అంతా ఏకపక్షం

ABN , First Publish Date - 2020-12-05T09:14:19+05:30 IST

శాసనసభ శీతాకాల సమావేశాలు ఏకపక్షంగా, మొక్కుబడిగా జరిగాయి. కీలకాంశాలపై మాట్లాడే అవకాశం ప్రధాన ప్రతిపక్షానికి దక్కనేలేదు.

అంతా ఏకపక్షం

చర్చిద్దామంటూనే విపక్షంపై వేటు

మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు

ప్రతిపక్ష నేతకూ అదే అనుభవం

ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే సీఎం జోక్యం

మైకివ్వొద్దని పదే పదే స్పీకర్‌కు సూచనలు

ముగిసిన శీతాకాల సమావేశాలు

19 బిల్లులు.. 7 ‘స్వల్ప’ చర్చలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి): శాసనసభ శీతాకాల సమావేశాలు ఏకపక్షంగా, మొక్కుబడిగా జరిగాయి. కీలకాంశాలపై మాట్లాడే అవకాశం ప్రధాన ప్రతిపక్షానికి దక్కనేలేదు. ఒకవేళ వచ్చినా.. అర్ధాంతరంగా సభ్యుడిని అడ్డుకోవడం.. మంత్రులు, పాలక పక్ష ఎమ్మెల్యేలు వ్యక్తిగత దూషణలకు దిగడం.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే స్వయంగా సీఎం జగన్మోహన్‌రెడ్డి జోక్యం చేసుకోవడం.. మైక్‌ కట్‌ చేయించడం.. టీడీపీ సభ్యులు నిరసిస్తే సస్పెండ్‌ చేయడం.. ఈ ఐదు రోజులూ కనపడిన దృశ్యమిదే. చివరకు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కూడా ఇదే అనుభవం ఎదురైంది. ‘ఏ అంశంపైనైనా ఎంత సేపయినా చర్చిద్దాం.. ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారా మెరుగైన పాలనను అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ పక్షాన 21 అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. సమగ్రంగా సభలో అన్ని అంశాలపై కూలంకషంగా మాట్లాడదాం’ అని సభాపతి తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన సమావేశాల ప్రారంభ దినాన (గత సోమవారం) శాసనసభా వ్యవహారాల సలహా మండలి (బీఏసీ) సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. కానీ ఇది ఆచరణలోకి రాలేదు. సోమవారం నుంచి సమావేశాలు ముగిసిన శుక్రవారం వరకు.. సభలో ప్రతిపక్షం తమ వాదనను వినిపించేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ.. ఆయనే స్వయంగా కలుగజేసుకుని... ‘ఇలాంటి వారి వాదనతో సమయం వృఽథా. వారిని బయటకు తోసేయండి’ అని సూచించడం గమనార్హం. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడడం మొదలుపెట్టగానే.. అధికార పక్షం వైపు నుంచి మంత్రులో, ఎమ్మెల్యేలో రన్నింగ్‌ కామెంటరీ చేస్తూ వచ్చారు. గట్టిగా మాట్లాడితే ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవడం.. ఆ వెంటనే మైక్‌ కట్‌ కావడం.. ఈ ఐదు రోజులూ ఇదే నడిచింది. అకస్మాత్తుగా మైక్‌ కట్‌ కావడంతో తమకు మాట్లాడే అవకాశం కల్పించాలంటూ నినాదాలు చేస్తూ స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లిన వెంటనే.. విపక్ష సభ్యులపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ వచ్చారు.


బాబుకు చాన్సివ్వకూడదని..

సమావేశాల తొలి రోజు నుంచే.. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మాట్లాడే అవకాశం ఇవ్వకూడదన్న పట్టుదల జగన్‌ ప్రభుత్వంలో కనిపించింది. సంఖ్యాపరంగా చూస్తే.. తెలుగుదేశం సభ్యులకు మాట్లాడే అవకాశం స్వల్పంగానే లభిస్తుంది. కానీ ప్రతిపక్ష నేత మాట్లాడేందుకు సిద్ధమైనప్పుడు.. మైక్‌ ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. కానీ.. ఈసారి చర్చలో అది జరగలేదు. చర్చలో పాల్గొంటానని ప్రతిపక్ష నేత పేరు ఇవ్వలేదంటూ మాట్లాడేందుకు అవకాశమే ఇవ్వకుండా నిరాకరించే కొత్త సంప్రదాయం అమల్లోకి వచ్చింది. ప్రధాన ప్రతిపక్ష నేత స్వయంగా లేచి నిలబడినా.. మైక్‌ ఇవ్వకపోగా.. ‘చాల్లే కూర్చో’ అంటూ గేలి చేసేలా వైసీపీ ఎమ్మెల్యేల నుంచి మాటలు వినిపించాయి. మొదటి రోజున ఇలాగే మైక్‌  దొరక్కపోవడంతో చంద్రబాబు ఏకంగా పోడియం వద్ద నేలపై బైఠాయించారు. ఆయన రాజకీయ చరిత్రలో ఇలా బైఠాయించడం ఇదే తొలిసారి. సహజంగా ఇలా ఒక సీనియర్‌ నేత అనూహ్యంగా నిరసన తెలిపినప్పుడు.. దానిని సరిదిద్దకపోగా.. అలా నిరసన తెలపడమే తప్పన్నట్లుగా ఆయనపై సభలో తీర్మానం చేయడం గమనార్హం. 


నవంబరు 30న ప్రారంభమైన శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ ఐదు రోజులూ 39.04 గంటల పాటు సభ కార్యకలాపాలు జరిగాయి. 18 బిల్లులను ప్రవేశ పెట్టారు. రెండు బిల్లులను ఉపసంహరించుకున్నారు. గతంలో ప్రవేశపెట్టిన బిల్లులతో కలిపి మొత్తం 19 బిల్లులను ఆమోదించారు. 59 మంది సభ్యులు ప్రసంగించారు.

Updated Date - 2020-12-05T09:14:19+05:30 IST