను ఎత్తివేసింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి చివరి వారానికి వాయిదా వేసింది. అప్పటి వర కు దమ్మాలపాటి దాఖలు చేసిన పిటిషన్‌పై ఎలాంటి ని ర్ణయం తీసుకోవద్దని హైకోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది. విచారణలో భాగంగా తొలుత ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్, ఆ తర్వాత దమ్మాలపాటి తరఫున సీనియర్ న్యాయవాదులు హరీశ్ సా ల్వే, ముకుల్ రోహత్గీ సుదీర్ఘంగా వాదనలు వినిపించారు.
హైకోర్టుపై అవిశ్వాసాన్ని వ్యక్తం చేసినట్లే: సాల్వే
‘‘నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని సెప్టెంబరు 15న హైకోర్టు ఆదేశాలివ్వగా... ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. అంటే... హైకోర్టుపై రాష్ట్ర ప్రభుత్వం అవిశ్వాసాన్ని వ్యక్తం చేసినట్లే’’ అని దమ్మాలపాటి తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే తేల్చిచెప్పారు. అయితే... హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేసినందునే సమాధానం ఇవ్వలేదేమో అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. దాని గురించి తెలుసుకుంటామని తెలిపింది. హైకోర్టు ఉత్తర్వులు తప్పుగా ఉంటే స్టే ఎత్తివేయాలని ప్రభుత్వం హైకోర్టునే ఆశ్రయించి ఉండాల్సిందని సాల్వే అన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనే ముఖ్యమంత్రి ఆరోపణలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. స్టే ఎత్తివేయాలని హైకోర్టును ఆశ్రయించకుండా ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 136ను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. హైకోర్టుకు సమాధానం ఇస్తే మి న్ను విరిగి మీద పడుతుందా? అని ప్రశ్నించారు. హై కోర్టు మీద విశ్వాసం లేని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేశారు. ‘‘ఈ కేసును హైకోర్టునే విచారించనివ్వండి. స్థానిక పరిస్థితులు హైకోర్టుకే బాగా తెలుస్తాయి’’ అని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా తన సానుభూతిపరులతో న్యాయమూర్తులను భయపెట్టించడానికి, బెదిరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని... ఈ వ్యవహారంపై హైకోర్టు దర్యాప్తునకు కూడా ఆదేశించిందని హరీశ్ సాల్వే తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సహా 45 మందికి నోటీసులు జారీ చేసిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుందో హైకోర్టుకు తెలుసని అన్నారు.
ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలా వద్దా: ధవన్
ఎవరిపైన అయినా ఫిర్యాదు వచ్చినప్పుడు దర్యాప్తు జరపాలా వద్దా అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ ప్రశ్నించారు. రాజధాని భూములపై మార్చి 23న రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి లేఖ రాసిందని, ఆ తర్వాత 7 నెలలకు ఏసీబీ కేసు నమోదు చేసిందని తెలిపారు. ఏసీబీ కేసు కొట్టివేయాలని దమ్మాలపాటి హైకోర్టులో విజ్ఞప్తి చేయలేదని, ముందస్తు బెయిల్ మంజూరుతోపాటు ఎఫ్‌ఐఆర్‌లోని వివరాలను మీడియా ప్రచురించకుండా అడ్డుకోవాలని మాత్రమే హైకోర్టులో పిటిషన్ వేశారని తెలిపారు. కానీ... హైకోర్టు మాత్రం దర్యాప్తును నిలిపివేసిందన్నారు. ‘‘దర్యాప్తును హైకోర్టు ఎలా ఆపగలదు? ఎఫ్‌ఐఆర్‌లో 13 మంది పేర్లు ఉన్నాయి. దమ్మాలపాటి ఒక్కరు మాత్రమే హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మాత్రం అందరికీ ఉపశమనం కలిగించేలా ఉత్తర్వులు ఇచ్చింది. రాజకీయ దురుద్దేశాలతో ప్రభుత్వం కేసు నమోదు చేసిందని కూడా హైకోర్టు పేర్కొంది. గత ప్రభుత్వం అమరావతిని కొత్త రాజధానిగా ప్రకటించింది. 2014 జూన్‌లో ఆ ప్రాంతంలో రాజధాని వస్తుందన్న సమాచారం తెలిసింది. జూన్ నుంచి డిసెంబరు వరకు... ఆరు నెలల్లో పెద్ద సంఖ్యలో భూ లావాదేవీలు జరిగాయి. 2019లో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై దర్యాప్తునకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆ సంఘం 2019 డిసెంబరులో తొలి నివేదికను సమర్పించింది. దాని ఆధారంగా ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది’’ అని ధవన్ వివరించారు.
