అంచనా వ్యయం.. 55,548.87 కోట్లు!

ABN , First Publish Date - 2020-12-27T08:10:02+05:30 IST

పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 2017-18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్లుగా కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది.

అంచనా వ్యయం.. 55,548.87 కోట్లు!

  • పోలవరంపై జలశక్తి శాఖ వార్షిక నివేదిక
  • ఇప్పటివరకు ప్రాజెక్టు ఖర్చు 17,327 కోట్లు
  • రాష్ట్రానికి 8,614 కోట్లు విడుదల
  • జనవరిలో 1,850 కోట్లు రీయింబర్స్‌
  • మరో 2,234 కోట్లకు ఆమోదం
  • సమీక్ష నివేదికలో జలశక్తి శాఖ వెల్లడి

అమరావతి/న్యూఢిల్లీ, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 2017-18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్లుగా కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది. ఏడాది పనితీరుపై ఆ శాఖ ఇచ్చిన సమీక్ష నివేదికను కేంద్ర సమాచార శాఖ శనివారం విడుదల చేసింది. ఈ రిపోర్టు ప్రకారం.. ప్రాజెక్టుకు ఇప్పటి వరకూ కేంద్రం రూ.8,614.16 కోట్లు విడుదల చేసింది. ఈ ఏడాది జవనరిలో రూ.1,850 కోట్లు రీయింబర్స్‌ చేసింది. 2020-21కి గాను నాబార్డు నుంచి రుణం తీసుకుని మరో రూ.2,234 కోట్లు మంజూరుకు ఆమోదం తెలిపింది. త్వరలోనే ఇవి కూడా విడుదలవుతాయని జలశక్తి శాఖ తెలిపింది. ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మాణంపై రూ.17,327 కోట్లు వెచ్చించారని వివరించింది. వార్షిక నివేదికలో అంచనా వ్యయాన్ని రూ.55,548 కోట్లుగా పేర్కొనడంపై రాష్ట్ర జలవనరుల శాఖ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ ఏడాది అక్టోబరు నుంచి ప్రాజెక్టు అంచనా వ్యయంపై వివాదాలు ముసురుకున్నాయి. 2013-14 అంచనాల మేరకు అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లు మాత్రమేనని ఈ ఏడాది అక్టోబరు 12వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ నుంచి పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి సమాచారం అందింది. 2017 మార్చి 15 కేంద్ర కేబినెట్‌ ఆ మేరకు తీర్మానం చేసిందని.. తాము దానికే కట్టుబడి ఉన్నామని తెలిపింది.


ఈ అంచనా వ్యయానికి గత నెలలో జరిగిన పీపీఏ అత్యవసర సమావేశం కూడా ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో.. ప్రాజెక్టు పూర్తి కావాలంటే 2017-18 అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లను ఆమోదించాల్సిందేనని కేంద్రానికి పీపీఏ సిఫారసు చేసింది. కానీ ఈ మొత్తానికి జలశక్తి శాఖ ఇంకా అంగీకారం తెలుపలేదు. పీపీఏ చేసిన సూచనలు దానివద్దే పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్థిక శాఖ ఆమోదానికి ఇంకా పంపలేదు. సీఎం జగన్‌, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌.. జలశక్తి మంత్రి షెకావత్‌ను కలిసినా సానుకూల స్పందన రాలేదు. ఈ తరుణంలో ఆ శాఖ వార్షిక నివేదికలో అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లుగా పేర్కొనడం జలవనరుల శాఖకు సంతోషం కలిగిస్తోంది.


నిధులకు సహకరిస్తామన్నా నిర్లక్ష్యమే!

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే లక్ష్యం సమీపిస్తోంది. పనులు శరవేగంగా పూర్తవ్వాలం టే నిధుల ప్రవాహం అవసరం. రాష్ట్రప్రభుత్వం చేసిన ఖర్చును కేంద్రం ఎప్పటికప్పుడు రీయింబర్స్‌ చేయడమే తప్ప.. నేరుగా నిధులేమీ ఇవ్వడం లేదు. భారీగా నిధులిచ్చే ఆర్థిక సామర్థ్యం రాష్ట్రప్రభుత్వానికీ లేదు. ఇటువంటి తరుణంలో కేంద్రం నుంచి నిధుల విడుదల కోసం సహకరిస్తామని ఎవరైనా ముం దుకొస్తే ఏం చేయాలి..? వారు కోరిందే తడవుగా అడిగిన సమాచారమంతటినీ అందజేయాలి. కానీ రాష్ట్ర జల వనరుల శాఖలోని భూసేకరణ, సహాయ పునరావాస విభాగం కమిషనరేట్‌ మాత్రం తద్భిన్నంగా వ్యవహరిస్తోంది. ఇటీవల ప్రాజెక్టు స్థలి, పునరావాస ప్రాంతాల్లో పర్యటించిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ కోరిన వివరాలు ఇంకా అందించలేదు.

Updated Date - 2020-12-27T08:10:02+05:30 IST