విజయవాడ-హైదరాబాద్ హైవేపై వరద
ABN , First Publish Date - 2020-10-14T08:35:58+05:30 IST
కృష్ణాజిల్లాలో కుంభవృష్టి కురిసింది. జిల్లా సగటు వర్షపాతం 97.1 మి.మీ. నమోదైంది. విజయవాడలో గత పదేళ్లలో లేనంత గరిష్ఠంగా 162.8 మిల్లీమీటర్ల వర్షపాతం...

కృష్ణాజిల్లాలో కుంభవృష్టి కురిసింది. జిల్లా సగటు వర్షపాతం 97.1 మి.మీ. నమోదైంది. విజయవాడలో గత పదేళ్లలో లేనంత గరిష్ఠంగా 162.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2010లో 108.2 మిలీమీటర్ల వర్షం కురిసింది. ఆ తర్వాత ఆ స్థాయిలో వర్షం కురవలేదు. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా కురవడంతో నగర వీధులన్నీ జలమయమయ్యాయి. ఇంద్రకీలాద్రిపై ఓంకారం వద్ద కొండచరియలు విరిగి పడటంతో ఆలయ అధికారులు ఘాట్‌రోడ్డును మూసివేశారు. విజయవాడ విద్యాధరపురంలో ఇల్లు కూలిపోవడంతో తండు శంకరరావు(53) మరణించారు. మైలవరం నియోజకవర్గం గణపవరానికి చెందిన యువకుడు కొత్తపల్లి నవీన్ పెదలంకనుంచి ఎద్దులను తీసుకువస్తూ కొటికలపూడి వద్ద ఏనుగుగడ్డవాగులో గల్లంతయ్యాడు.
అతని ఆచూకీ కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. మునగచర్ల వద్ద విజయవాడ-హైదరాబాద్ హైవే వర్షపునీటి ప్రవాహం కారణంగా రాకపోకలు స్తంభించాయి. బుడమేరు, తమ్మిలేరు, తదితర వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో కైకలూరు-ఏలూరు తదితర ప్రాంతాలమధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో 10,221 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు.