ఆస్తిపన్ను పెంపుపై కసరత్తు
ABN , First Publish Date - 2020-12-07T08:54:24+05:30 IST
వార్షిక అద్దె విలువ స్థానంలో రిజిస్ర్టేషన్ విలువల ఆధారంగా ఆస్తి పన్ను నిర్ణయించేందుకు పురపాలక శాఖ కార్యాచరణను వేగవంతం చేస్తోంది.

రిజిస్ట్రేషన్ విలువల ఆధారంగా మదింపు
భవనాల్లో చదరపు అడుగులపై లెక్కింపు
యూఎల్బీలకు పురపాలక శాఖ ఆదేశాలు
ఏప్రిల్ 1 నుంచి అమలుకు చర్యలు
అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): వార్షిక అద్దె విలువ స్థానంలో రిజిస్ర్టేషన్ విలువల ఆధారంగా ఆస్తి పన్ను నిర్ణయించేందుకు పురపాలక శాఖ కార్యాచరణను వేగవంతం చేస్తోంది. 2021 ఏప్రిల్ 1నుంచి నూతన విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించిన రిజిస్ట్రేషన్ విలువల ఆధారంగా సవరించిన పన్నులకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలంటూ పట్టణ స్థానిక సంస్థల(యూఎల్బీ)కు ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఇప్పటి వర కూ పట్టణ ప్రాంతాల్లోని నిర్మాణాల విస్తీర్ణాన్ని చదరపు మీటర్లలో కొలిచి ఆస్తి పన్ను విధిస్తుండగా, నూతన విధానం ప్ర కారం చదరపు అడుగుల ప్రాతిపదికన నిర్ణయించాలని ఆదేశాల్లో పేర్కొన్నట్లు సమాచారం. ఫలితంగా భవన యజమానులపై భారం అధికంగానే ఉంటుందని చెబుతున్నారు.
అయి తే స్థలాలు, ఇళ్ల స్థలాలపై మాత్రం చదరపు గజాల ప్రాతిపదికనే ఆస్తి పన్ను విధించాలని సూచించినట్లు తెలిసింది. ఇప్పటికే తమ పరిధిలోని ఆస్తుల రిజిస్ర్టేషన్ల విలువలను సేకరించి, ఉన్నతాధికారుల పరిశీలనకు పంపిన పట్టణ స్థానిక సంస్థలు... వాటి ప్రకారమే సవరించిన ఆస్తి పన్ను నిర్ణయించే దిశగా కసరత్తును ప్రారంభించాయి. తమ పరిధిలోని ప్రాం తాల్లో ప్రస్తుతం ఉన్న పన్ను ఎంతమేర పెంచవచ్చో సూచించడంతో పాటు ఇతర వివరాలతో ఈ ప్రతిపాదనలను త్వరలోనే ఉన్నతాధికారులకు పంపనున్నారు. వాటికి మార్పుచేర్పు లు చేసి, తిరిగి యూఎల్బీలకు పంపిన తర్వాత కౌన్సిళ్లు, కార్పొరేషన్లలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, వాటిపై చర్చించి, తుది ప్రతిపాదనలను మళ్లీ పంపాల్సి ఉంటుంది. ఉన్నతాధికారుల నిర్ణయానుసారం పన్నులు నిర్ధారణ కానున్నాయి.