ఈ అంశంపై దర్యాప్తు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సీబీఐ తోసిపుచ్చిందని తెలిపారు. ‘హైకోర్టు ఇలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవచ్చా’ అన్నదే తమ ప్రశ్న అని ధవన్ పేర్కొనగా... ‘అది వేరే అంశం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా, ఎఫ్‌ఐఆర్‌పై మీడియా కథనాలు ప్రచురించవద్దన్న హైకోర్టు ఆదేశాలు సహారా కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధమని స్పష్టం చేశారు. ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా న్యాయమూర్తులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దమ్మాలపాటి తన పిటిషన్‌లో పేర్కొన్నారని ప్రస్తావించారు. ‘‘ఇలాంటి చర్యలు దురదృష్టకరం. దాన్ని నేను సమర్థించడంలేదు. అయితే... ఫిర్యాదు వచ్చినప్పుడు దర్యాప్తు చేయాలా వద్దా?’’ అని రాజీవ్ ధవన్ ప్రశ్నించారు. దాంతో ఈ వ్యవహారంపై విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రతివాదుల తరఫు వాదనలు వింటామని తెలిపింది. అయితే, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై కూడా నిర్ణయం తీసుకోవాలని ధవన్ విజ్ఞప్తి చేశారు. దాన్ని కూడా పరిశీలిస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అదే సమయంలో ప్రభుత్వం తరఫున హాజరైన మరో సీనియర్ న్యాయవాది పరాస్ కుహాద్ వాదనలు వినిపించడానికి ప్రయత్నించారు. ప్రభుత్వం తరఫున ధవన్ ఇప్పటికే వాదనలు వినిపించినందున ఇతర న్యాయవాదులకు అవకాశం ఇవ్వబోమని తేల్చిచెప్పింది. దమ్మాలపాటి శ్రీనివాస్ తరఫున న్యాయవాదులు విచారణకు హాజరై వాదనలు వినిపించిన నేపథ్యంలో... పిటిషన్‌లోని ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదిగా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేయనందున తాము కూడా నోటీసులు ఇవ్వడం లేదని స్పష్టం చేసింది.
కక్ష సాధింపుతోనే...
25 అవినీతి కేసులు ఎదుర్కొంటున్న ప్రస్తుత ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా గతంలో దమ్మాలపాటి వాదించారని... అందుకే ఇప్పుడు కక్ష సాధిస్తున్నారని సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. న్యాయవాదులను టార్గెట్ చేయడమేంటని అడిగారు. ‘‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతికి సంబంధించి ప్రస్తుత సీఎం కేసులు ఎదుర్కొంటున్నారు. 16 నెలలు జైలుకు కూడా వెళ్లారు. ఈ పరిణామాల రీత్యా రాజకీయంగా కక్ష సాధించే ప్రయత్నం చేస్తున్నారు’’ అని సాల్వే తెలిపారు. రాజధా ని నిర్ణయం విషయంలో రహస్యమేమీ లేదని స్పష్టం చేశారు. విజయవాడ-గుంటూరు ప్రాంతంలో అంతర్జాతీ య స్థాయిలో రాజధాని ఏర్పాటవుతుందని మీడియా కథనాలు వచ్చాయని సాల్వే తెలిపారు. ఆ ప్రాంతంలో రాజధాని ఉంటుందని 2014 జూన్‌లోనే ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీఎం తల్లికి వ్యతిరేకంగా నమోదైన కేసుల్లోనూ దమ్మాలపాటి వాదించారని ముకుల్ రోహత్గీ తెలిపారు. ‘‘30 ఏళ్లుగా న్యాయవాదిగా ఉన్న దమ్మాలపాటి ప్రతిష్ఠను దెబ్బతీయడానికి, మరికొందరిని అపఖ్యాతిపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
హైకోర్టులో దమ్మాలపాటి పిటిషన్ దాఖలు చేయకముందే దర్యాప్తు చేయాలని సీబీఐకి, ఆదాయపు పన్ను శాఖకు రాష్ట్ర ప్రభుత్వం రహస్య లేఖ రాసింది. 2010-11 ఆర్థిక సంవత్సరాల నుంచి దమ్మాలపాటి చేసిన ఆదాయపు పన్ను రిటర్ను ల వివరాలను తమకు అందించాలని రాష్ట్ర స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆదాయపు పన్ను శాఖకు లేఖ రాశారు. ఇలా రహస్యంగా దర్యాప్తు ఎందుకు చేయా లి? ఐటీ వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేయాల్సిన అవసరం ఏమిటి? రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఉందా?’’ అని రోహత్గీ ప్రశ్నించారు. సీబీఐ కూడా రాష్ట్ర ప్రభుత్వ లేఖ కు స్పందించలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాతే ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందని వివరించారు. అందుకే హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఎఫ్‌ఐఆర్‌లోని వివరాలు లేవని తెలిపారు. ఇక.. ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలు బయట పెట్టవద్దని హైకోర్టు ఆదేశించకముందే టీవీల్లో ఎఫ్‌ఐఆర్‌పై కథనాలు వచ్చాయని చెప్పారు. రాజధాని అక్కడే వస్తుందన్న రహస్య సమాచారం ముందే తెలిసిందనడం సరికాదని ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. ‘‘నోయిడాలో విమానాశ్రయం వస్తుంది. దాంతో ఆ పరిసరాల్లో ప్రజలు భూములు కొనుగోలు చేస్తారు. అది తప్పెలా అవుతుంది?’’ అని ప్రశ్నించారు.
ఇది దొరతనపు కక్షసాధింపు!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కేసులో వాదనలు వినిపించిన రాజీవ్ ధవన్... అప్పట్లో ‘దొరతనపు కక్ష సాధింపు’ అనే పదాలు వాడారని... ఇప్పుడు ఏపీలో కూడా అదే విధానం అనుసరిస్తున్నారని దమ్మాలపాటి శ్రీనివాస్ తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే పేర్కొన్నారు. దీనికి స్పందించిన ధవన్... ‘‘జయలలిత తరఫున వాదిస్తున్న సమయంలో ఈ పదాన్ని వాడాను. అయితే, ఆ కేసుల్లో జయలలితకు శిక్ష పడేది. కానీ, అప్పటికి ఆమె మరణించారు. సహ నిందితురాలిగా ఉన్న శశికళకు శిక్ష పడింది’’ అని గుర్తు చేశారు. దొరతనపు కక్ష సాధింపు ఉండకూడదని ధవన్ అంగీకరించారు. అలాగని... గత ప్రభుత్వ హయాంలో జరిగిన క్రిమినల్ చర్యలపై తర్వాత వచ్చే ప్రభుత్వం దర్యాప్తు చేయకూడదని కాదని తెలిపారు.