పొరుగు మద్యం కిక్కు!

ABN , First Publish Date - 2020-05-18T09:06:49+05:30 IST

మన మద్యం రేటెక్కువై ఘాటెక్కింది. ధరలు రెట్టింపైనా.. కొందామంటే నచ్చిన బ్రాండు కరువైంది. ఏదో ఒకటిలే అని కొంటే.. బ్రాండ్‌కి అలవాటు పడిన బాడీకి కిక్కు దూరమైంది..!

పొరుగు మద్యం కిక్కు!

  • పక్క రాష్ట్రాల నుంచి పోటెత్తుతున్న మందు
  • అడ్డదారులు, వాహనాల్లో అక్రమంగా స్మగ్లింగ్‌
  • తెలంగాణ, కర్ణాటక నుంచి తెచ్చి విక్రయం
  • అడవులు, ఏజెన్సీల్లో నాటు సారా ఏరులు
  • కొన్ని పట్టణాల్లోకి ప్రవేశించిన సారాయి
  • లక్షల లీటర్ల ఊట ధ్వంసం.. పీడీ చట్టం ప్రయోగం


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

మన మద్యం రేటెక్కువై ఘాటెక్కింది. ధరలు రెట్టింపైనా.. కొందామంటే నచ్చిన బ్రాండు కరువైంది. ఏదో ఒకటిలే అని కొంటే.. బ్రాండ్‌కి అలవాటు పడిన బాడీకి కిక్కు దూరమైంది..! దీంతో దిక్కుతోచని స్థితిలో మందుబాబులు పొరుగు రాష్ర్టాల వైపు చూస్తున్నారు. అక్కడైతే నచ్చిన బ్రాండ్‌.. పైగా తక్కువ ధరకే దొరుకుతుంది..! ఇదే అదనుగా పొరుగు మద్యం వాగులు, వంకలు, సరిహద్దులు దాటి రాష్ట్రంలోకి పోటెత్తుతోంది. ప్రతి రోజూ అక్రమ మార్గాల్లో వందలాది వాహనాల్లో.. వేలాది బాటిళ్లు ఏపీలోకి వచ్చేస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం ధరలు ఆకాశాన్ని అంటడంతో.. అంత ఖర్చు చేసుకోలేని వారు నాటుసారా వైపు కూడా చూస్తున్నారు. దీంతో అటవీప్రాంతాల్లో నాటు సారా ఏరులై పారుతోంది. పరిస్థితిని పసిగట్టిన ప్రభుత్వం అక్రమాలకు కళ్లెం వేసేందుకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ)ను ఏర్పాటు చేసింది. దీనికి కమిషనర్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వినీత్‌ బ్రిజిలాల్‌ను నియమించింది. 


తాగుడులో ఐదో స్థానం..

దేశంలోనే మద్యం తాగే వారిలో ఐదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఏడాది క్రితం వరకూ నాలుగున్నర వేల మద్యం షాపులుండేవి. ఏడాది క్రితం అధికారంలోకొచ్చిన వైసీపీ ప్రభుత్వం విడతల వారీగా మద్యం నిషేధిస్తామని చెప్పి మూడో వంతు షాపులు తగ్గించింది. ఎక్సైజ్‌ పాలసీని మార్చేసి ప్రభుత్వమే మద్యం విక్రయిస్తూ సమయం కూడా తగ్గించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో 40 రోజుల తర్వాత మే మొదటి వారంలో మద్యంషాపులు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో మరింత రేటు పెంచి పేదలకు మద్యం అందకుండా చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఏకంగా మూడు రోజుల్లో 75శాతంమేర ధరలు పెంచేసింది. గతేడాది మేలో రూ.90కి కొనుగోలు చేసిన  క్వార్టర్‌ సీసా ఇప్పుడు రూ.200 దాటింది. దీంతో మందుబాబుల దృష్టి పొరుగు రాష్ర్టాలపై పడింది. 


ధరల్లో భారీ వ్యత్యాసం.. 

ఏపీతో పోల్చితే తెలంగాణలో మద్యం ధరలు బాగా తక్కువ. తెలంగాణ, కర్ణాటకలో రూ.1000-1100కు లభించే ఫుల్‌ బాటిల్‌ ఏపీలో రెండు వేలకుపైగా ఉంది. ఏపీలో మద్యం ప్రియులు అలవాటుపడిన బ్రాండ్లు తెలంగాణ, కర్ణాటకలో క్వార్టర్‌ రూ.90 నుంచి రూ.120 ఉండగా ఏపీలో అంతకన్నా నాసిరకం బ్రాండ్లను రూ.150 నుంచి రూ.220 వరకూ విక్రయిస్తున్నారు. దీంతో స్మగ్లర్లు ఆయా రాష్ట్రాల నుంచి అడ్డదారుల్లో మద్యం తీసుకొచ్చి సొమ్ము చేసుకుంటున్నారు.


