అదనపు భారం 2,250కోట్లు!

ABN , First Publish Date - 2020-11-13T08:41:02+05:30 IST

విద్యుత్‌ సంస్థలపై సౌర పిడుగు పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 10వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్లతో అవి భారీనష్టాల్లో కూరుకుపోనున్నాయి.

అదనపు భారం 2,250కోట్లు!

 విద్యుత్‌ సంస్థలపై సౌర పిడుగు 

సౌర విద్యుత్‌ కొత్త ప్లాంట్ల ఏర్పాటుతో  ఏటా అదనపు భారంపై జేఏసీ లెక్కలు

కొత్త ఒప్పందాలతో నిండా మునిగిపోతాం 

విద్యుత్‌ ఇంజనీర్ల సంఘాల హెచ్చరికలు 

ధరలు ఇంకా తగ్గే అవకాశం: ప్రివ్యూ కమిటీ 

అయిననూ ముందుకే అంటున్న ప్రభుత్వం 


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

విద్యుత్‌ సంస్థలపై సౌర పిడుగు పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 10వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్లతో అవి భారీనష్టాల్లో కూరుకుపోనున్నాయి. ఈ ప్లాంట్లు రంగంలోకి వస్తే ఏటా రూ.2,250 కోట్ల అదనపు భారం పడుతుందని విద్యుత్‌ ఇంజనీర్ల జేఏసీ లెక్కగట్టింది. ఇప్పటికే వాడకానికి మించిన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు ఉన్నాయని, ఇంకా కొత్తవి కుదుర్చుకొంటే అదనపు చెల్లింపులు చేయాల్సి రావడం ప్రభుత్వ విద్యుత్‌ సంస్థలను ముంచివేస్తుందని పేర్కొంది. ఈ లెక్కలను జేఏసీ వర్గాలు ఇప్పటికే ప్రభుత్వానికి అందజేశాయి. ఇప్పటికే భారీనష్టాల్లో ఉన్న విద్యుత్‌ సంస్థలు కొత్త సౌర ఒప్పందాలతో మరింత కూరుకుపోతాయన్న భయాలు విద్యుత్‌ వర్గాలను వెంటాడుతున్నాయి. 


వాడకానికి రెట్టింపుగా పీపీఏలు 

ప్రస్తుతం రాష్ట్రంలో సగటున 10వేల మెగావాట్ల విద్యుత్‌ వాడకం ఉంది. దీనికి రెట్టింపు స్థాయిలో అంటే 20వేల మెగావాట్లకు సరిపడా పీపీఏలు ఉన్నాయి. అధికారికంగా కుదుర్చుకొన్న ఈ ఒప్పందాల ప్రకారం ఉత్పత్తిదారుల నుంచి విద్యుత్‌ సంస్థలు తప్పనిసరిగా విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తగినంత వాడకం లేక విద్యుత్‌ తీసుకొనే పరిస్థితి లేకపోతే ఉత్పత్తిదారులకు విద్యుత్‌ సంస్థలు స్థిర చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ భారం తలకుమించి ఉండగా వైసీపీ ప్రభుత్వం కొత్తగా పది వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లు ప్రతిపాదించింది. వీటి ఉత్పత్తిదారులతో కూడా ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంది. వ్యవసాయ రంగానికి సరఫరా కోసమే సౌర ప్లాంట్లు పెట్టిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ దీనికోసం విద్యుత్‌ సంస్థలు ఇప్పటికే అవసరానికి మించి పీపీఏలు కుదుర్చుకొన్నాయి.


ఇప్పుడు ప్రభుత్వం సౌరవిద్యుత్‌ ద్వారా వేరే ఏర్పాటు చేస్తే పాత ఒప్పందాల కింద లభ్యమయ్యే విద్యుత్‌ వృథాగా మిగిలిపోతుంది. ఆ విద్యుత్‌ను తీసుకోకపోయినా విద్యుత్‌ సంస్థలపై ఏడాదికి రూ.2,250కోట్ల అదనపు భారం పడుతుందని జేఏసీ తేల్చింది. యూనిట్‌కు రూ.1.50 చొప్పున చెల్లించాల్సి వస్తుందన్న అంచనాతో ఈ లెక్కలు వేశారు. ‘ఇప్పటికే విద్యుత్‌ సంస్థలు భారీ నష్టాల్లో ఉన్నాయి. కొత్త భారాన్ని తట్టుకోవాలంటే చార్జీలు పెంచాలి. ప్రభుత్వ అత్యుత్సాహానికి వినియోగదారులు ఎందుకు పెనాల్టీ చెల్లించాలి?’ అని జేఏసీ నేత ఒకరు ప్రశ్నించారు. 


