న్యాయ వ్యవస్థనూ శాసిస్తారా?
ABN , First Publish Date - 2020-08-16T09:51:55+05:30 IST
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ చేసే ప్రయత్నం జరిగిందని వార్తలు ..

సీఎం జగన్‌పై టీడీపీ నేతల ధ్వజం
అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ చేసే ప్రయత్నం జరిగిందని వార్తలు వస్తున్నాయని, ఇది చాలా తీవ్రమైన నేరమని, ఇంతకన్నా దారుణం ఏముందని ప్రతిపక్షం టీడీపీ నేతలు పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థను కూడా ప్రభుత్వం శాసించాలని అనుకుంటోందా? అని నిలదీశారు. అనేక అక్రమాలకు పాల్పడుతున్న జగన్ ప్రభుత్వం ఆ భయంతోనే ఇలాంటి చర్యలకు ఒడిగడుతోందని విమర్శించారు. ఈ మేరకు శనివారం టీడీపీ అధికార ప్రతినిధి బొండా ఉమా మహేశ్వరరావు ఒక ప్రకటన చేశారు. ‘‘జగన్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజల హక్కులను కాలరాస్తోంది. న్యాయమూర్తుల ఫోన్లతోపాటు టీడీపీ నేతలు, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలతోపాటు అనేక మంది ఫోన్లు ట్యాప్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంశంలోనే గతంలో కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే ప్రభుత్వం కూలిపోయింది. ఫోన్ టాపింగ్‌కు పాల్పడటం చట్ట వ్యతిరేకం. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న జగన్ ప్రభుత్వం తన చర్యల ద్వారా తన అవినీతిని తనకు తానే రుజువు చేసుకొంటోంది. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తూ విధ్వంసపాలన కొనసాగిస్తున్నారు. నేర స్వభావంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల స్వేచ్ఛను హరిస్తున్నారు’’ అని బొండా ఉమ విమర్శించారు.
ట్యాపింగ్ హేయం: వర్ల
న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయని, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యంలో సిగ్గుచేటని, హేయమైన చర్య అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య దుయ్యబట్టారు. ‘‘రాష్ట్రంలో దళిత వ్యతిరేక పాలన నడుస్తోంది. సామాన్యులకే కాక న్యాయమూర్తులకు కూడా స్వేచ్ఛ కరువైంది. స్వతంత్రంగా పనిచేసే న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్‌లకు పాల్పడుతూ వారి విధులకు అడ్డుపడటం సిగ్గుచేటు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడుతున్న న్యాయ వ్యవస్ధపై ప్రభుత్వం చేస్తున్న దాడిని ప్రజలు గమనిస్తున్నారు. న్యాయ వ్యవస్ధను కూడా తమ గుప్పిట్లో పెట్టుకోవాలనే దుర్మార్గపు చర్యలకు జగన్ ప్రభుత్వం దిగడం రాజ్యాంగ విరుద్ధం కాదా? ఒకవైపు నీతులు చెబుతూ మరో పక్క రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడటం హేయం’’ అని వర్ల విమర్శించారు.