సరిహద్దుల్లో అడ్డదారులు..

సరిహద్దు జిల్లాలైన కృష్ణా, గుంటూరు, కర్నూలులో ఎక్కువగా తెలంగాణ మద్యం వస్తుండగా చిత్తూరు, అనంతపురం, కర్నూలుకు కర్ణాటక మద్యం వస్తోంది. పశ్చిమ గోదావరిలోకి తెలంగాణ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఒడిసా నుంచి చేరుతోంది. లాక్‌డౌన్‌ సమయంలో రాష్ట్రంలోకి అక్రమంగా తీసుకొస్తుండగా పోలీసులు సీజ్‌ చేసిన మద్యం సుమారు ఐదు వేల కేసులు. నాలుగున్నర వేల మందిని అరెస్టు చేసి 1500కు పైగా వాహనాలు సీజ్‌ చేశారు. నాటు సారా అయితే లక్షల లీటర్ల ఊటను ధ్వంసం చేశారు. వందల మందిని అరెస్టు చేశారు. కర్నూలు జిల్లాలో ఐదు వేల కిలోల బెల్లాన్ని సీజ్‌ అయింది. గత వారం రోజుల గణాంకాలు పరిశీలిస్తే ఒక్క కృష్ణాజిల్లాలోనే 298 కేసులు నమోదయ్యాయి. మొత్తం 480 మందిని అరెస్టు చేసి 4,900 బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు తెలంగాణ నుంచి బైకులపై మద్యం తెస్తున్న వారిని రోజూ అరెస్టు చేస్తూనే ఉన్నారు. ఒడిసా నుంచి సీలేరు, మల్కన్‌గిరి, కోరాపుట్‌ నుంచి విశాఖపట్నం వైపు వస్తోంది. విశాఖ ఏజెన్సీతోపాటు సముద్రతీర ప్రాంతాల్లో నాటుసారా తయారీ ఊపందుకుంది.


అధికార పార్టీ నేతలు కూడా..

పొరుగు రాష్ట్రాల్లో భారీగా కొనుగోలు చేస్తున్న వారిలో అధికార పార్టీ నేతలు కూడా ఉన్నట్లు పోలీసులు పసిగట్టారని తెలిసింది. వాటిని ఆధారాలతో సహా ముఖ్యమంత్రికి వివరించి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. ఇటీవల ప్రకాశంజిల్లా గిద్దలూరు మండలంలో వైసీపీ తరపున ఏకగ్రీవమైన ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి తన కారులో మద్యం తరలిస్తూ పట్టుబడ్డారు. 


నాటుసారాకు బాటలు!

మద్యం ధరల పెంపుతో నాటుసారా ఉత్పత్తి కట్టలు తెంచుకుంటోంది. నాటుసారా ధర క్వార్టర్‌ సుమారు రూ.50కే లభిస్తుంది. మరోవైపు ప్రభుత్వ మద్యం క్వార్టర్‌ రూ.200పైనే ఉండడంతో మందుబాబులు అటువైపు ఆకర్షితులవుతున్నారు. ఇప్పటికే ఎక్కడ దాడులు చేసినా వేల లీటర్ల సారా పట్టుబడుతోంది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఈ ప్రభావం తీవ్రస్థాయిలో ఉంది. మిగిలిన జిల్లాల్లోనూ ఇప్పుడిప్పుడే స్థావరాలు పెరుగుతున్నాయి. అక్రమార్కులు నాటుసారాను ఎర్రచందనం తరహాలో వినూత్నంగా తరలిస్తున్నారు. ఇటీవల కొన్నిచోట్ల అరటి గెల మధ్యలో సారా ప్యాకెట్లు పెట్టి తీసుకెళ్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. అంతేకాదు.. అడవులు, ఏజెన్సీలు, మారుమూల ప్రాంతాలకే పరిమితమైన నాటుసారా పట్టణాల్లోకి కూడా వచ్చేసింది. 

Updated Date - 2020-05-18T09:06:49+05:30 IST