ఇంజనీరింగ్ ఫీజులో ఇష్టారాజ్యం!
ABN , First Publish Date - 2020-12-06T08:14:23+05:30 IST
ఇంజనీరింగ్ ట్యూషన్ ఫీజుల విషయంలో అంతా ఇష్టారాజ్యమే నడుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘మన వాళ్లు... మన పార్టీకి సానుభూతిపరులైతే చాలు. ఎక్కువ ఫీజు నిర్ణయించండి.

‘సొంత ’ కాలేజీలకు ఎక్కువ రుసుము
ఇతరుల కాలేజీల ఫీజుల్లో భారీగా కోత
ఏఎ్‌ఫఆర్‌సీ సిఫారసులకు మార్పులు
కులం, పార్టీ చూసి మరీ ఫీజు నిర్ణయం
నివేదిక అంది దాదాపు రెండు నెలలు
ఇప్పటికీ ఖరారుకాని ఇంజనీరింగ్ ఫీజులు
‘రాజకీయ కసరత్తే’ కారణమనే ఆరోపణ
పొరుగు రాష్ట్రాల్లో పూర్తయిన అడ్మిషన్లు
వేల సంఖ్యలో మన విద్యార్థుల వలసలు
మా లెక్క మాదే
ఆ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రమాణాలు ఎలా ఉన్నాయి? ప్రయోగశాలలు పద్ధతిగా ఉన్నాయా? బోధనా సిబ్బంది తగిన సంఖ్యలో ఉన్నారా? వారికి చెల్లిస్తున్న జీతాలు ఎంత? మొత్తంగా కాలేజీ నిర్వహణ ఎలా ఉంది?... నిబంధనల ప్రకారం ఇంజనీరింగ్ ఫీజులు నిర్ణయించడానికి ప్రాతిపదికలు ఇవి! కానీ... ఇప్పుడేం జరుగుతోందో తెలుసా? ఆ ఇంజనీరింగ్ కాలేజీ ఎవరిది? యాజమాన్యం సామాజిక వర్గం ఏది? రాజకీయాలతో సంబంధం ఉందా? ఉంటే... ఏ పార్టీ సానుభూతిపరులు? ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులు నిర్ణయించడానికి ఇవీ ఇప్పుడు ప్రాతిపదికలు!
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఇంజనీరింగ్ ట్యూషన్ ఫీజుల విషయంలో అంతా ఇష్టారాజ్యమే నడుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘మన వాళ్లు... మన పార్టీకి సానుభూతిపరులైతే చాలు. ఎక్కువ ఫీజు నిర్ణయించండి. ఇతరత్రా విషయాలు పట్టించుకోవద్దు’... అని ప్రభుత్వ పెద్దలు సిఫారసు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానుసారం పెంచితే ఇబ్బంది వస్తుందేమో అని అధికారులు చెబుతున్నా పట్టించుకోవడంలేదు. ఆ మేరకు ‘ఇతరుల’ కాలేజీల ఫీజులను తగ్గించి సర్దుబాటు చేయాలని ఆదేశిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో అడ్మిషన్లు కూడా పూర్తయినా... మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల ట్యూషన్ ఫీజులనే ఖరారు చేయలేదు. ఫీజుల నిర్ణయంలో రాజకీయ సమీకరణాలు చూస్తూ, కసరత్తు చేస్తుండటమే దీనికి కారణమని తెలుస్తోంది.
ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఏఎ్‌ఫఆర్‌సీ) సిఫారసులను బుట్టదాఖలు చేసి... ఇష్టానుసారంగా ఫీజుల్లో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. ఫీజులపై ఏఎ్‌ఫఆర్‌సీ సిఫారసులను ప్రభుత్వం యథాతథంగా ఆమోదించి ఉత్తర్వులు జారీ చేసేది. ఇప్పుడు ఈ పద్ధతిని పక్కన పెట్టేశారు. ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులపై గతనెల 12నే ఏఎ్‌ఫఆర్‌సీ తన సిఫారసులను ప్రభుత్వానికి అందించింది. కానీ... సర్కారు వ్యూహాత్మకంగా దీనిని తొక్కిపెట్టినట్లు యాజమాన్యాలు ఆక్రోశిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 230 ఇంజనీరింగ్ కాలేజీలకు 2020-23 వరకు అంటే మూడేళ్ల బ్లాక్ పీరియడ్ ఫీజును ఏఎ్‌ఫఆర్‌సీ ఇప్పటికే ఖరారు చేసింది. 8 కాలేజీలకు గరిష్ఠంగా రూ.78వేలు నిర్ణయించింది. కనిష్ఠ ఫీజు రూ.35 వేలు దాదాపు 90-95 కాలేజీలకు సిఫారసు చేసింది. 2019-20 విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈసారి గరిష్ఠ ఫీజు రూ.8 వేలు పెంచి సిఫారసు చేయడం గమనార్హం. అయితే... ప్రతిపాదిత ఫీజుల జాబితా సర్కారుకు చేరిన తర్వాత ‘అస్మదీయులు-తస్మదీయులు’ అనే కోణంలో మార్పులు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనితీరు, ప్రమాణాలు లేకుండా... కేవలం ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం నడుస్తున్న పలు కాలేజీలకు గరిష్ఠంగా రూ.20 వేలు సిఫారసు చేయాల్సి ఉండగా... ఉదారంగా రూ.35 వేల ఫీజును ప్రతిపాదించారని తెలుస్తోంది.
