తెలంగాణ స్ఫూర్తితో పోరాడండి

ABN , First Publish Date - 2020-12-15T09:12:08+05:30 IST

‘ప్రజలు ఏదైనా ప్రభుత్వం నుంచే ఆశిస్తారు. ప్రభుత్వంపై పోరాడితేనే ప్రతిపక్షంగా మనల్ని గుర్తిస్తారు. తెలంగాణలో

తెలంగాణ స్ఫూర్తితో పోరాడండి

ప్రభుత్వంపై పోరాడితేనే ప్రజలు గుర్తిస్తారు

రాష్ట్ర బీజేపీకి ఇన్‌చార్జి మురళీధరన్‌ హితవు


అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ‘ప్రజలు ఏదైనా ప్రభుత్వం నుంచే ఆశిస్తారు. ప్రభుత్వంపై పోరాడితేనే ప్రతిపక్షంగా మనల్ని గుర్తిస్తారు. తెలంగాణలో పార్టీ పోరాటాలను స్ఫూర్తిగా తీసుకోండి’ అని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి మురళీధరన్‌ హితవు పలికారు. తిరుపతిలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భాగంగా పార్టీ ముఖ్యులు చింతన్‌ బైఠక్‌లో పాల్గొని కీలక అంశాలపై చర్చించారు. ప్రజల సమస్యలు, తిరుపతి ఉప ఎన్నిక, తదితర అంశాలపై చర్చకు వచ్చినప్పుడు.. మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, దేశాభివృద్ధికి చేస్తున్న కృషి, రాష్ట్రానికి అందిస్తున్న సహకారంపై ప్రజల్లోకి నేరుగా వెళ్లి వివరించాలని పార్టీ జాతీయ సంఘటనా సంయుక్త ప్రధాన కార్యదర్శి సతీశ్‌జీ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఒక రాజ్యసభ సభ్యుడు అందుకుని ‘ఇక్కడ వైసీపీకి మనం అనుకూలమన్న సంకేతాలు ఇస్తున్నాం’ అని అనడంతో వీర్రాజు కలుగజేసుకుని.. మనకు వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీలు, వాటి విధానాలే అనడంతో.. మరి మీరెందుకు ఒక పార్టీ నాయకుడి పేరెత్తి మాట్లాడుతూ..


మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అంటున్నారని నిలదీశారు. వీర్రాజు మౌనం వహించగా ఆయన్ను సునీల్‌ దేవధర్‌ వెనకేసుకొచ్చినట్లు తెలిసింది. మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జోక్యం చేసుకొంటూ రాయలసీమ పార్టీ నేతలకు పార్టీ రక్షణగా నిలవాల్సి ఉందని, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి విషయంలో అది జరగడం లేదన్నారు. సతీశ్‌జీ కలుగజేసుకుని ప్రస్తుతానికి తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని ఎలా గెలిపించుకోవాలన్నదానిపైనే ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని సూచించినట్లు తెలిసింది. బీజేపీకి వైసీపీతో ఎలాంటి స్నేహ సంబంధాలు లేవని, రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలూ సమాన ప్రత్యర్థులేనని మురళీధరన్‌ స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. మంత్రి కొడాలి నాని ఏకంగా ప్రధాన మంత్రిపైనే వ్యాఖ్యలు చేస్తే తిరుపతిలో ఆయన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించిన పార్టీ నేతలను ఆపడం, కీలక నేతలు గట్టిగా స్పందించకపోవడం, రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసినా ఎక్కడా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం వంటివాటిపై ప్రజల్లో చర్చ జరుగుతోందంటూ మరికొందరు నేతలు ప్రస్తావించినట్లు తెలిసింది.

Updated Date - 2020-12-15T09:12:08+05:30 IST