మా గోడు వినపడుతోందా?

ABN , First Publish Date - 2020-03-04T08:36:54+05:30 IST

‘‘మా గోడు వినిపిస్తోందా సీఎం సార్‌!’’ అంటూ రాజధాని రైతులు, మహిళలు ఒక్కపెట్టున నినదించారు. వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని వినూత్న రీతిలో నినాదాలు చేస్తూ...

మా గోడు వినపడుతోందా?

  • సీఎం జగన్‌కు రైతుల ప్రశ్న
  • ‘వినికిడి దినోత్సవం’ నాడు హోరెత్తిన ‘జై అమరావతి’ నినాదాలు
  • కృష్ణమ్మకు సారె సమర్పణ
  • పోలీసు దిగ్బంధంలో మందడం
  • 77వ రోజు కొనసాగిన ఆందోళనలు
  • పోలీసు అమానుషాలను అడ్డుకోండి
  • హక్కుల కమిషన్‌కు విన్నపాలు


గుంటూరు/విజయవాడ/తుళ్లూరు, మార్చి 3(ఆంధ్రజ్యోతి): ‘‘మా గోడు వినిపిస్తోందా సీఎం సార్‌!’’ అంటూ రాజధాని రైతులు, మహిళలు ఒక్కపెట్టున నినదించారు. వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని వినూత్న రీతిలో నినాదాలు చేస్తూ తమ నిరసనను కొనసాగించారు.  రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న ఆందోళనలు, రిలే నిరాహార దీక్షలు 77వ రోజు మంగళవారం కొనసాగాయి. 


ఎన్నికల సమయంలో అమరావతిని అభివృద్ధి చేస్తామని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక 3 రాజధానులంటూ మమ్మల్ని నట్టేట ముంచారంటూ రాయపూడి రైతులు కృష్ణానదిలో పికల్లోతు నీళ్లలో నిలబడి నిరసన తెలిపారు. పెదపరమి దీక్షా శిబిరంలో మహిళలు హనుమాన్‌ చాలీసా పఠించారు. కాగా, మంగళవారం ఉదయం సీఎం జగన్‌ సచివాలయానికి వస్తున్నారంటూ మందడంలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ప్రతి ఇంటి వద్ద పోలీసులు వలలు పట్టుకొని నిలబడ్డారు. 


3 రాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ తుళ్లూరులో రైతులు బుధవారం గరిటెతో పళ్లెం మోగిస్తూ నిరసన తెలపాలని నిర్ణయించారు.  

మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో నారాకోడూరు రైతులు 30 క్వింటాల కూరగాయలను నిరసన శిబిరాలకు అందించారు. మంగళగిరికి చెందిన ఫిరమిడ్‌ ధ్యానకేంద్రం ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. పెనుమాకలో మహిళలు ‘సోది’ చెప్పించుకుని నిరసన తెలిపారు. 

తాడికొండ, తుళ్లూరులో సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాజధాని పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. మహిళలు మాస్క్‌లు ధరించి నిరసనలు వ్యక్తం చేశారు.  

స్థానిక ఎన్నికల్లో జగన్‌కు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. కలక్టరేట్‌ ఎదుట జరుగుతున్న దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. మాజీ మంత్రులు పుల్లారావు,  నక్కా ఆనంద్‌బాబు సంఘీభావం తెలిపారు. 

ఎంపీ నందిగం సురేశ్‌ కారుపై గత నెల 23న దాడి చేశారంటూ రాజధాని ప్రాంత రైతులపై పెట్టిన కేసులో నిందితులకు మంగళవారం బాపట్ల డీఎస్పీ కార్యాలయంలో బెయిల్‌ ఇచ్చారు.  

రాజధాని అమరావతి దళితల నియోజకవర్గంలో ఉండకూడదని కుట్రలు చేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో తమ పోరాటానికి అండగా ఉండాలని ఎంఆర్పీఎస్‌ వ్యవస్థాపక అఽధ్యక్షుడు మంద కృష్ణమాదిగను రాజధాని దళిత జేఏసీ నేతలు కోరారు.  ఏలూరులో ఆయనకు వినతిపత్రాలు ఇచ్చారు. 


అమానుషాలను అడ్డుకోండి

మానవహక్కులు, మహిళా కమిషన్‌లకు అమరావతి మహిళా జేఏసీ ఫిర్యాదు

న్యూఢిల్లీ: ‘‘రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, 3 రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని కోరుతూ గత రెండున్నర నెలలుగా అహింసామార్గంలో నిరసన వ్యక్తం చేస్తున్న మాపై పోలీసులు అమానుషంగా వ్యవహరిస్తున్నారు. రైతులు, మహిళలని కూడా చూడకుండా దాడులు చేస్తున్నారు. అర్ధరాత్రి వేళ ఇళ్లకు వచ్చి అరెస్టులు చేస్తున్నారు. ఇలాంటి పోలీసులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని అమరావతి నుంచి తరలి వచ్చిన మహిళా రైతు ప్రతినిధులు జాతీయ మానవహక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ), జాతీయ మహిళా కమిషన్‌లకు ఫిర్యాదు చేశారు.


మంగళవారం ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌ హెచ్‌ఎల్‌ దత్‌, సభ్యులు జస్టిస్‌ పీసీ పంత్‌, మహిళా కమిషన్‌ సభ్యురాలు ఎస్‌.కుందార్‌లతో రైతు ప్రతినిధులు డాక్టర్‌ శైలజ, పద్మలత, జమ్ముల శైలజలతోపాటు అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ప్రతినిధులు జీవీఆర్‌ స్వామి, ఆర్‌వీ స్వామి ప్రొఫెసర్‌ కె. శ్రీనివాసరావు భేటీ అయ్యారు.  త్వరలోనే కమిషన్‌ తరఫున ప్రతినిధులను పంపించి, విచారణ జరిపిస్తామని కమిషన్‌ సభ్యురాలు ఎస్‌. కుందార్‌ హామీ ఇచ్చారు. 


ఎంపీలు కేశినేని, సుజనాలతో భేటీ

జేఏసీ ప్రతినిధులు, మహిళా రైతు ప్రతినిధులు టీడీపీ ఎంపీ కేశినేని నాని, బీజేపీ ఎంపీ సుజనాచౌదరితో విడివిడిగా భేటీ అయ్యారు.


ఉద్యమానికి రక్షణ కల్పించండి: గవర్నర్‌కు వినతి

విజయవాడ: రాజధాని పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న మహిళలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని, వైసీపీ నేతలు భౌతికదాడులకు పాల్పడుతున్నారని అమరావతి పరిరక్షణ సమితి(జేఏసీ) మహిళా ప్రతినిధులు గవర్నర్‌ విశ్వభూషణ్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, భావితరాల భవిష్యత్తు కోసం ఉద్యమంలో పాల్గొంటున్న మహిళలకు రక్షణ కల్పించాలని విన్నవించారు. ఈ మేరకు జేఏసీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీల మహిళా నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు మంగళవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. 

Updated Date - 2020-03-04T08:36:54+05:30 IST