మా భవిష్యత్తు నాశనం చేయొద్దు!

ABN , First Publish Date - 2020-04-21T10:20:57+05:30 IST

‘‘మీ ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్ర భవిష్యత్తుతో పాటు మా జీవితాలు నాశనం చేయొద్దు’’ అని అమరావతి ప్రాంత రైతులు, కూలీలు, మహిళలు ఆవేదన

మా భవిష్యత్తు నాశనం చేయొద్దు!

  • కూల్‌ డ్రింకులు ఇచ్చిన మహిళలను పొగిడారు
  • మా గురించి కూడా కొంచెం ఆలోచించండి
  • రాజధాని ప్రాంత రైతుల వేడుకోలు


గుంటూరు, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): ‘‘మీ ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్ర భవిష్యత్తుతో పాటు మా జీవితాలు నాశనం చేయొద్దు’’ అని అమరావతి ప్రాంత రైతులు, కూలీలు, మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ వారు చేస్తున్న ఆందోళనలు సోమవారానికి 125వ రోజుకు చేరాయి. ‘జై అమరావతి’, ‘సేవ్‌ అమరావతి’ అంటూ ఇళ్లలోనే కూర్చొని మహిళలు, రైతులు నిరసనలు తెలిపారు. ‘‘కరోనా నివారణ చర్యల్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కూల్‌ డ్రింకులు ఇచ్చిన మహిళను ప్రత్యేకించి పొగిడారు. అలానే మా గోడు కూడా పట్టించుకొండి’’ అంటూ పోలీసులను అమరావతి ప్రాంత రైతులు వేడుకున్నారు. వార్తాపత్రికల్లో ఫొటోలు వచ్చాయంటూ పెదపరిమికి చెందిన 23 మందికి నోటీసులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే పేదలకు సరుకుల పంపిణీ పేరుతో మినీ సభలు నిర్వహిస్తున్నారని, వారిపై కేసులు పెట్టరా? అని ప్రశ్నించారు. 


మద్దతుగా దీక్షలు, నిరసనలు

రాజధాని రైతులకు మద్దతుగా పలువురు దీక్షలు చేపట్టారు. సత్తెనపల్లికి చెందిన మన్నవ శారదాదేవి, వెంకట్రామయ్యలు పలువురు రైతులతో కలిసి 10 గంటల నిరాహార దీక్ష చేశారు. అలాగే, మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ తన నివాసం నుంచి తెల్ల పావురాలు ఎగరేసి నిరసన తెలిపారు. గుంటూరులోని యువజన జేఏసీ నేత రావిపాటి సాయికృష్ణ నేతృత్వంలో జై అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరిట భారీగా దీపాలను వెలిగించి నిరసన తెలిపారు. రైతులు, మహిళలు ‘అమరావతి వెలుగు’ పేరిట రాత్రి 7.30 నుంచి 5 నిముషాలపాటు  కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. 

Updated Date - 2020-04-21T10:20:57+05:30 IST