-
-
Home » Andhra Pradesh » ELECTION COMMISION GIVES MORE TIME TO HER
-
ఆమెకు మరో అవకాశం!
ABN , First Publish Date - 2020-03-13T09:30:14+05:30 IST
స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల దాఖలులో జరుగుతున్న అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కన్నెర్ర చేసింది. వైసీపీ నేతల ఆగడాలతో నామినేషన్ వేయలేకపోయిన...

- గడువు ముగిసినా నామినేషన్‌కు అనుమతి
- రాష్ట్ర ఎన్నికల కమిషన్ అసాధారణ నిర్ణయం
- నామినేషన్ దాఖలు చేసిన పాలపాడు అభ్యర్థి
అమరావతి/ గుంటూరు, మార్చి 12(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల దాఖలులో జరుగుతున్న అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కన్నెర్ర చేసింది. వైసీపీ నేతల ఆగడాలతో నామినేషన్ వేయలేకపోయిన అభ్యర్థికి గడువు పూర్తయినప్పటికీ గురువారం నామినేషన్ దాఖలుకు అనుమతి ఇచ్చింది. నరసరావుపేట నియోజకవర్గ పరిధిలోని పాలపాడు ఎంపీటీసీ (ఓసీ జనరల్) స్థానానికి టీడీపీ తరఫున తన కోడలు పులిమి ప్రతిభాభారతితో నామినేషన్ వేయించేందుకు ఆర్వో వద్దకు వెళ్తున్న పులిమి వెంకటరామిరెడ్డిపై వైసీపీ నేతలు బుధవారం దాడిచేశారు. అతడి చేతిలోని పత్రాలు చించివేసి, నామినేషన్ వేయనివ్వకుండా గెంటివేశారు.
సమాచారం ఈసీ దృష్టికి వెళ్లడంతో స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తనకున్న విశేషాధికారాలు ఉపయోగించి ప్రతిభా భారతి నామినేషన్ దాఖలు చేసేందుకు గురువారం సాయంత్రం వరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గురువారం ఆమె నామినేషన్ దాఖలు చేసినట్లు కలెక్టర్ సమాచారం ఇచ్చారని ఎన్నికల కమిషనర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అల్లర్లు, దౌర్జన్యాలు జరిగినప్పుడు ఎన్నికలు వాయిదా వేసిన సందర్భాలున్నాయి. కానీ ఎన్నికల కమిషన్ తనకున్న విశేష అధికారాలతో గడువు పూర్తయిన తర్వాత నామినేషన్ మళ్లీ వేయించడం అరుదైన సంఘటన. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అసాధారణ రీతిలో స్పందించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
కంకణాలపల్లి జనసేన అభ్యర్థిపై దాడి, కిడ్నాప్
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా జనసేన తరఫున నామినేషన్ దాఖలు చేసిన వేల్పూరి శ్రీనివాసరావుపై బుధవారం అర్ధరాత్రి వైసీపీ నేతలు దాడికి పాల్పడి, కిడ్నాప్ చేశారు. అతడిని ఎలాగైనా బరిలో నుంచి ఉపసంహరించుకునేలా చేయాలని ప్రయత్నిస్తున్నారు. గురువారం రాత్రి వరకు కూడా అతడిని అజ్ఞాతంలోనే ఉంచి బెదిరిస్తున్నారని చెబుతున్నారు.