విధానం మార్చి.. మోత
ABN , First Publish Date - 2020-05-17T09:49:44+05:30 IST
విద్యుత్ బిల్లుల లెక్కింపు విధానంలో ఏప్రిల్ నుంచి తీసుకొచ్చిన మార్పు ఈసారి బిల్లులు మోత మోగడానికి ప్రధాన కారణంగా వినిపిస్తోంది.

‘డైనమిక్’తోనే విద్యుత్ షాక్
2 నెలల రీడింగూ దెబ్బ కొట్టింది
బిల్లు చూసి సామాన్యుడి కన్నీరు
లెక్కల గజిబిజితో తలలు
బాదుకుంటున్న వినియోగదారులు
అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): విద్యుత్ బిల్లుల లెక్కింపు విధానంలో ఏప్రిల్ నుంచి తీసుకొచ్చిన మార్పు ఈసారి బిల్లులు మోత మోగడానికి ప్రధాన కారణంగా వినిపిస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో బిల్లుల లెక్కింపునకు స్టాటిక్ విధానం అనుసరించగా... వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డైనమిక్ విధానం తీసుకువచ్చారు. దీనివల్లే బిల్లుల భారం పెరిగిపోయిందన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. రెండు నెలలకు కలిపి మే నెలలో ఇచ్చిన బిల్లులు పేలుతున్నాయని, తాము ఏనాడూ చూడని స్థాయిలో ఇవి వస్తున్నాయని వినియోగదారుల నుంచి విమర్శలు కురుస్తున్న విషయం తెలిసిందే. విధానం మార్పే దీనికి ప్రధాన కారణమని ఈ అంశాలపై అవగాహన ఉన్న నిపుణులు చెబుతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో స్టాటిక్ విధానం అమల్లో ఉండేది.
అంటే ఒక వినియోగదారుడి సంవత్సరం వాడకాన్ని సరాసరిగా తీసుకొని శ్లాబులను నిర్ణయించేవారు. ఉదాహరణకు ఒక వినియోగదారుడు ఎనిమిది నెలలు తక్కువ వాడి నాలుగు నెలలు ఎక్కువ వాడినా సరాసరి తక్కువ ఉండటం వల్ల తక్కువ రేటు ఉన్న శ్లాబుల్లోనే ఉండేవాడు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని మార్చి డైనమిక్ బిల్లింగ్ విధానం తెచ్చారు. దీని ప్రకారం ఏ నెల వాడకాన్ని బట్టి ఆ నెల శ్లాబును నిర్ణయిస్తారు. ఈ విధానం ఈ వేసవిలో ప్రజల గుండె గుభేలుమనిపిస్తోంది. గతంలో వేసవిలో కొంత ఎక్కువ వాడకం ఉన్నా సంవత్సరం సరాసరి వల్ల ఎక్కువ మంది వినియోగదారులు ఏ లేదా బీ గ్రూపుల్లో ఉండేవారు. ఇప్పుడు డైనమిక్ లెక్కింపు విధానం వల్ల ఎక్కువ మంది సీ గ్రూప్‌లో పడ్డారు. దీనితో బిల్లులు అమాంతం పెరిగిపోయాయి. ఈ గ్రూపుల మధ్య రేట్లలో చాలా తేడాలు ఉన్నాయి. ఉదాహరణకు ఏ గ్రూప్‌లో మొదటి ఏభై యూనిట్లకు ఒక యూనిట్ ధర రూ.1.45 పడుతుంది. అదే బీ గ్రూప్‌లో మొదటి 50 యూనిట్ల వరకూ ఒక యూనిట్ ధర రూ.2.60 పడుతుంది.
