ఫీజు రీయింబర్స్‌కు షరతులు!

ABN , First Publish Date - 2020-03-24T09:18:52+05:30 IST

ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తామని ఉదారంగా ప్రకటించిన ప్రభుత్వం... ఆచరణలో

ఫీజు రీయింబర్స్‌కు షరతులు!

జాబితాలో చేర్చాలంటూ ముందుగానే కాలేజీలు దరఖాస్తు చేసుకోవాలట!

ఆర్థికభారం తగ్గించుకునేందుకు సర్కారు ఎత్తుగడ  

అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తామని ఉదారంగా ప్రకటించిన ప్రభుత్వం... ఆచరణలో మాత్రం ఇందుకయ్యే ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ద్వారా ఇప్పటికే ఇంజనీరింగ్‌ కాలేజీలకు ట్యూషన్‌ ఫీజులో భారీగా కోత విధి స్తూ సిఫారసులు తెప్పించుకున్న ప్రభుత్వం... వాటిని అధికారికంగా ప్రకటించకుండానే ‘జగనన్న విద్యా దీవెన’కు మార్గదర్శకాలంటూ సోమవారం కొత్త ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం నుంచి ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కావాలనుకునే విద్యాసంస్థలు తమను జాబితాలో చేర్చాలని కోరు తూ దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. గతంలో ఈ పద్ధతి లేదు. కనీసం తమ ఫీజు ఎంతో తెలియకుండానే మార్గదర్శకాలకు ఒప్పుకోవాలంటూ ప్రభుత్వం స్పష్టం చేయడంపై కాలేజీల యాజమాన్యాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఒక పద్ధతి అంటూ లేకుండా ఫీజులను సిఫారసు చేయించుకుని,    అదనపు భారం పడకుండా ప్ర భుత్వం జాగ్రత్త పడుతున్నట్లు వీటి  ద్వారా తెలుస్తోందని కాలేజీలు అంటున్నాయి. విద్యాసంస్థలు కోర్టులకు వెళ్లకుండా కట్టడి చేయడం కూడా దీని ఉద్దేశమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


మార్గదర్శకాలు ఇలా..

నోటిఫై చేసిన ఫీజులను ఒప్పుకోవాలి.

క్యాపిటేషన్‌ ఫీజు తీసుకోరాదు.

విద్యార్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లను కాలేజీలు తమ వద్ద ఉంచుకోరాదు.

యూజీసీ, ఏఐసీటీఈ, పీసీటీ, ఉన్నత విద్యామండళ్లు ఎప్పటికప్పుడు ఇచ్చే మార్గదర్శకాలను పాటించాలి. 

ఆన్‌లైన్‌ అడ్మిషన్‌/అఫిలియేషన్‌ మాడ్యూల్స్‌ను అనుసరించాలి.

విద్యాసంస్థలు తమ అకడమిక్‌ పెర్ఫార్మెన్స్‌ రికార్డును అప్‌లోడ్‌ చేయాలి.

బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ను అమలు చేయాలి.

సెక్యూరిటీ/డేటా రహస్యాల ప్రొటోకాల్‌ను పాటించాలి.


వసతి దీవెనకు 1090 కోట్లు

రాష్ట్రంలోని విద్యార్థులకు స్కాలర్‌షిప్పులకు బదులుగా అందిస్తున్న ‘జగనన్న వసతి దీవెన’కు వచ్చే ఏడాది బడ్జెట్‌లో రూ1090 కోట్లకు అన్ని సంక్షేమశాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. ఈ పథకం కింద 11.36 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పించనున్నారు.

Read more