ఫీజులు పోయాయి!

ABN , First Publish Date - 2020-12-26T06:54:47+05:30 IST

క్రిస్మస్‌ రోజున పేద విద్యార్థులకు జగన్‌ ప్రభుత్వం చేదు కానుక ఇచ్చింది.

ఫీజులు పోయాయి!

  • క్రిస్మస్‌ రోజే పీజీ పేద విద్యార్థులపై పిడుగు
  • ప్రైవేట్‌ కాలేజీల్లో చదివితే రీయింబర్స్‌ కట్‌ 
  • వారికి విద్యా, వసతి దీవెనలు అందవిక.. వర్సిటీ, ప్రభుత్వ కాలేజీలకే
  • వాటిలో పరిమిత సీట్లు.. దీంతో ప్రైవేట్‌, ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ వైపు
  • పేదవిద్యార్థుల ఉన్నత చదువుకు ఝలక్‌.. కాలేజీలకు 500 కోట్ల బకాయిలు
  • మరింత కుంగదీస్తూ ఉత్తర్వులు.. పేదల విదేశీ విద్యకు ఇప్పటికే మంగళం
  • లక్షల తల్లుల ‘ఒడి’కి ఎన్నో ఆంక్షలు.. తాజాగా రాలిన మరో ‘విద్యా’ రత్నం


చదువులు భారమయ్యాయి. డిగ్రీ చేసిన ఒక పేద విద్యార్థి ఎంబీఏ చదవాలంటే ఏటా రూ.30 వేలు... గ్రామీణ నేపథ్యం కలిగిన బడుగు విద్యార్థి ఎంఫార్మసీ చేయాలంటే ఏకంగా రూ.1.25 లక్షలు. ఈ ఫీజులు భారమే అయినా రీయింబర్స్‌ ఉండటంతో పేదలూ పీజీ కాలేజీల్లో చేరి.. కోరిన కోర్సు చేయగలుగుతున్నారు. ఇప్పుడిక వారికి ఆ చాన్స్‌ లేనట్టే! ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌, ఎయిడెడ్‌ పీజీ కాలేజీల్లో చదివితే.. రీయింబర్స్‌ వర్తించదని సర్కారు తేల్చేసింది. పైగా, ఇవ్వాల్సిన రూ.500 కోట్లు బకాయి అలా ఉండగానే, భారీ ‘ఆర్థిక’ బాంబును ఏకంగా ఈ కాలేజీలపై వేసేసింది.


(అమరావతి-ఆంధ్రజ్యోతి): క్రిస్మస్‌ రోజున పేద విద్యార్థులకు జగన్‌ ప్రభుత్వం చేదు కానుక ఇచ్చింది. ప్రైవేట్‌, ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ కళాశాలల్లో చదివే పీజీ విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరం నుంచి జగనన్న విద్యాదీవెన (ఆర్టీఎఫ్‌) జగనన్న వసతి దీవెన(ఎంటీఎఫ్‌) నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. యూనివర్సిటీ కళాశాలలు, ప్రభుత్వ పీజీ కళాశాలలకే ఈ పథకాలను పరిమితం చేసింది. ఏటా 70వేలమంది పేద విద్యార్థులు పీజీ కాలేజీల్లో చేరుతున్నారు. యూనివర్సిటీ కళాశాలలు, ప్రభుత్వ పీజీ కాలేజీల్లో సీట్లు పరిమితంగా ఉంటాయి. కాబట్టి, ఎక్కువమంది ప్రైవేటు, ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ కాలేజీలను ఆశ్రయించాల్సిందే. ఫీజు రీయింబర్స్‌ సాయంతో ఆ కాలేజీల్లో వారు ఇప్పటిదాకా విద్యను అభ్యసించగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బి. రాజశేఖర్‌ విడుదల చేసిన ఉత్తర్వులు పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యార్థులను నివ్వెరపరిచాయి. యూనివర్సిటీ కళాశాలలు, ప్రభుత్వ పీజీ కళాశాలలు మినహా మిగతా ఏ కళాశాలలో చదవాలన్నా ఇకనుంచి పేద విద్యార్థులు చచ్చినట్టు  వేలకు వేలు ఫీజులు చెల్లించాల్సిందే! క్రిస్మస్‌ పండుగ రోజునే ప్రభుత్వం పేద, బడుగు వర్గాల విద్యార్థులకు ఇలాంటి ఝలక్‌ ఇవ్వడమేంటని అధికారవర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. 


రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో తెచ్చిన పథకం ఫీజు రీయింబర్స్‌మెంట్‌. జగన్‌ ప్రభుత్వం కూడా తండ్రి బాటలో నడవాలన్న ఉద్దేశంతో పేద విద్యార్థులకు సంబంధించిన పలు సంక్షేమ పథకాలకు మెరుగులు దిద్ది ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆర్భాటాలు చేసింది. ఈ క్రమంలోనే గతంనుంచి అమల్లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం, స్కాలర్‌షిప్‌ పథకాలను మార్పులు, చేర్పులు చేసి హడావుడి చేసింది. వాటి స్థానంలో జగనన్న విద్యాదీవెన.. జగనన్న వసతి దీవెన పథకాలను తెచ్చింది. ఈ మేరకు గత ఏడాది నవంబరు 30న జీఓ నెం.115 విడుదల చేసింది కూడా! ఐటీఐ నుంచి పీహెచ్‌డీ వరకు చదివే పేద విద్యార్థులకు ‘జగనన్న విద్యాదీవెన’ పేరుతో పూర్తి ఫీజును రీయింబర్స్‌మెంట్‌ చేస్తామని మార్గదర్శకాలను సవరించింది. గతంలో ఇస్తున్న స్కాలర్‌షిప్పుల స్థానంలో జగనన్న వసతి దీవెన పేరుతో పథకాన్ని అమల్లోకి తెచ్చింది. గతంలో ఇస్తున్న స్కాలర్‌ ఫీజులను పెంచి  పీజీ చదువుకునే విద్యార్థులకు హాస్టల్‌ ఖర్చుల కోసం రూ.20 వేలు మంజూరుచేయాలని నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద విద్యార్థులను ఈ నిర్ణయం ఆనందపరిచింది. వారి ఆనందాన్ని ఆవిరి చేసేస్తూ, తాజా ఉత్తర్వులు విడుదల అయ్యాయి. 


చదువులు సాగేదెలా?

సాధారణంగా సంప్రదాయ డిగ్రీ కోర్సులు పూర్తి చేస్తున్న విద్యార్థుల్లో ఎక్కువమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద విద్యార్థులే. గ్రామీణ నేపథ్యాలనుంచి వచ్చే ఈ విద్యార్థుల్లో ఎక్కువమంది ఇంజనీరింగ్‌, మెడికల్‌ చదువుల వైపు మొగ్గుచూపడం లేదు. డిగ్రీ అనంతరం ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంబీఏ, ఎంఈడీ, ఎంఎల్‌ కోర్సుల వైపు మొగ్గుతుంటారు. వీరి సంఖ్య ఏటా వేలల్లోనే ఉంటుంది. సాంఘిక సంక్షేమశాఖ ఇచ్చిన తాజా ఉత్తర్వులతో ఈ వర్గాల పేద విద్యార్థులు చాలావరకు ఉన్నత చదువులకు దూరం అయినట్టే! ఒక పేద విద్యార్థి ఎంబీఏ చదవాలంటే ప్రతి ఏటా సుమారు రూ.30 వేలు ఫీజులు చెల్లించాలి. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన తనకు నిలిపిస్తే.. తమ చదువులు ఆగిపోతాయని పలువురు పేద విద్యార్థిలు వాపోతున్నారు. ఇక.. ఎంఫార్మసీ కోర్సుకు భారీగా రూ.1.25 లక్షల ఫీజు ఉంటుంది. ఈ ఫీజు పేద విద్యార్థులకు భారమే. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో హడావుడి ఉత్తర్వులు చేసిందే తప్ప ఒక్కటీ అమలు చేసిన దాఖలాల్లేవు. కళాశాలలకు చెల్లించాల్సిన బకాయిలు విషయంలో నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. పీజీ కోర్సులు నిర్వహిస్తున్న కళాశాలల యాజమాన్యానికి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. ఓ వైపు ఇంజనీరింగ్‌ కళాశాలలకు కొంత మేర ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించిన ప్రభుత్వం... పీజీ కళాశాలల గురించి పట్టించుకోనే లేదు. ప్రస్తుతం ఈ కాలేజీలకు సుమారు రూ.550 కోట్లు బకాయి పడింది. అవేమీ పట్టించుకోకుండా,  ఆ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఏకంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిలిపివేసింది. 


ఒక్కో పథకానికి స్వస్తి...

చంద్రబాబు ప్రభుత్వం పేద విద్యార్థులకు విదేశాల్లో చదివేందుకు అవకాశం కల్పించింది. ఒక్కో విద్యార్థికి విదేశాల్లో చదువుకునేందుకు రూ.15 లక్షలిచ్చి ప్రోత్సహించింది. ఈ ప్రభుత్వం రాగానే ఆ పథకానికి మంగళం పాడింది. ఈ పథకాన్ని అదేరూపంలో, లేదంటే మార్పులు చేసి అమలు చేస్తారా.. అసలు తిరిగి తెచ్చే ఉద్దేశం ఉందా లేదా అనేది కూడా స్పష్టతనివ్వడం లేదు. పైగా గత ప్రభుత్వ కాలంలో విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజుల బకాయిలను కొత్త ప్రభుత్వం రాగానే, నిలిపేసింది. ఒక్కో ఏడాది ఒక్కో మెలిక పెడుతూ లక్షలమంది అమ్మలకు ఇవ్వాల్సిన ‘అమ్మఒడి’నీ ఆంక్షల చిక్కుల్లోకి నెట్టేశారు. ఇలా చదువులకు సంబంధించిన నవరత్నాల పథకాల్లో ఒక్కొక్క రత్నం రాలిపోతోంది.

Updated Date - 2020-12-26T06:54:47+05:30 IST