అన్ని విధాలా నాణ్యమైన విద్యను అందిస్తూ గుడ్‌విల్ ఉన్న కొన్ని కాలేజీలకు మాత్రం ఫీజుల్లో భారీగా కోత పెట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. కోర్టుల్లో కేసులు వేశారనో, ఫలానా సామాజిక వర్గమనో ముద్రవేసి వాస్తవంగా రావాల్సిన ఫీజులకు గండికొట్టారని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈ విషయంలో విద్యామంత్రి పాత్ర నామమాత్రమే అని... కొందరు ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఏఎ్‌ఫఆర్‌సీ మూడు విద్యా సంవత్సరాలకు ఫీజులను సిఫారసు చేయగా.. దాన్ని ఒక సంవత్సరానికి తగ్గించాలని చూస్తున్నారని కూడా చెబుతున్నారు. ఫీజు రీఇంబర్స్‌మెంట్ భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగానే కోతలు పెడుతున్నారనే అభిప్రాయం కూడా ఉంది. అయితే... తమకు గిట్టని వారి కాలేజీల ఫీజులు తగ్గించి, నచ్చిన వారికి మాత్రం పెంచుతున్నట్లు ఆరోపణలున్నాయి. రెగ్యులేటరీ కమిషన్ చేసిన ఫీజుల సిఫారసులపై సీఎంవో అధికారులతో పాటు ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న నేతలు కోరుకున్న మేరకు మార్పులు, చేర్పులు చేస్తున్నారు.
అడ్మిషన్లు ఎప్పుడు?
ఇంజనీరింగ్ ఫీజులు ఇప్పటికీ ఖరారు కాకపోవడంతో అడ్మిషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ఎంసెట్‌లో క్వాలిఫై అయి ఇంజనీరింగ్ అడ్మిషన్ల కోసం దాదాపు లక్ష మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. వేలాది మంది రాష్ట్ర విద్యార్థులు ఉన్నత విద్య కోసం వలసబాట పడుతున్నారు. డీమ్డ్ వర్సిటీలతోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ అడ్మిషన్లు పూర్తయ్యాయి. ఏఎ్‌ఫఆర్‌సీ సిఫారసులను ఆర్థిక శాఖకు పంపించామని చెబుతున్నప్పటికీ... అది వాస్తవం కాదని, ఫీజుల వ్యవహారం ఇంకా సీఎంఓలోనే ఉందని తెలిసింది. ఇదిలా ఉండగా.. గత ఏడాది అమలు చేసిన ఫీజులనే ఈ ఏడాది కూడా కొనసాగించాలన్న ఆలోచన చేస్తున్నారని, మళ్లీ రెగ్యులేటరీ కమిషన్‌తో కసరత్తు చేయించాలన్న యోచనలో ప్రభుత్వం ఉందన్న మాటలూ వినిపిస్తున్నాయి.
ఇంతే ఇస్తాం...
దక్షిణ కోస్తా జిల్లాల్లోని ఒక ఇంజనీరింగ్ కాలేజీకి మంచి పేరే ఉంది. ఇప్పటిదాకా ఆ కాలేజీ ఫీజు రూ.50వేలు. కానీ... ఈసారి రూ.28 వేలే ఇస్తామని తేల్చేశారు. తమ కాలేజీలో అనుసరించే ప్రమాణాలు చూడాలని పదేపదే విన్నవించుకోగా... మరో రూ.10వేలు పెంచుతాం, అంతకంటే పైసా ఎక్కువ ఇచ్చేది లేదని తేల్చేశారు. ఇంత తక్కువ ఫీజుతో కాలేజీ నడపలేమని, మూడేళ్లు మూసేసుకోవడమే మంచిదని సదరు కాలేజీ యాజమాన్యం భావిస్తోంది.
అంతా ‘సొంత’ పంథా...
గత విద్యా సంవత్సరంలో ఎలాంటి కారణం లేకుండా ఫీజుల్లో కోత పెట్టారు. దీనిని న్యాయస్థానంలో సవాల్ చేసిన కాలేజీలపై కక్ష సాధించడం మొదలుపెట్టారు. ఫీజు బకాయిలను విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. కాలేజీల పనితీరు, ప్రతిష్ఠను కాదని... ‘మేం చెప్పిన ఫీజుకు అంగీకరించాల్సిందే’ అని ఒత్తిడి తెచ్చారు. ఈసారి ఏకంగా కాలేజీ యాజమాన్యాల కులగోత్రాలు, రాజకీయ ఆసక్తులను కూడా దృష్టిలో పెట్టుకుని ఫీజులు నిర్ణయించాలంటూ అధికారులను ఆదేశిస్తున్నట్లు తెలిసింది.