‘ఆంగ్లం’పై అడ్డదారి!

ABN , First Publish Date - 2020-03-24T08:50:55+05:30 IST

రాష్ట్రంలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ ఉత్తర్వులపై నమోదైన కేసులపై...

‘ఆంగ్లం’పై అడ్డదారి!

కోర్టులో ఇంగ్లీషు మీడియం వివాదం

అయినా అమలు దిశగానే అడుగులు

మండలానికో తెలుగు మీడియం బడి

అక్కడివరకు వెళ్లడానికి రవాణా చార్జీ

హైకోర్టుకు కౌంటర్‌లో చెప్పినవాటినే

ఉత్తర్వుగా వెలువరించిన ప్రభుత్వం

తీర్పు రాకుండానే ఎలా చేసేస్తారు?

రాష్ట్రంలోని భాషాభిమానుల ఆవేదన


అమరావతి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ ఉత్తర్వులపై నమోదైన కేసులపై ఇంకా హైకోర్టు తీర్పు వెలువడనే లేదు. అయినా ఈ నిర్ణయం అమలు దిశగా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. కాకపోతే ఇటునుంచి నేరుగా ముందుకెళితే చిక్కులుంటాయి కాబట్టి, అటునుంచి నరుక్కురావడం మొదలుపెట్టింది. ప్రతి మండలానికి ఒక తెలుగు మీడియం స్కూలును ఏర్పాటు చేస్తూ సోమవారం విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇంగ్లిష్‌ మీడియం విధానాన్ని ఏకపక్షంగా, ఉన్నపళంగా అమలు చేయాలన్న సర్కారును వ్యతిరేకిస్తూ పలు పిటిషన్లు హైకోర్టులో నమోదయ్యాయి. కోర్టు ఆదేశంతో వీటిపై దాఖలు చేసిన కౌంటర్‌లో.. ఇంగ్లిష్‌ మీడియం అమలు వల్ల తెలుగు విద్యార్థులు ఇబ్బంది పడకుండా పలు చర్యలు తీసుకొంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందులోభాగంగానే మండలానికో తెలుగు మీడియం పాఠశాల ఏర్పాటు చేస్తామని, మైనర్‌ భాషలు కొనసాగిస్తామని, అన్ని పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తామని తెలిపింది. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటివరకు హైకోర్టు తీర్పును వెలువరించలేదు. ఈలోపే మండలానికో తెలుగు మీడియం పాఠశాలను అధికారికంగా ప్రకటించేయడం గమనార్హం. తెలుగు మీడియం కోరుకునే విద్యార్థులకు సదరు మండల కేంద్రంలో ఏర్పాటుచేసే ఈ పాఠశాలలో ప్రవేశాలు కల్పిస్తామని విద్యాశాఖ తన ఉత్తర్వుల్లో తెలిపింది. విద్యార్థులు తమ గ్రామం నుంచి మండల కేంద్రం లోని తెలుగు మీడియం పాఠశాలకు చేరుకునేందుకు రవాణా చార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొంది.


ఒరియా, కన్నడ, తమిళం, ఉర్దూ మీడియాలను కొనసాగిస్తామని కూడా తెలిపింది. వీటికి సంబంధించిన పుస్తకాలు, కరదీపికను రూపొందించాలని ఎస్‌సీఈఆర్‌టీ ని ఈ శాఖ ఆదేశించింది. అన్ని మాధ్యమాలలోనూ తప్పనిసరి సబ్జెక్టుగా తెలుగు ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, హైకోర్టు తుది తీర్పు కోసం ఎదురు చూస్తున్న భాషాభిమానులను సర్కారు తీరు బాధించింది. ఇది భాషా వివక్ష కాదా ? అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలలు ఒక కిలోమీటరు దూరం లోపే ఉండాల్సి ఉంటుందని, మండలానికి ఒక తెలుగు మీడియం స్కూలు పెడితే విద్యార్థులు అంత దూరం ఎలా ప్రయాణించగలరని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. ఇలాంటి విధానాలతో అన్ని భాషలవారికీ సమన్యాయం ఎలా జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Read more