ప్రభుత్వ వర్గాల్లో తర్జనభర్జన 

విద్యుత్‌ ఇంజనీర్ల జేఏసీ వాదనపై ప్రభుత్వ వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి. ఈ సమయంలో అదనపు ఉత్పత్తి కోసం కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకోవడం తెలివైన నిర్ణయం కాదని కొందరు అధికారులు వ్యక్తిగత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించాలని ఆదేశాలు రావడంతో కొందరు అధికారులు దానికి అనుగుణంగా లెక్కలు సిద్ధం చేశారు. రాష్ట్రంలో విద్యుత్‌ వాడకం ఏటా 5-6శాతం పెరిగే అవకాశం ఉందని, దాని ప్రకారం ఐదేళ్లలో అదనపు భారం ఉండబోదని చెబుతున్నారు. అయితే దీనిపై  భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘కరోనా తర్వాత మాంద్యం సూచనలు కనిపిస్తున్నాయి. ఐదేళ్ల వరకూ ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్‌ వాడకం పెరిగే అవకాశమే లేదని అంతర్జాతీయ ఇంధన సంఘం(ఐఈఏ) స్పష్టం చేసింది. వాడకం పెరుగుతుందో లేదో తెలియకుండా ఊహలతో లెక్కలు వేయడం ఎంతవరకూ సమంజసం? దీనిపై స్పష్టత రాకుండా ముందుకు వెళ్తే దెబ్బ తింటాం’ అని విద్యుత్‌ వ్యవహారాల్లో అనుభవం ఉన్న ఓ అధికారి వ్యాఖ్యానించారు.


వాడకం కొంత పెరిగినా ఇప్పటికే కుదిరిన పీపీఏల ద్వారా సరఫరా అయ్యే విద్యుత్‌ దానికి సరిపోతుందని, ఇంకా అదనంగా అవసరం లేదని మరో అధికారి స్పష్టం చేశారు. టెండర్ల ముందస్తు పరిశీలనకు ఏర్పాటైన న్యాయసమీక్ష కమిషన్‌ మరో కోణాన్ని ఎత్తిచూపింది. ‘సౌరవిద్యుత్‌ రంగంలో సాంకేతికత ఎప్పటికప్పుడు మారుతున్నందువల్ల మున్ముందు ఆ విద్యుత్‌ యూనిట్‌ ఒక రూపాయికే లభ్యం కావచ్చు. దాన్ని కూడా దృష్టిలో ఉంచుకోండి’ అని ప్రభుత్వానికి సూచించింది. ఇప్పుడు టెండర్లు పిలిస్తే యూనిట్‌ ధర పన్నులతో కలుపుకొని రూ.2.60-2.70 వరకూ పలకవచ్చని అంచనా. న్యాయసమీక్ష కమిషన్‌ అభిప్రాయపడినట్లు మున్ముందు ధర తగ్గితే ప్రభుత్వంపై భారీగా భారం పడుతుంది. పైగా ఇప్పుడు ఈ ధర 30ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఒకసారి ఒప్పందం కుదుర్చుకొన్న తర్వాత దాన్ని తగ్గించడం వీలుకాదు. ఇప్పుడు విద్యుత్‌ డిమాండ్‌ కూడా అంతగా లేనందువల్ల ఏటా 500 మెగావాట్ల చొప్పున కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేస్తే టెక్నాలజీ మార్పు వల్ల ధర తగ్గినప్పుడు ఆ లాభాన్ని అందుకోవచ్చని, ఒకేసారి 10వేల మెగావాట్ల ప్లాంట్లు పెడితే ధర తగ్గినా ఆ లాభం దక్కదని విద్యుత్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ లెక్కలను ప్రభుత్వం లక్ష్యపెడుతున్న సూచనలు కనిపించడం లేదు. తన నిర్ణయంపై ముందడుగు వేసే యోచనలోనే ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2020-11-13T08:41:02+05:30 IST