అదే సీ గ్రూప్‌లో మొదటి ఏభై యూనిట్లకు ఒక యూనిట్ ధర రూ.2.65, తర్వాతి ఏభై యూనిట్లకు ఒక యూనిట్ ధర రూ.3.35 పడుతుంది. సి గ్రూప్‌లో ధర ఇలా పైపైకి పోతూనే ఉంటుంది. వాడకం నాలుగు వందల యూనిట్లు దాటితే అక్కడ నుంచి యూనిట్ ధర రూ.8.50 పడుతుంది. ఐదు వందలు దాటితే ఒక యూనిట్ ధర పది రూపాయలు పడుతుంది. వాడకం ఆరు వందల యూనిట్లకు చేరిన వారికి చివరి రెండు వందల యూనిట్ల వల్లే రూ.1850 బిల్లు వచ్చే పరిస్థితి నెలకొంది. వేసవి... అందులోనూ లాక్‌డౌన్ ఉండటంతో కాస్త వాడకం పెరిగిన వారందరికీ డైనమిక్ విధానంలో వేలల్లో బిల్లులు వచ్చాయి.
లెక్కలతో జుట్టు పీక్కొంటున్న వినియోగదారులు
ఈ రెండు నెలల బిల్లుల తయారీలో విద్యుత్ శాఖ అనుసరించిన విధానం... రూపొందించిన లెక్కలు చూసి వినియోగదారులు ఏమీ అర్థం కాక జుట్టు పీక్కొంటున్నారు. ఒక వినియోగదారునికి మార్చి 10న మీటర్ రీడింగ్ తీస్తే మళ్ళీ మే 10న రీడింగ్ తీశారు. అంటే 60 రోజులు.. ఇందులో 21 రోజులు మార్చి లెక్కలో వేశారు. తొమ్మిది రోజులు ఏప్రిల్ కింద వేశారు. మరో ముప్ఫై రోజులు మరో బిల్లుగా చూపించారు. మార్చి నెలకు ఒక లెక్క... మిగిలిన రోజులకు ఒక లెక్క అనుసరించారు. ఉదాహరణకు గుంటూరు నగరంలో ఒక వినియోగదారుడికి 60 రోజులకు రీడింగ్ తీశారు. ఇందులో 23 రోజులకు వాడకం 211 యూనిట్లుగా చూపించారు. దానికి రూ.875 బిల్లు వచ్చింది. మిగిలిన 37 రోజులకు 342 యూనిట్ల వాడకం చూపించారు. దానికి రూ.1710 బిల్లు వచ్చింది. వాడకం ఏభై శాతం పెరిగితే బిల్లు మాత్రం వంద శాతం పెరిగింది.
అలాగే కృష్ణా జిల్లా పోరంకి గ్రామ వాసికి రెండు నెలలకు రూ.880గా బిల్లు వేశారు. దీనిలో 23 రోజులకు పాత టారిఫ్ ప్రకారం, మరో ఏడు రోజులకు కొత్త టారిఫ్ ప్రకారం కలిపి మొత్తం 174 యూనిట్లకు బిల్లు అన్ని ఇతరాలతో కలుపుకుకొని రూ.534.14గా పేర్కొన్నారు. మరో 30 రోజులకు కొత్త టారిఫ్ ప్రకారం మొత్తం 175 యూనిట్లకూ అన్ని ఇతరాలతో కలుపుకొని రూ.581.32గా పేర్కొన్నారు. అంటే వాడకంలో ఒక్క యూనిట్టే పెరిగినా బిల్లు మాత్రం రూ.47.18 పెరిగింది. కేవలం 500 యూనిట్లుపైన వాడుకొన్న వారికి మాత్రమే యూనిట్‌కు రూపాయి పెంచామని అధికారులు చెబుతున్నా బిల్లులు భారీగా రావడం డైనమిక్ విధానం దెబ్బేనని కొన్ని వర్గాలు వివరిస్తున్నాయి. వినియోగదారుల అవగాహన కోసం గత రెండు సంవత్సరాల వాడకం వివరాలు నెట్‌లో పెట్టామని, ఎవరైనా చూసుకోవచ్చునని విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు. ఆ వివరాలు చూస్తున్న వినియోగదారులకు ఇంకా గందరగోళం పెరుగుతోంది. గుంటూరు వినియోగదారుడికి గత వేసవిలో తక్కువ యూనిట్ల వాడకానికి ఎక్కువ బిల్లు... ఎక్కువ యూనిట్ల వాడకానికి తక్కువ బిల్లు వచ్చినట్లు కనిపిస్తోంది. ఇది టైపింగ్ పొరపాటా లేక మరేదైనా మతలబా ఆ వినియోగదారునికి అర్థం కాలేదు.