ఏ తీరానికి ఏపీ నావ?

ABN , First Publish Date - 2020-06-19T09:08:59+05:30 IST

‘కరోనా కాలంలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం! డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నామో తెలియక, ..

ఏ తీరానికి ఏపీ నావ?

పంపకమే మంత్రం అప్పులే ఆధారం

ఏ తీరానికి రెండున్నర నెలల్లో రూ.13 వేల కోట్లు అప్పు

ఇది సొంత ఆదాయానికి మూడు రెట్లు

కేంద్రం నుంచి అందిన రూ.10 వేల కోట్లు

మొత్తం డబ్బు సంక్షేమం, వేతనాలకే సరి

అభివృద్ధిపై పెట్టిన ఖర్చు దాదాపు సున్నా

రాష్ట్రానికి ఆస్తుల సృష్టిపై ఏదీ దృష్టి?

గత ఏడాది పెట్టుబడుల వ్యయం 12 వేల కోట్లు

అవి కూడా పాత, విదేశీ ప్రాజెక్టులవే

ఇలాగైతే భారీగా పడిపోనున్న జీఎస్డీపీ

అప్పుడు అప్పులూ పుట్టక దివాలా పరిస్థితి!మూలధన వ్యయాన్ని బట్టే రాష్ట్ర అభివృద్ధి, ఆస్తుల సృష్టి ఆధారపడి ఉంటాయి. గత ఆర్థిక సంవత్సరం ఈ పద్దుకింద ఖర్చు పెట్టింది రూ.12 వేల కోట్లు. ఇవన్నీ పాత, విదేశీ సహాయంతో నడిచే ప్రాజెక్టులే! ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండున్నర నెలల్లో అభివృద్ధిపై పెట్టిన వ్యయం... దాదాపు సున్నా!


ఆస్తులు సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుంది. జీఎస్డీపీ వృద్ధి జరుగుతుంది. అప్పుడే అప్పులూ తెచ్చుకోవచ్చు! అదే లేనప్పుడు... అప్పుల్లేవు, అభివృద్ధి లేదు, సంక్షేమమూ ఉండదు!


(అమరావతి - ఆంధ్రజ్యోతి): ‘కరోనా కాలంలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం! డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నామో తెలియక, విమర్శించడానికి ఏమీ లేక విపక్షాలు విలవిల్లాడుతున్నాయి’ ...అని ప్రభుత్వ పెద్దలు ఘనంగా చెప్పుకొంటున్నారు. దీనిని తమ సమర్థతగా, అద్భుతమైన పాలనకు నిదర్శనంగా వర్ణిస్తున్నారు. ఇంతకీ వీరి ‘విజయ రహస్యం’ ఏమిటంటే... అప్పులు తేవడం.. అభివృద్ధిని అటకెక్కించడం! పొరుగున ఉన్న తెలంగాణ ధనిక రాష్ట్రం! అక్కడ కూడా కరోనా తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను 50 శాతం తగ్గించి... చెల్లింపును వాయిదా వేశారు. పెన్షన్లకు కూడా కోత పెట్టారు. దీనిపై ఏకంగా ఆర్డినెన్స్‌ కూడా జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ లోటుపోటుతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రం. రెండు నెలలు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతం చెల్లించారు. మూడో నెల నుంచి

 పూర్తి వేతనమే ఇస్తున్నారు. ఈ కరోనా కాలంలోనే నేతన్నలకు, మత్స్యకారులకు సొమ్ములు చెల్లించారు. ‘వాహన మిత్ర’ నగదునూ జమ చేశారు. ఇదెలా సాధ్యమైందనే ప్రశ్న ఆర్థిక నిపుణుల్లోనూ తలెత్తుతోంది. అయితే... ఇదంతా అచ్చంగా అప్పులు తేవడం, అభివృద్ధిని నిలిపివేయడంతోనే సాధ్యమైంది. 


ఆదాయానికి 3 రెట్ల అప్పులు

గడచిన రెండున్నర నెలల కాలంలో రాష్ట్రానికి పన్నులు, పన్నేతర ఆదాయం కలిపి రూ.4,700 కోట్లు సమకూరింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.13 వేల కోట్లు అప్పు చేసింది. అంటే... ఆదాయానికి దాదాపు మూడు రెట్లు అప్పు చేసిందన్నమాట!  వేతనాలు, పెన్షన్లు, కార్యాలయాల నిర్వహణ ఖర్చులు కలిపి రూ.12,000 కోట్ల వరకు ఉన్నాయి. అంటే... ఇదంతా దాదాపుగా అప్పు చేసిన సొమ్మే. ఇక... సంక్షేమ పథకాలు ఎలా అమలు చేశారో చూద్దాం! కేంద్రం నుంచి కరోనా ప్రత్యేక నిధులు, సాధారణ చెల్లింపులు కలిపి రెండున్నర నెలల్లో రూ.10వేల కోట్లు వచ్చాయి. దీంతోపాటు రాష్ట్రానికి సొంతంగా వచ్చిన ఆదాయం రూ.4,700 కోట్లు. ఈ మొత్తం నిధులను వ్యక్తిగత లబ్ధి చేకూర్చే పథకాలకు ఖర్చు చేశారు. జగనన్న చేదోడుకు 247 కోట్లు, అమ్మ ఒడికి 6336 కోట్లు, విద్యా దీవెన 3329 కోట్లు, వసతి దీవెన 2087 కోట్లు, మత్స్యకార భరోసా రూ.110 కోట్లు, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రూ.వెయ్యి కోట్లు, రైతు భరోసా కింద రూ.3600 కోట్లు, వాహన మిత్రకు రూ.262 కోట్లు చెల్లింపులు చేశారు.


