ఈడీ దృష్టికి ‘ఒంగోలు నగదు’
ABN , First Publish Date - 2020-07-27T08:25:52+05:30 IST
హవాలా సహా నగదు అక్రమ తరలింపుపై దర్యాప్తు చేసే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు విభాగం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టికి ‘ఒంగోలు నగదు’ కేసు వెళ్లింది.

మంత్రి బాలినేని పాత్రపై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు
మొదలైన ప్రాథమిక దర్యాప్తు
అమరావతి, జూలై 26(ఆంధ్రజ్యోతి): హవాలా సహా నగదు అక్రమ తరలింపుపై దర్యాప్తు చేసే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు విభాగం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టికి ‘ఒంగోలు నగదు’ కేసు వెళ్లింది. దీనిపై ఆ సంస్థ వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం తమిళనాడు సరిహద్దులోని ఎలవూర్ చెక్‌పోస్టు వద్ద అక్కడి పోలీసులు రూ.5.27 కోట్ల నగదును స్వాధీనం చేసుకొన్నారు. ఆ వాహనంపై ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి వాహన స్టిక్కర్ ఉండటం సంచలనం కలిగించింది. ఈ వ్యవహారంపై టీడీపీ ఎంపీ కె.రామ్మోహన్ నాయుడు ఈడీకి ఒక ఫిర్యాదు పంపారు.
ఈ డబ్బు ఏపీ సీఎం జగన్‌కు సమీప బంధువు, రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించినదిగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, వాహనం కూడా మంత్రిదేనని అంటున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి తరచూ పెద్ద మొత్తంలో నగదు తమిళనాడుకు తరలివెళ్తోందని, ఇప్పుడు పట్టుబడింది అందులో ఒక చిన్న మొత్తం మాత్రమేనని... మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేయాలని ఆయన కోరారు. ఎంపీ ఫిర్యాదుతో ఈడీ అధికారులు ప్రాథమిక దర్యాప్తు మొదలు పెట్టారని, ప్రస్తుతం వివరాల సేకరణ జరుగుతోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.