పెద్దల సభలో తన్నుకున్నారు

ABN , First Publish Date - 2020-06-18T08:34:30+05:30 IST

విద్య, దేవదాయ, ఎక్సైజ్‌, రెవెన్యూ, మునిసిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖలకు చెందిన బిల్లులు ఆమోదం పొందాయి. ఆ తర్వాత... అత్యంత కీలకమైన మూడు రాజధానులు, రాజధాని నగర ప్రాంత అభివృద్ధి సంస్థ బిల్లులు, ద్రవ్య వినిమయ బిల్లుల ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు

పెద్దల సభలో తన్నుకున్నారు

  • తిట్ల దశ దాటి కొట్టుకున్న వైనం
  • ఎమ్మెల్సీ బీదను తన్నిన మంత్రి వెలంపల్లి
  • తిరిగి కొట్టిన బీద రవిచంద్ర
  • తొడకొట్టి మంత్రి అనిల్‌ సవాల్‌
  • ‘ఏరా’ అంటూ బాబూ రాజేంద్రపైకి
  • ‘ఏ బిల్లు ముందు’పై వాగ్వాదం
  • ముందు బడ్జెట్‌ ఆమోదానికి టీడీపీ...
  • రాజధానుల బిల్లులే ముందన్న వైసీపీ
  • వ్యూహ ప్రతివ్యూహాలతో సభలో వేడి
  • దూషణలతో అదుపు తప్పిన మండలి
  • బడ్జెట్‌ ఆమోదించకుండానే నిరవధిక వాయిదా
  • ఆ తర్వాత అనూహ్య పరిణామాలు


అమరావతి, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): శాసన మండలిలో పలు కీలక బిల్లులను ప్రవేశ పెడుతున్న నేపథ్యంలో సభ ప్రారంభానికి ముందే ఉత్కంఠ నెలకొంది. బడ్జెట్‌ను ఆమోదించిన తర్వాత మండలిని వాయిదా వేసేస్తారనే సందేహంతో అధికార పక్షం... మూడు రాజధానుల బిల్లును తిరస్కరించిన పక్షంలో ప్రభుత్వం తనపని తాను చేసుకుపోవడానికి మార్గం సుగమమవుతుందనే ఉద్దేశంతో విపక్షం భావిస్తూ తమదైన వ్యూహాలను రచించుకున్నాయి. మండలి సభ్యులైన ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాశ్‌ చంద్రబోస్‌, మంత్రి మోపిదేవి వెంకటరమణతోపాటు... ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు బొత్స సత్యనారాయణ, పినిపె విశ్వరూప్‌, పెద్దిరెడ్ది రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, అవంతి శ్రీనివాసరావు, ఆదిమూలపు సురేశ్‌, కురసాల కన్నబాబు, అనిల్‌ కుమార్‌ మండలిలో మోహరించారు. తొలుత నాగజగదీశ్వరరావు, మంత్రి అనిల్‌ మధ్య వాగ్వాదంతో సభలో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో మండలిని చైర్మన్‌ షరీఫ్‌ వాయిదా వేశారు. ఆ తర్వాత చైర్మన్‌ స్థానంలో డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం కుర్చున్నారు. బడ్జెట్‌పై చర్చను కొనసాగించారు. అనంతరం ప్రభుత్వం పంపిన బిల్లులను చర్చకు పెట్టారు.


