ప్రవేశ పరీక్షా... లాటరీనా?

ABN , First Publish Date - 2020-03-02T07:39:19+05:30 IST

మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారా, లాటరీ విధానం అమలు చేస్తారా అన్న విషయం తేలడం లేదు. ఈ అంశంపై స్పష్టత ఇవ్వకుండా పాఠశాల విద్యాశాఖ జాప్యం...

ప్రవేశ పరీక్షా... లాటరీనా?

  • మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలపై సందిగ్ధం 
  • నోటిఫికేషన్‌ విడుదలై రెండు నెలలు
  • ఆన్‌లైన్‌లో ఓపెన్‌ కాని దరఖాస్తులు 
  • పాఠశాల విద్యాశాఖ తీరుపై విమర్శలు 


అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారా, లాటరీ విధానం అమలు చేస్తారా అన్న విషయం తేలడం లేదు. ఈ అంశంపై స్పష్టత ఇవ్వకుండా పాఠశాల విద్యాశాఖ జాప్యం చేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2020-21 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశాల కోసం జనవరి 5న నోటిఫికేషన్‌ విడుదల చేశారు. జనవరి 8నుంచి ఫిబ్రవరి 7వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.


ఏప్రిల్‌ 5న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. కానీ ఆ తర్వాత దరఖాస్తు ఓపెన్‌ కాకుండా హోల్డ్‌లో పెట్టింది. నోటిఫికేషన్‌ ఇచ్చి దాదాపు 2 నెలలు అవుతున్నా కూడా ఇప్పటివరకు ఈ అంశంపై స్పష్టత  ఇవ్వలేదు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు చేయరాదంటూ వచ్చిన అభ్యంతరం మేరకు విద్యాశాఖ డైలమాలో పడిందని సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్‌చల్‌ చేశాయి. ప్రవేశ పరీక్ష కాకుండా లాటరీ విధానంలో అడ్మిషన్లు చేపట్టాలన్న ఆలోచన చేస్తున్నారని చెబుతున్నా ఇందులో వాస్తవం ఎంతో తెలియడం లేదు.


వేలాది మంది విద్యార్థులకు సంబంధించిన విషయంలో అధికారులు వివరణ ఇవ్వకుండా చోద్యం చూస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. లాటరీ పద్ధతిలో అడ్మిషన్లు చేపడితే అక్రమాలకు తెరలేస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రమేయంతో చేతివాటంగా సీట్లు భర్తీ చేసుకునే అవకాశం ఉంటుందంటున్నారు. దీనివల్ల ఎంతోమంది మెరిట్‌ విద్యార్థులకు అడ్మిషన్లు దక్కే అవకాశం ఉండదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలోని మోడల్‌ స్కూళ్లలో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 164 మోడల్‌ స్కూళ్లలో ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకూ చదువుకునే అవకాశం ఉంది. ప్రతి విద్యా సంవత్సరంలోనూ 6వ తరగతి అడ్మిషన్లకు మాత్రమే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఒక్కో పాఠశాలలో 80సీట్లను మెరిట్‌ ప్రాతిపదికన, రిజర్వేషన్లు పాటిస్తూ భర్తీ చేస్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మోడల్‌ స్కూళ్లలో ఆరో తరగతి అడ్మిషన్లకు ప్రవేశ పరీక్ష నిర్వహించి, మెరిట్‌ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు.


Updated Date - 2020-03-02T07:39:19+05:30 IST