కాంట్రాక్టు ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు
ABN , First Publish Date - 2020-11-13T08:35:30+05:30 IST
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయం న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున, ఆ ఇబ్బందులు తలెత్తకుండా వారికి ఆర్థిక ప్రయోజనాలు
క్రమబద్ధీకరణకు న్యాయ సమస్యలున్నాయన్న సీఎం
విధివిధానాలు రూపొందించాలని అధికారులకు ఆదేశం
సీపీఎస్, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై సమీక్ష
కాంట్రాక్టు ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు
అమరావతి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయం న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున, ఆ ఇబ్బందులు తలెత్తకుండా వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చేందుకు తగిన విధివిధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఉద్యోగుల సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాలపై గురువారం ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం కొన్ని జీవోలు జారీ చేసి, వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ అమలు చేశామని సీఎం చెప్పారు. కనీస వేతన స్కేల్ కూడా అమలు చేశామన్నారు. కాగా, సీపీఎ్‌సకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారులు సమావేశంలో వివరించారు. సీపీఎ్‌సపై ఏర్పాటుచేసిన మంత్రుల బృందం, సీఎస్ నేతృత్వంలో వివిధ శాఖల కార్యదర్శుల కమిటీలు, అంతకు ముందు ఇచ్చిన టక్కర్ కమిటీ నివేదికను కూడా పరిశీలించినట్టు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో 1,98,221 మంది సీపీఎ్‌సలో ఉన్నారని, వారిలో నేరుగా ప్రభుత్వ ఉద్యోగులు 1,78,705 మంది, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 3,295 మంది ఉండగా మిగిలిన 16,221 మంది యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో పనిచేస్తున్నారని చెప్పారు. వారికి ఏ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తే ఎంత వ్యయం అవుతుందన్న వివరాలను అధికారులు వివరించారు. కాగా, ప్రభుత్వంలో విలీనం చేసిన ఆర్టీసీకి చెందిన దాదాపు 52 వేల మంది ఉద్యోగులను కూడా ఆ జాబితాలో చేర్చి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.