విద్య, దేవదాయ, ఎక్సైజ్‌, రెవెన్యూ, మునిసిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖలకు చెందిన బిల్లులు ఆమోదం పొందాయి. ఆ తర్వాత... అత్యంత కీలకమైన మూడు రాజధానులు, రాజధాని నగర ప్రాంత అభివృద్ధి సంస్థ బిల్లులు, ద్రవ్య వినిమయ బిల్లుల ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు... రాజ్యాంగపరంగా తప్పనిసరి అయిన ద్రవ్య వినిమయ బిల్లును ముందుగా ఆమోదిద్దామని ప్రతిపాదించారు. అందుకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి ప్రతిపాదన చేసేందుకు సిద్ధంకాగా... మునిసిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వారించారు. ఇతర బిల్లులన్నీ ఆమోదం పొందాకే ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించి, సభను నిరవధికంగా వాయిదా వేయడం సంప్రదాయంగా వస్తోందన్నారు. దానినే కొనసాగించాలని పట్టుబట్టారు. అదేంకాదు... ముందు ద్రవ్య వినిమయ బిల్లునే ఆమోదించాలని టీడీపీ డిమాండ్‌ చేసింది. ఈ అంశం ఎటూ తెగకపోవడంతో.. డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సబ్రహ్మణ్యం సభను అరగంటసేపు వాయిదా వేశారు. సభ మరోసారి ప్రారంభమయ్యాకా పరిస్థితి మారలేదు. ద్రవ్య వినిమయ బిల్లును ముందుగా ఆమోదించుకుందామని డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రతిపాదించారు.


ఇందుకు మంత్రులు ససేమిరా అన్నారు. ‘‘యనమల రామకృష్ణుడి ఆదేశాలను పాటించేందుకు ఇది టీడీపీ కార్యాలయం కాదు’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై తెలుగుదేశం పార్టీ సభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ‘ఏది ముందు’ అనే వాగ్వాదం కొనసాగుతుండగానే... గతంలో అసెంబ్లీలో ఆమోదం పొంది, శాసనమండలిలో సెలక్ట్‌ కమిటీకి పంపిన మూడు  రాజధానులు, సీఆర్డీయే చట్టం రద్దు వంటి అంశాలు ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉన్నాయని యనమల చెప్పారు. అందువల్ల .. ఈ బిల్లులను ఆఖరులో పెట్టుకుని ముందుగా ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదింపజేసుకుందామని సూచించారు. సెలక్ట్‌ కమిటీ వేయకుండా అడ్డుపడుతున్న ప్రభుత్వం... మళ్లీ ఇవే బిల్లులను శాసనసభలో ఎందుకు ఆమోదించి పంపిందో తెలియడంలేదని అన్నారు. తాను ప్రతిపాదించినట్లుగా రూల్‌ 90ని పరిగణనలోకి తీసుకోవాలని యనమల పేర్కొనగా... ఈ నోటీసును ఒకరోజు ముందుగానే ఇవ్వాల్సి ఉంటుందని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ వాదించారు.


డిప్యూటీ లక్ష్యంగా విమర్శలు..

తొలుత బడ్జెట్‌ను ఆమోదించాలా... ఇతర బిల్లులను ఆమోదించాలా అనే అంశంపై వాదప్రతివాదనలు జరుగుతుండగానే .. డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం లక్ష్యంగా అధికార పక్షం విరుచుకు పడింది. దీంతో ఆయన తీవ్రంగా స్పందించారు. ‘‘రాజ్యాంగ వ్య వస్థలపై దాడులు చేస్తున్నారు. నా ఎస్కార్ట్‌ తీసేశారు. భద్రతను కుదించేశారు. నాకంటే స్థాయి తక్కువగా ఉన్న డిప్యూటీ స్పీకర్‌కు మాత్రం ప్రొటోకాల్‌ అమలవుతోంది’’ అని ఆక్రోశించారు. ఈ సమయం లో.. యనమల, పిల్లి సుభాశ్‌ చంద్రబోస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.  


మాటల మంటలు..

గందరగోళం కొనసాగుతుండగానే... మంత్రి అనిల్‌, టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్‌ల మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అంటూ వాగ్వాదం నడిచింది. ఏడాది పాలన గురించి ఎంపీ రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చెబుతారంటూ రాజేంద్ర ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలపై అనిల్‌ ఒక్కసారిగా మండిపడ్డారు. ‘ఏరా’ అని సంభోదిస్తూ ముందుకు దూసుకువెళ్లారు. ఈ సమయంలో అనిల్‌ను అధికార పక్ష సభ్యులే వారించారు. ఆ తర్వాత... ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించేందుకు తాము సిద్ధమేనని,  అధికారపక్షం కాదంటే రూల్‌  90 ప్రకారం తాము ఇచ్చిన నోటీసు మేరకు చర్చ జరగాలని యనమల ప్రతిపాదించారు. ఈ సమయంలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రతిపాదించాలని ఆర్థిక మంత్రి బుగ్గనకు డిప్యూటీ చైర్మన్‌ సూచించారు. అయితే.. ముందుగా ఇతర బిల్లులను ఆమోదింప జేసుకుందామని బుగ్గన పట్టుబట్టారు. ఆ సమయంలో యనమల రూల్‌ 90 నిబంధన ప్రకారం ఇచ్చిన నోటీసును ప్రస్తావించారు. అయితే.. ఒకరోజు ముందుగా నోటీసు ఇవ్వనందున నిబంధనలు అంగీకరించబోవని మంత్రులు అడ్డుపడ్డారు. యనమల ప్రసంగాన్ని రికార్డులనుంచి తొలగించాలని అన్నారు. ఈ సమయంలో ద్రవ్యవినిమయ బిల్లు, సీఆర్‌డీఏ చట్టం రద్దు, మూడు రాజధానుల బిల్లులు మినహా మిగిలిన బిల్లులను ఆమోదింప జేసుకుందామంటూ బొత్స సత్యనారాయణ  ప్రతిపాదించారు. అయితే.. యనమల ప్రసంగాన్ని రికార్డుల నుంచి తొలగించాల్సిందేనని పట్టుబట్టారు. దీనిపైనా వాగ్వాదం నడిచింది. ప్రతిపక్షం చెప్పినట్లుగా శాసనమండలి నడిస్తే ఎలా అని మంత్రి బుగ్గన మండిపడ్డారు. అధికార విపక్షాల మధ్య వాగ్వాదం తీవ్రమైంది. యనమల ప్రసంగాన్ని రికార్డులనుంచి తొలగించాలంటూ మంత్రులు స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టారు.


ఇలా కొట్టుకున్నారు..

అదే సమయంలో, రూల్‌ 90పై ఓటింగ్‌ జరగాలని టీడీపీ పట్టుబడుతూ నినాదాలు చేసింది. మాజీ మంత్రి లోకేశ్‌ కూడా ఓటింగ్‌ చేపట్టాలంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో శాసన మండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రకటించారు. ఇదే సమయంలో లోకేశ్‌ రెండు చేతులు పైకె త్తి పోడియంవైపు చూస్తుండగా.. ఆయన సెల్‌ఫోన్‌లో ఫొటో లు తీస్తున్నారనుకుని, ‘ఫొటోలు తీయవద్దు’ అని రెడ్డి సుబ్రమ ణ్యం మైక్‌లోనే చెప్పారు. పోడియంను చుట్టిముట్టిన తమ ఫొ టోలు తీస్తున్నారనే ఉద్దేశంతో... మంత్రి వెలంపల్లి ఆగ్రహంతో ఊగిపోయారు. లోకేశ్‌ వైపు దూసుకొచ్చారు. సరిగ్గా లోకేశ్‌ ముం దున్న బీద రవిచంద్ర మంత్రిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పట్టుతప్పిన మంత్రి వెలంపల్లి కిందపడిపోయారు. తనను కిందికి తోశారనే ఉద్దేశంతో... సినిమా ఫక్కీలో బీద రవిచంద్రను ఎగిరి తన్నారు. దీంతో బీద రవిచంద్ర కూడా మంత్రిని తన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్‌ తదితరులు వెలంపల్లిని... టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి తదితరులు బీద రవిచంద్రను వెనక్కి తీసుకెళ్లారు. ఈ సమయంలో ఇరుపక్షాలకు చెందిన సభ్యులు కాస్త గట్టిగానే తిట్టుకున్నారు. దీంతో  ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ‘మేం వినలేని స్థాయిలో బూతులు తిట్టుకున్నారు’ అని మహిళా ఎమ్మెల్సీలు వాపోయారు. తాను ఫొటోలు తీయలేదని లోకేశ్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2020-06-18T08:34:30+05:30 IST