కడపలో కాలం చెల్లిన బీర్లు!
ABN , First Publish Date - 2020-09-07T09:51:39+05:30 IST
తయారీ తేదీ నుంచి ఆరు నెలల్లోపే బీరు వినియోగించాలి. ఆ తర్వాత వాటిని తాగితే అనారోగ్యం పాలయ్యే ప్రమాదం
- బార్లలో మిగిలిపోయినవాటికి కొత్త తేదీలతో లేబుళ్లు
- సర్కారు దుకాణాల్లో విక్రయం.. మద్యం ప్రియుల బేజారు
- సీటీఎల్ అనుమతి ఉందన్న ఎక్సైజ్ అధికారులు
కడప, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): తయారీ తేదీ నుంచి ఆరు నెలల్లోపే బీరు వినియోగించాలి. ఆ తర్వాత వాటిని తాగితే అనారోగ్యం పాలయ్యే ప్రమాదం లేకపోలేదు!. అయితే.. కడప జిల్లాలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఆగస్టు నెలలోనే కాలం చెల్లిన (ఎక్స్‌పైరీ డేట్) బీర్లను ఈ నెల 12వ తేదీ వరకు గడువు పెంచి తాత్కాలిక లేబుళ్లు అతికించి విక్రయిస్తుండడంపై మద్యం ప్రియులు బేజారవుతున్నారు. కడప జిల్లాలో కడప, ప్రొద్దుటూరు, రాజంపేట తదితర ప్రాంతాల్లో 30 బార్లు ఉన్నాయి. కరోనా వ్యాప్తి నియంత్రణకు మార్చి 22వ తేదీ లాక్‌డౌన్ ప్రకటించడంతో బార్లు మూతపడ్డాయి. ఆయా బార్లలో మిగిలిపోయి కాలం చెల్లిన పలు బ్రాండ్ల బీర్లు 3,018 కేసులు (ఒక్కో కేసులో 12) బీర్లను ప్రభుత్వ మద్యం షాపులకు తరలించారు. అంతకు ముందు కర్నూలులోని రీజినల్ కెయిల్ టెస్టు ల్యాబ్ (సీటీఎల్)కు పంపించి టెస్ట్ చేయించినట్లు అధికారులు తెలిపారు. ఫిట్ ఫర్ హ్యూమన్ కంజమ్షన్ (మనుషులు వినియోగించవచ్చు) అనే రిపోర్టు ఇచ్చిందని, ఆ రిపోర్టు ఆధారంగా ఈనెల 12వ తేదీ వరకే వీటిని విక్రయించేలా తాత్కాలిక లేబుళ్లు వేసి విక్రయిస్తున్నామని అంటున్నారు. అయితే.. బీర్లు తయారు తేదీ నుంచి ఆరు నెలలు దాటితే వినియోగించరాదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఎక్సైజ్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
కర్నూలు జిల్లాలో 2009 వరదల్లో రూ.కోట్ల విలువైన 2 వేల బాక్సులకు పైగా విలువైన ప్రముఖ బ్రాండ్ల మద్యం నీటమునిగింది. వరద తగ్గాక కర్నూలు రీజినల్ కెమికల్ టెస్టింగ్ ల్యాబ్, హైదరాబాద్‌లోని కెమికల్ టెస్టింగ్ ల్యాబ్‌లో పరీక్షలు చేయిస్తే ఫిట్ ఫర్ హ్యూమన్ కంజమ్షన్ రిపోర్టు ఇచ్చింది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా నాడు ఆ మద్యం అమ్మకాలు చేయకుండా ఆపేసినట్లు అధికారులు అంటున్నారు. ప్రస్తుతం బార్ల యజమానుల్లో ఎక్కువ మంది వైసీపీ వర్గీయులే కావడంతో.. వారికి లాభం చేకూర్చాలనే లక్ష్యంగా సీటీ ల్యాబ్ రిపోర్టు సాకుతో కాలం చెల్లిన బీర్లను విక్రయించడం దారుణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. మార్చి 22వ తేదీకి ముందు కొనుగోలు చేసిన బీర్లు అవి. నాడు 10,000 నాకౌట్ బీరు సీసా రూ.130 ఉంటే ప్రస్తుతం రూ.190కి, కజురహో రూ.150 ఉంటే రూ.220లకు విక్రయిస్తున్నారు.
కాలం చెల్లినవే కానీ..
ఈ విషయాన్ని కడప ఎక్సైజ్ డిపో మేనేజరు శ్రీధర్ దృష్టికి ‘ఆంధ్రజ్యోతి’ తీసుకెళ్లగా.. ‘లాక్‌డౌన్ వల్ల బార్లలో మిగిలిపోయిన 3,018 కేసుల బీర్లకు ఆగస్టు నెలలో గడువు (ఎక్స్‌పైరీ) తీరిన మాట నిజమే. ఆ బీర్లను కర్నూలు రీజినల్ కెమికల్ టెస్టింగ్ ల్యాబ్‌కు పంపించి టెస్ట్ చేయిస్తే ఈనెల 12వ తేదీ వరకు వినియోగించవచ్చని రిపోర్టు ఇచ్చారు. ఆ రిపోర్టు ప్రకారమే తాత్కాలిక లేబుళ్లు అతికించి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయాలు చేస్తున్నామ’ని పేర్కొనడం కొసమెరుపు.