విజయవాడ: ప్రముఖ డాక్టర్ ఇంట్లో భారీ చోరీ
ABN , First Publish Date - 2020-09-15T00:45:35+05:30 IST
మాచవరంలో ఓ ప్రముఖ డాక్టర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. రూ.50 లక్షల విలువైన సొత్తు ఎత్తుకెళ్లారు. డాక్టర్ భార్య, కూతురి చేతులు కట్టేసి చోరీకి
విజయవాడ: మాచవరంలో ఓ ప్రముఖ డాక్టర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. రూ.50 లక్షల విలువైన సొత్తు ఎత్తుకెళ్లారు. డాక్టర్ భార్య, కూతురి చేతులు కట్టేసి చోరీకి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. మరోవైపు సీపీ బత్తిన శ్రీనివాస్ కూడా సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. తెలిసిన వారే చోరీకి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
డాక్టర్ ఇంట్లో గంట పాటు దుండగులున్నారు: డీసీపీ
డాక్టర్ మురళీధర్ ఇంట్లో చోరీ జరిగినట్లుగా సమాచారం వచ్చిందని డీసీపీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రాథమికంగా వచ్చిన సమాచారం ప్రకారం మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్యలో చోరీ జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారు. సీసీ ఫుటేజీ కోసం చూస్తున్నామన్నారు. బాధితులు ఇద్దరిని కొడతామని దుండగులు భయపెట్టినట్లు తెలిసిందని చెప్పారు. నలుగురు వ్యక్తులు మాస్కులు, గ్లౌవ్స్ వేసుకుని వచ్చి సొత్తు ఎత్తుకెళ్లినట్లు వెల్లడించారు.