ఉత్పత్తి లేదు.. ఆదాయం రాదు

ABN , First Publish Date - 2020-04-12T07:02:11+05:30 IST

తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆదాయం సమకూర్చే చిన్న, మధ్యతరగతి పరిశ్రమ...

ఉత్పత్తి  లేదు.. ఆదాయం రాదు

  • కరోనా కష్టాలు.. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు
  • ఎగుమతుల్లేవు. దిగుమతుల్లేవు 
  • చిన్న, మధ్య పరిశ్రమల మనుగడకే ముప్పు
  • 2 వేల కోట్లు బకాయిపడిన ప్రభుత్వం
  • ఏడాదికిపైగా ప్రోత్సాహకాలు పెండింగ్‌
  • ఇవన్నీ ఇస్తేనే కొంతైనా ఊరట 
  • లేదంటే మూతపడడం ఖాయం
  • పారిశ్రామిక వర్గాల ఆవేదన


అమరావతి, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆదాయం సమకూర్చే చిన్న, మధ్యతరగతి పరిశ్రమ(ఎ్‌సఎంఎ్‌సఈ)లను కరోనా కష్టాలు చుట్టుముడుతున్నాయి. సుదీర్ఘ లాక్‌డౌన్‌తో ఉత్పత్తి ఆగిపోవడం, ఎగుమతి, దిగుమతులు నిలిచిపోవడంతో వాటికి ఆదాయమే లేకుండా పోయింది. అదే సమయంలో కార్మికులు వేతనాలు, ఇతర స్థిర ఖర్చుల చెల్లింపు భారంగా మారుతోంది. ఫలితంగా.. అసలే అంతంత మాత్రంగా ఉన్న వాటి ఆర్థిక పరిస్థితి మరింత ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. ఇప్పటివరకు జరిగిన పరిణామాలు ఒక ఎత్తయితే.. భవిష్యత్‌ ఎలా ఉంటుందన్నది అగమ్యగోచరంగా ఉందని ఆయా పారిశ్రామిక వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ తర్వాత ఈ కష్టాల నుంచి గట్టెక్కాలంటే ప్రభుత్వం తమకు ఇవ్వాల్సిన ప్రోత్సాహక బకాయిలు ఇస్తేనే కొంతైనా ఊరట లభిస్తుందని అంటున్నారు. ప్రభుత్వం చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు ఇవ్వాల్సిన పెట్టుబడి రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలు కలిపి సుమారు రూ.2వేల కోట్లున్నాయి. వాస్తవానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి వీటిని చెల్లించాలి. అయితే 2018 డిసెంబరు తర్వాత ఈ ప్రోత్సాహకాలను చెల్లించలేదని సమాచారం. సుమారుగా ఏడాది పైనుంచి ఎంఎ్‌సఎంఈలకు వీటిని చెల్లించలేదు. టెక్స్‌టైల్స్‌ రంగంలోని చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు కలిపి చెల్లించాల్సిన బకాయిలు రూ.1,500 కోట్లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో సుమారు రూ.120 కోట్లు, ఆక్వా రంగ పరిశ్రమలకు రూ.100కోట్లు బకాయిలు ఉన్నాయి.  కొన్ని ఇతర రంగాల పరిశ్రమలకూ ఇలాంటి బకాయిలు ఉన్నాయని సమాచారం.


మధ్యలో ఆగినవి కొన్ని..

రాష్ట్రంలో టెక్స్‌టైల్స్‌, ఆహారశుద్ధి, ఆక్వా తదితర రంగాల్లో పలు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిని నెలకొల్పే సమయంలో అవసరమయ్యే పెట్టుబడిలో కొంత ప్రమోటర్‌, కొంత బ్యాంకు రుణం, మరికొంత ప్రభుత్వ ప్రోత్సాహకంగా ఉంటుంది. ఈ మూడూ భాగాలు కలిస్తేనే పరిశ్రమ స్థాపన పూర్తవుతుంది. ఇలాంటివి అన్ని రంగాల్లో కలిపి సుమారు 200 పరిశ్రమలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు నిర్మాణ, స్థాపన దశల్లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి రావలసిన పెట్టుబడి రాయితీ రాకపోవడం వల్ల పలు పరిశ్రమల స్థాపన మధ్యలోనే ఆగిపోయింది. కొందరికి ప్రభుత్వం ఆ తర్వాత రాయితీలిచ్చినా..

ముందు పరిశ్రమ నిర్మాణం పూర్తిచేయాలన్న సంకల్పంతో అప్పులు చేసి మరీ కిందామీద పడుతున్నారు. మరికొందరు తమ వల్ల కాదని వదిలేస్తున్నారు. ఇప్పుడు కరోనా, లాక్‌డౌన్‌ ప్రభావంతో పరిస్థితి మరింత ఇబ్బందిగా మారనుందని పలువురు పేర్కొంటున్నారు. ఇలా నిర్మాణ దశల్లో ఉన్న పరిశ్రమలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించాలంటున్నారు. మరోవైపు.. ఇప్పటికే నడుస్తున్న పరిశ్రమలకు సంబంధించి...ఇవ్వాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలు కూడా ఉన్నాయి. వీటిలో చాలా భాగం కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తే.. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు ఇవ్వాలి. కేంద్రం వాటా నిధులు వచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని వేరే అవసరాలకు వినియోగించుకుని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది సహజంగా చాలాచోట్ల జరిగే ప్రక్రియే అయినా...ఈ లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇప్పుడు ఎంఎ్‌సఎంఈలకు బకాయిలు సర్దుబాటు చేయకుంటే మాత్రం ఇబ్బంది అవుతుందని సంబంధిత వర్గాలు వాపోతున్నాయి.    


ఆదాయానికి, ఉపాధికి గండి

లాక్‌డౌన్‌ అనంతరం ఎంఎ్‌సఎంఈలకు ఇవ్వాల్సిన  నిధులను విడుదల చేయడమే కాకుండా.. వాటిని సరైన రీతిలో ఆదుకోకపోతే ఆ ప్రభావం రాష్ట్ర ఆదాయం, యువత ఉద్యోగాలపైనా పడుతుందని అంటున్నారు. పరిశ్రమలు నడవలేని పరిస్థితి వస్తే.. లేదంటే వాటి ఆదాయాలు తగ్గిపోతే ఆ మేరకు ఉద్యోగుల సంఖ్యలో కోత విధిస్తాయి. ఈ ఉద్యోగాల కోత మరింతమంది జీవితాలపై దుష్ప్రభావం చూపుతుంది. అదే సమయంలో ప్రభుత్వ ఆదాయంలోను కొంత కోత పడుతుంది. ఉదాహరణకు మ్యాంగో పల్ప్‌ తయారుచేసే పరిశ్రమను తీసుకుంటే.. అది తయారైన ఉత్పత్తిపై అటు కేంద్ర, ఇటు రాష్ట్ర జీఎ్‌సటీని చెల్లిస్తుంది. పరిశ్రమ ఇబ్బందుల్లో ఉండి నడవకుంటే ఈ జీఎ్‌సటీ ఆదాయం ప్రభుత్వానికీ తగ్గుతుంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కష్టాలను ఎదుర్కోవడానికి బకాయిలు విడుదలతో పాటు ఇతరత్రా ప్రోత్సాహకాలు ఇస్తే తప్ప పరిశ్రమల మనుగడ, ఉపాధి అవకాశాలు, ఆదాయాల సముపార్జన జరిగే పరిస్థితి ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Updated Date - 2020-04-12T07:02:11+05:30 IST