-
-
Home » Andhra Pradesh » Essential services for IT companies
-
ఐటీ కంపెనీలపై ఖాకీ కన్నెర్ర
ABN , First Publish Date - 2020-03-24T10:04:24+05:30 IST
ఐటీ సంస్థలను నిత్యవసర సేవల కింద రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి నిరభ్యంతరంగా పనిచేసుకోవడానికి ఉత్తర్వులు ఇచ్చినా పోలీసులు...

అత్యవసర జాబితాలో విశాఖ ఐటీ
అయినా పోలీసుల వేధింపులు
వర్క్ ఫ్రమ్..కోసం కంప్యూటర్లను తీసుకెళ్తున్న వారినీ స్టేషన్‌కు
విశాఖపట్నం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఐటీ సంస్థలను నిత్యవసర సేవల కింద రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి నిరభ్యంతరంగా పనిచేసుకోవడానికి ఉత్తర్వులు ఇచ్చినా పోలీసులు మాత్రం అంగీకరించడం లేదు. విశాఖపట్నంలో సుమారు 150 ఐటీ కంపెనీల్లో 25 వేలమంది వరకు పనిచేస్తున్నారు. వీరందించే సేవలు అనేక పెద్ద పెద్ద కంపెనీలకు తప్పనిసరి కావడంతో కరోనా నేపథ్యంలో ఎటువంటి ఆంక్షలు విధించకుండా పనిచేసే అవకాశం ప్రభుత్వం కల్పించింది. అయితే ఐటీ యాజమాన్యాలు ప్రాక్టికల్‌గా వచ్చే కొన్ని సమస్యలను గుర్తించి పలువురు ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పించాయి. మిగిలిన వారంతా కార్యాలయాలకు రావాలని ఆదేశించాయి. అయితే సోమవారం నుంచి విశాఖపట్నంలో రాకపోకలపై ఆంక్షలు విధించడం, 144 సెక్షన్ విధించడంతో పోలీసులు గీత దాటి వ్యవహరించారు.
విధులకు వెళుతున్న ఐటీ ఉద్యోగులను అనుమతించకుండా బారికేడ్లు పెట్టి ఆపేశారు. మిలీనియం టవర్‌లోని కాండ్యుయెంట్ కంపెనీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి సోమవారం కారులో కార్యాలయానికి వెళుతుండగా మద్దిలపాలెం జంక్షన్‌లో పోలీసులు ఆపేశారు. తాను ఫలానా అని చెప్పినా వినకుండా కారుతో సహా పోలీ్‌సస్టేషన్‌కు తీసుకుపోయారు. ఇది జరిగిన కొంతసేపటికి మరికొందరు పోలీసులు రుషికొండలోని కాండ్యుయెంట్ కంపెనీకి వెళ్లి పూర్తిగా మూసివేయాలని హుకుం జారీచేశారు. తమ దగ్గర 1400 మంది పనిచేస్తున్నారని, ప్రభుత్వం తమకు మినహాయింపు ఇచ్చిందని చెప్పినా వారు వినలేదు. రుషికొండ ఐటీ పార్కులో ఇతర కంపెనీలకు కూడా వెళ్లి మూసేయాలని ఆదేశాలు జారీచేశారు. కాగా.. ఐటీ కంపెనీలు కొంతమంది ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసుకునేందుకు అవసరమైన కంప్యూటర్లు, లాప్‌టా్‌పలు, యూపీఎ్‌సలు సోమవారం అందజేశాయి. వారంతా వాటిని ఇంటికి తీసుకెళుతుంటే...పోలీసులు ఆపేసి స్టేషన్‌కి తరలించారు. ఐడీ కార్డులు చూపించినా వినకుండా వాటిని కూడా లాక్కున్నారు.
కుదరదన్నారు
‘‘ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలంటే... అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి అనుమతి కావాలని జీవీఎంసీ కమిషనర్‌ను కోరాం. ఆయన సహాయం చేయలేమని చెప్పేశారు. పోలీస్ కమిషనరైనా సాయం చేయకుంటే సంస్థలను మూసుకోక తప్పదేమో’’ - శ్రీధర్ కొసరాజు, రాష్ట్ర ఐటీ అసోసియేషన్