పునర్విభజిత పంచాయతీలు, మండలాలకూ ఎన్నికలు!

ABN , First Publish Date - 2020-03-02T08:26:24+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన పంచాయతీలు, పునర్విభజన చేపట్టిన మండలాలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల...

పునర్విభజిత పంచాయతీలు, మండలాలకూ ఎన్నికలు!

  • 3న ఓటర్ల జాబితా విడుదలకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు


అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన పంచాయతీలు, పునర్విభజన చేపట్టిన మండలాలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇప్పటికే పంచాయతీలకు, మండల, జిల్లా పరిషత్‌ల ఎన్నికలు జరిపేందుకు 2019 అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా ఓటర్ల జాబితాను తయారుచేసి ప్రకటించారు.  ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 777 కొత్త గ్రామ పంచాయతీలను పునర్విభజన ప్రక్రియ ద్వారా ఏర్పాటు చేసింది. 187 మండల పరిషత్‌లకు సంబంధించి ఎంపీటీసీలను పునర్విభజన చేయడం, కొన్ని పట్టణ స్థానికసంస్థల్లో విలీనం చేయడం తదితర ప్రక్రియ చేపట్టారు. అయితే వీటికి ఓటర్ల జాబితా  నోటిఫికేషన్‌ విడుదల చేయకపోవడంతో మరో విడతలో ఎన్నికలు జరపాల్సి వస్తోంది. ఈ గ్రామ పంచాయతీలు, మండలాల్లో  కూడా ఓటర్ల జాబితాను ప్రకటించి, అన్ని గ్రామ పంచాయతీలకు, మండల, జిల్లా పరిషత్‌లకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరింది. దీంతో ఈ నెల 3న కొత్తగా ఏర్పాటుచేసిన గ్రామ పంచాయతీ, 4న మండలపరిషత్‌ల్లోను ఓటర్ల జాబితా నోటిఫికేషన్‌ ప్రకటించాలని అన్ని జిల్లా కలెక్టర్లకు సూచిస్తూ  ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  

Updated Date - 2020-03-02T08:26:24+05:30 IST