ఈ పథకాల్లో కొన్నింటికి కేంద్రం నుంచి కూడా కొంత మేర సహాయం అందింది. అంటే... తెచ్చుకున్న అప్పులు, కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ వేతనాలు, పింఛన్లతోపాటు, వ్యక్తిగత సంక్షేమ పథకాలకు పంపిణీ చేయడానికి సరిపోయాయి! ఇంకా... ప్రతి వారం రూ.వెయ్యి కోట్లు అప్పు తెచ్చుకుంటున్నారు.  వేతనాల్లో కోతపై కోర్టుకు వెళ్లిన నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతం చెల్లించారని... లేనిపక్షంలో ప్రస్తుతానికి 50 శాతమే కొనసాగించేవారని ఒక వాదన ఉంది. 


ఇలాగైతే దివాలా...

కరోనా నేపథ్యంలో ఆదాయం తగ్గడంతో... తెలంగాణ ప్రభుత్వం ఆ మేరకు అన్ని రకాల ఖర్చులను, చెల్లింపులను తగ్గిస్తూ వచ్చింది. బడ్జెట్‌ కేటాయింపుల ప్రకారం అభివృద్ధి పనులకు నిధులను అదే నిష్పత్తిలో ఇస్తోంది. ఏపీలో ఇందుకు పూర్తిగా భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో కొత్త పెట్టుబడులూ లేవు... కొత్త ప్రాజెక్టులూ లేవు. రహదారులు, వంతెనల పనులు దాదాపుగా ఆగిపోయాయి. పోలవరం మెల్లగా సాగుతోంది.  ఇతర సాగునీటి ప్రాజెక్టులదీ అదే పరిస్థితి. ఇసుక, ఇనుము, సిమెంటు అవసరమైన పనులేవీ ఏపీలో జరగడంలేదు. ఎంపిక చేసిన మేరకు కొందరు కాంట్రాక్టర్లు, పనులకు మాత్రం బిల్లులు చెల్లిస్తున్నారు. ఇదంతా చూస్తే.... రాష్ట్రాభివృద్ధి అక్కర్లేదని, సంక్షేమం పేరిట అప్పుడప్పుడు ప్రజల ఖాతాల్లో సొమ్ములు వేస్తే చాలని ఏపీ సర్కారు భావిస్తున్నట్లుందని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మూలధన వ్యయం తగ్గిపోతే రాష్ట్ర ఉత్పాదక సామర్థ్యం తగ్గుతుంది. ఉత్పాదక సామర్థ్యం తగ్గితే రాష్ట్ర జీఎస్డీపీ పడిపోతుంది. అప్పుడు... అప్పులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.


ఒకవైపు రాష్ట్ర ఆదాయం తగ్గి, మరోవైపు అప్పులు తెచ్చుకునే మార్గమూ లేక రాష్ట్రం దివాళా తీసే దుస్థితికి దిగజారే ప్రమాదం ఉంది. అదే జరిగితే... సంక్షేమం పూర్తిగా మూలన పడుతుంది.  ఇప్పుడంటే కరోనా ఉంది కాబట్టి, ఆదాయం లేదనుకుందాం! ఈ సమస్య లేని గత ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే పరిస్థితి. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద మూలధన వ్యయం (రాష్ట్రానికి ఆస్తులు, ఆదాయ వనరులను సృష్టించే పనులు) కింద ప్రభుత్వం రూ.12,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇవి కూడా పాత, విదేశీ రుణాలతో నడుస్తున్నవే. కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చినవి ఏవీ లేవు. కొన్ని సంవత్సరాల తరబడి అవి అలా నడుస్తూ ఉంటాయి. ఈ ఆర్థిక సంవత్సరం కూడా దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై రెండున్నర నెలలు గడిచినా... అభివృద్ధి కోసం పెట్టిన బడ్జెట్‌ సున్నా. ఈ రెండున్నర నెలల్లో  కేంద్రం నిధులు సమకూర్చే రాష్ట్ర అభివృద్ధి పథకాలు, నాబార్డు, ఈఏపీ, ఏఐబీపీ, కేంద్రం అందించే సహాయం ద్వారా నడిచే పాత ప్రాజెక్టులు తప్ప కొత్త ప్రాజెక్టుల కోసం రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మరి... మన రాష్ట్రం ఎటుపోతున్నట్లు!

Updated Date - 2020-06-19T09:08:59+05:30 IST