సాగు పనులకు మినహాయింపు

ABN , First Publish Date - 2020-04-15T09:14:00+05:30 IST

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగింపు విధి విధానాలను ప్రభుత్వం జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు వెలువరించింది.

సాగు పనులకు మినహాయింపు

రైతులు, కూలీలకు వెసులుబాటు

వ్యవసాయ పరికరాల షాపులు తెరవొచ్చు

ట్రాక్టర్ల విడిభాగాలు, రిపేర్‌ దుకాణాలు కూడా

లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు


అమరావతి, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగింపు విధి విధానాలను ప్రభుత్వం జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు వెలువరించింది. అయితే వ్యవసాయ పనులకు మినహాయింపు ఇచ్చారు. సాగు పనుల్లో నిమగ్నమైన రైతులు, రైతు కూలీలు, వ్యవసాయ పరికరాలు సరఫరా చేసే షాపులు, ట్రాక్టర్ల విడిభాగాలు అమ్మే షాపులు, వాటి మరమ్మతు దుకాణాలకు మినహాయింపు ఇచ్చారు. అదేవిధంగా పంట కోత యంత్రాలను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేందుకు అనుమతి ఇస్తారు. పరిశ్రమలన్నీ తెరిచేందుకు వీల్లేకున్నా.. నిత్యావసర సరుకులు, ఆహారశుద్ధి, ఔషధ పరిశ్రమలు తదితరాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు లభించింది. ప్రభుత్వ వైద్య, పోలీసు, విద్యుత్‌, విపత్తులు తదితర అత్యవసర సేవల విభాగాలు తప్ప మిగతా శాఖల కార్యాలయాలేవీ తెరవకూడదు.


ఆయా శాఖల ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలి. బాం్యకులు, పెట్రోల్‌ బంకులు, హైవేల పక్కనుండే మెకానిక్‌ షాపులు, రేషన్‌ దుకాణాలు, నిత్యావసరాల  దుకాణాలు, మెడికల్‌ షాపులు తదితరాలకు లాక్‌డౌన్‌ వర్తించదు. గతంలో మాదిరిగానే మాల్స్‌, పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్లు, బార్లు, వైన్‌షాపులు, మసీదులు, చర్చిలు, దేవాలయాలు మూసే ఉంటాయి. రైలు, రోడ్డు, విమాన రవాణా ఉండదు. అయితే నిత్యావసర సరుకుల రవాణా, అత్యవసర సేవల వాహనాలు, అంతర్రాష్ట్ర సరుకుల రవాణా, మందులు, గ్యాస్‌ సరఫరా వాహనాలకు అనుమతి ఉంటుంది. ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌ మీడియాకు మినహాయింపు ఇచ్చారు. ఇలాంటివి తప్ప తొలి విడత లాక్‌డౌన్‌లో ఉన్న నిబంధనలన్నీ అమల్లో ఉంటాయి. ఇవి కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులకు అనుగుణంగానే వ్యవహరించాల్సి ఉంటుంది. లాక్‌డౌన్‌  నిబంధనలను ఉల్లంఘించినవారికి జరిమానా, జైలు శిక్ష రెండూ విధిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - 2020-04-15T09:14:00+05:30 IST