రైతుపక్షంగానే ప్రతి అడుగూ
ABN , First Publish Date - 2020-12-30T07:32:45+05:30 IST
‘‘రైతుబాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వమిది. ప్రతి అడుగూ రైతు పక్షపాతంగానే వేస్తున్నాం.

- కౌలు, గిరిజన, అసైన్డ్ రైతుల ఖాతాల్లోనూ ‘భరోసా’ నగదు
- పొరపాటుకు ఆస్కారం లేని పరిపాలన అందిస్తున్నాం
- విపక్ష నేతకు బాధ్యత లేదు
- రైతుకష్టం తెలియని ఇద్దరిని రంగంలోకి దింపి డ్రామాలు: జగన్
- ఖాతాల్లో భరోసా, ‘నివర్’ సాయం జమ
అమరావతి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘‘రైతుబాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వమిది. ప్రతి అడుగూ రైతు పక్షపాతంగానే వేస్తున్నాం. 18నెలల పాలనలో రైతులకోసం రూ.61,400కోట్లు వెచ్చించాం. రైతులపై మమకారం, ప్రేమ, బాధ్యతతో ఏఒక్క పొరపాటుకూ ఆస్కారంలేకుండా, చాలా నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ మూడోవిడత కింద రూ.రెండువేలు చొప్పున 50.59లక్షలమందికి రూ.1120 కోట్లు, నివర్ తుఫాన్‌తో నష్టపోయిన 8.34లక్షల మందికి రూ.646కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాలకు కంప్యూటర్‌లో బటన్ నొక్కి సీఎం జమ చేశారు.
రైతుభరోసా కింద 51.59 లక్షల కుటుంబాలకు గత 18 నెలల్లో రూ.13,101కోట్లు ఇవ్వడమేకాదు, కౌలు రైతులు, అటవీ, అసైన్డ్ భూముల రైతులకు సైతం ఈ పథకం అందిస్తున్నామని ఈ సందర్భంగా జగన్ పేర్కొన్నారు. ‘‘గత ప్రభుత్వం తాలూకూ రూ.904కోట్ల సున్నావడ్డీ బకాయిలు తీర్చాం. ఖరీఫ్ రైతులకు రూ.510 కోట్లు ఇచ్చాం. ఉచిత పంటల బీమా క్లైయిములకు రూ.1,968కోట్లిచ్చి, రైతుల నుంచి ఒక్కరూపాయే తీసుకున్నాం. జూన్‌నుంచి 17.25లక్షల ఎకరాల పంట నష్టానికి 13.56లక్షల రైతులకు రూ.1,038కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ అందించాం. రైతులకు ధర రావాలని రూ.18,343కోట్లతో ధాన్యం, రూ.4,761కోట్లతో ఇతర పంటలు కొనుగోలు చేశాం. ఉచిత విద్యుత్, ఆక్వా రైతుల కోసం రూ.17,430 కోట్లు ఖర్చు చేశాం. ఇందులో గత ప్రభుత్వ బకాయిలు రూ.8,655కోట్లు తీర్చాం. రూ.10వేల కోట్లతో గోదాములు, ఆహార శుద్ధి యూనిట్లు, జనతాబజార్లు ఏర్పాటు చేయనున్నాం. తుఫాన్‌కు పంట నష్టపోయిన రైతులకు 80ు రాయితీతో విత్తనాలు సరఫరా చేస్తున్నాం. తడిసిన, రంగు మారిన, మొలకెత్తిన 73వేలటన్నుల ధాన్యం కొనుగోలు చేశాం’’ అని ముఖ్యమంత్రి వివరించారు.
పండ్లు ఇచ్చే చెట్టు మీద రాళ్లు పడతాయన్నట్లుగా బాధ్యత లేని ప్రతిపక్ష నేత ఆడిస్తున్న డ్రామాలు బాధ కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ‘జగన్ ఒక తేదీ చెబితే..ఆ రోజు చేసి తీరతాడని మీకు తెలుసు. కానీ, చంద్రబాబు వక్రబుద్ధిని చూస్తుంటే బాధనిపిస్తోంది. తన పుత్రుణ్ణి, దత్తపుత్రుణ్ణి రంగంలోకి దించి, ఆయన జూమ్‌కి దగ్గరగా ఉంటారు. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరిమీదా నమ్మకం లేదు. అందుకే ఇద్దర్నీ కలిపి రంగంలోకి దింపుతారు. ఇద్దరూ హైదరాబాద్ నుంచి వస్తారు. వీరిద్దరికీ రైతు కష్టాలు పట్టవు. చివరకు బాధలు పడలేక ఆత్మహత్య చేసుకున్న 434మంది రైతుల కుటుంబాలకు మా ప్రభుత్వం వచ్చాక పరిహారం ఇచ్చాం. గత ప్రభుత్వం ఏ రకంగా రైతుల పట్ల దారుణంగా వ్యవహరించిందో చూశాం’’ అని విమర్శించారు.