-
-
Home » Andhra Pradesh » Eluru victims killed two more
-
ఏలూరు బాధితులు మరో ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2020-12-10T08:21:32+05:30 IST
ఏలూరులో కలకలం సృష్టిస్తున్న వింతవ్యాధి బాధితులు మరో ఇద్దరు మరణించారు. పరిస్థితి విషమంగా ఉన్న బాధితులను మెరుగైన వైద్యం కోసం విజయవాడ

బెజవాడ ఆస్పత్రిలో తుదిశ్వాస
విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఏలూరులో కలకలం సృష్టిస్తున్న వింతవ్యాధి బాధితులు మరో ఇద్దరు మరణించారు. పరిస్థితి విషమంగా ఉన్న బాధితులను మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటి వరకు మొత్తం 30 మందిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో సుబ్బరావమ్మ(56), అప్పారావు(50) బుధవారం మృతి చెందారు. అయితే, సుబ్బరావమ్మ కరోనాతో, అప్పారావు ఊపిరితిత్తుల సమస్యతో మరణించినట్టు ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో మైనేని శ్రీధర్(45) మరణించిన విషయం తెలిసిందే. తాజా మరణాలతో మృతుల సంఖ్య 3కు చేరింది. గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురు ‘ఏలూరు బాధితులు’లో ముగ్గురు కోలుకోవడంతో బుధవారం వారిని డిశ్చార్జి చేశారు.
ప్రయోగశాలకు నీటి నమూనాలు
ఏలూరులో వింత వ్యాధి నేపథ్యంలో తాము వినియోగిస్తున్న నీరు ఎంతవరకూ సురక్షితమనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో మొదలైంది. దీంతో తాము రోజువారీ వినియోగించే నీటి నమూనాలను కొందరు పరీక్షకు పంపుతున్నారు. విశాఖపట్నంలోని ప్రాంతీయ ప్రజారోగ్యశాలకు గత రెండు రోజుల్లో నగరంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి నీటి నమూనాలు పరీక్షలకు వచ్చినట్టు సిబ్బంది తెలిపారు. కాగా, విశాఖలోని ప్రాంతీయ ప్రజారోగ్యశాలలో నీటి నమూనాలను పరీక్షించే సీనియర్ అనలిస్ట్ శివరామకృష్ణను అధికారులు డెప్యూటేషన్‌పై ఏలూరుకు పంపించారు.