‘కృష్ణాలో’ కౌలు రైతు ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-12-03T08:55:06+05:30 IST
‘కృష్ణాలో’ కౌలు రైతు ఆత్మహత్య

పంట మునిగి మొలక రావటంతో మనస్తాపం
అవనిగడ్డ టౌన్, డిసెంబరు 2: నివర్ తుఫానుకు పంట మొత్తం పడిపోయి మొలక రావటంతో మనస్తాపానికి గురైన కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన కౌలురైతు ముళ్లపూడి వెంకటకృష్ణయ్య (తాత) (62) బుధవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మోదుమూడి సమీపంలో నాలుగెకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేయగా.. గత సంవత్సరం కురిసిన వర్షాలకు మినుము పంట దెబ్బతిని నష్టపోయాడు. ఈ సంవత్సరం నివర్ తుఫాను కారణంగా కోతకు సిద్ధంగా ఉన్న వరి చేను మొత్తం పడిపోయి మొలకలు రావడంతో తట్టుకోలేక బుధవారం మధ్యాహ్నం పొలం గట్టునే పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడు.