రిజర్వేషన్ల కుదింపు ఘనత చంద్రబాబుదే: మంత్రి పెద్దిరెడ్డి

ABN , First Publish Date - 2020-03-04T09:20:12+05:30 IST

‘‘రాష్ట్రంలో బీసీ జనాభా అత్యధికంగా ఉన్న నేపథ్యంలో 59 శాతం రిజర్వేషన్లు ఉండాలనుకున్నాం. దీనివల్ల బీసీలకు న్యాయం జరుగుతుందని...

రిజర్వేషన్ల కుదింపు ఘనత చంద్రబాబుదే: మంత్రి పెద్దిరెడ్డి

బాబువి ఓటుబ్యాంకు రాజకీయాలు: మంత్రి మోపిదేవి

అమరావతి, రేపల్లె, మార్చి 3(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో బీసీ జనాభా అత్యధికంగా ఉన్న నేపథ్యంలో 59 శాతం రిజర్వేషన్లు ఉండాలనుకున్నాం. దీనివల్ల బీసీలకు న్యాయం జరుగుతుందని మా ప్రభుత్వం భావించింది. బీసీలకు రిజర్వేషన్ల వల్ల మేలు జరగటాన్ని చంద్రబాబు సహించలేకపోయారు. దీంతో తమ పార్టీకి చెందిన బిర్రు ప్రతాపరెడ్డితో సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయించారు. 59 శాతం నుంచి 50 శాతానికి రిజర్వేషన్లు కుదింపు ఘనత చంద్రబాబుదే’’ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.


మంగళవారం అమరావతి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బిర్రు ప్రతాపరెడ్డి, చంద్రబాబుతోపాటు లోకేశ్‌, ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌లకు అత్యంత సన్నిహితుడని వారితో దిగిన ఫోటోలను మంత్రి మీడియా ముందు ప్రదర్శించారు. తాము ఆధారాలతో చూపుతున్నా ప్రతాపరెడ్డి వైసీపీ కార్యకర్త అంటూ ఆరోపించడం దారుణమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి బుద్ది చెప్పాలన్నారు. అసెంబ్లీ సమావేశాలపై ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం జరగలేదన్నారు. ఇంటర్‌, 10వ తరగతి పరీక్షలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇదే అంశంపై మంత్రి మోపిదేవి వెంకటరమణారావు రేపల్లెలో మాట్లాడారు. బీసీల అభ్యున్నతికి పరోక్షంగా చంద్రబాబు అడ్డుపడుతున్నారని విమర్శించారు. బీసీలను ఓటు బ్యాంక్‌గా వాడుకునేందుకు టీడీపీ అధినేత పరోక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Updated Date - 2020-03-04T09:20:12+05:30 IST