-
-
Home » Andhra Pradesh » Fear of worst actions
-
‘చెత్త’ చర్యలకు బెదరం
ABN , First Publish Date - 2020-12-27T07:50:18+05:30 IST
బ్యాంకుల ఎదుట చెత్తను డంపింగ్ చేసిన అధికారులందరినీ తక్షణమే తొలగించాలని, ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించాలని ‘యునైటెడ్ ఫోరం ఆఫ్ వుయ్ బ్యాంకర్స్’ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీఎం జగన్‌కు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి అశిష్ మిశ్రా బహిరంగ లేఖ రాశారు. ‘ప్రస్తుత కరోనా విలయంలోనూ ఆరోగ్య కార్యకర్తలకు దీటుగా ప్రజలకు అవిరళ సేవలందించింది బ్యాంకర్లే. మీ ప్రభుత్వం సహా దేశంలోని అన్ని ప్రభుత్వాలూ అమలుపరచే అన్ని సంక్షేమ పథకాల ఫలితాలు అందరికీ అందేలా చేస్తోందీ వీరే.

- నిబంధనలకు లోబడే రుణాలిస్తాం
- సీఎంకు ‘యునైటెడ్ ఫోరం ఆఫ్ వుయ్
- బ్యాంకర్స్’ ప్రధాన కార్యదర్శి బహిరంగ లేఖ
అమరావతి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): బ్యాంకుల ఎదుట చెత్తను డంపింగ్ చేసిన అధికారులందరినీ తక్షణమే తొలగించాలని, ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించాలని ‘యునైటెడ్ ఫోరం ఆఫ్ వుయ్ బ్యాంకర్స్’ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీఎం జగన్‌కు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి అశిష్ మిశ్రా బహిరంగ లేఖ రాశారు. ‘ప్రస్తుత కరోనా విలయంలోనూ ఆరోగ్య కార్యకర్తలకు దీటుగా ప్రజలకు అవిరళ సేవలందించింది బ్యాంకర్లే. మీ ప్రభుత్వం సహా దేశంలోని అన్ని ప్రభుత్వాలూ అమలుపరచే అన్ని సంక్షేమ పథకాల ఫలితాలు అందరికీ అందేలా చేస్తోందీ వీరే. మీతో సహా పలు ప్రభుత్వాలు తెచ్చే ఆచరణ సాధ్యంకాని పథకాల అమలుతో తలెత్తే కొండంత నిరర్ధక ఆస్తుల వల్ల తలెత్తే దుష్పరిణామాలకు బలవుతున్నదీ బ్యాంకర్లే. కానీ, మీ ప్రభుత్వంలోని కొందరు అధికారులు బ్యాంకుల ప్రవేశ ద్వారాల ఎదుట చెత్తను డంపింగ్ చేయించడం ద్వారా తీవ్రమైన నైచ్యానికి తెగబడ్డారు. ఇలాంటి చర్యలతో మీకింది వారి పిరికితనమూ, అసమర్థతా బయటపడ్డాయే తప్ప అవి బ్యాంకర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేవు. మీ ‘అరాచక శక్తులు’ గుర్తించాల్సిందేమిటంటే.. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది సామాన్యులు ఎంతో నమ్మకంతో ఉంచిన డిపాజిట్ల పరిరక్షణ బ్యాంకుల అత్యంత ప్రముఖ బాధ్యత. ఎవరికి, ఏ పథకం కింద రుణమివ్వాలన్నా పక్కాగా స్కూృటినీ చేసి, సంతృప్తి చెందితేనే మంజూరు చేస్తాయే తప్ప ఇష్టారాజ్యంగా, ఎవరో చెప్పారనో ఇవ్వవు. అవసరార్థులు, అర్హులకు కావాల్సిన రుణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకుండా ఉండవు. దీనిని గుర్తించని మీ ‘అరాచక శక్తులు’ బ్యాంకుల గుమ్మాల ఎదుట వ్యర్థాలు పారవేయించడం వంటి హేయమైన చర్యకు పాల్పడటం తీవ్ర గర్హనీయం. ఇలాంటి చర్యలను బ్యాంకర్లు మౌనంగా చూస్తూ ఉండిపోరనే విషయాన్ని మీరు గుర్తించాలి. దేశ ప్రజలకు, బ్యాంకులకు గరిష్ఠ ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా బ్యాంకర్లు పనిచేస్తారే కానీ మీరో, మీ కిందివారో ఆదేశించినట్లుగా వ్యవహరించరు’ అని తెలిపారు.
పారిశుధ్య కార్మికులే బలి?
బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటనలో పారిశుద్ధ్య కార్మికులను బలి చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. పురపాలక శాఖ నియమించిన విచారణ బృందం శనివారం ఉయ్యూరు నగర పంచాయతీలో విచారణ నిర్వహించింది. కమిషనర్ ఎన్.ప్రకాశరావు మాత్రం తనకేమీ తెలియదని చెప్పారు. అలా చేయమని తమకెవ్వరూ చెప్పలేదని కార్మికులతో కూడా చెప్పించారు. అయితే ఉన్నతాధికారులు చెబితేనే తాను చెత్త వేయించినట్లుగా ప్రకాశరావు అంతకుముందు ఒక చానల్‌కు చెప్పారు.