సీఐడీ దర్యాప్తుపై నమ్మకం లేదు
ABN , First Publish Date - 2020-06-16T09:19:21+05:30 IST
చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రభుత్వాసుపత్రిలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించినందుకు, కిందిస్థాయి సిబ్బంది, రాష్ట్ర ..

మొత్తం వ్యవహారాన్ని సీబీఐకి ఇవ్వండి
డిప్యూటీ సీఎం అనుచరులు వేధిస్తున్నారు
పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు
హైకోర్టును ఆశ్రయించిన డాక్టర్ అనితారాణి
అమరావతి, జూన్ 15(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రభుత్వాసుపత్రిలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించినందుకు, కిందిస్థాయి సిబ్బంది, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అనుచరులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొంటూ డాక్టర్ పి.అనితారాణి హైకోర్టును ఆశ్రయించారు. వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించిందని, అయితే, సీఐడీ అధికారులు కనీసం తన వాంగ్మూలం తీసుకోకుండా తన ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రకటించినందున వారి దర్యాప్తుపై నమ్మకం లేదని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని అభ్యర్థించారు. ఈ మేరకు ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆస్పత్రిలో తాను లేనప్పుడు ప్రైవేటు/ఆర్‌ఎంపీ డాక్టర్లతో అబార్షన్లు చేయించడం, రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు పంపించడం, విధులకు డుమ్మాకొట్టి మూడు నాలుగు రోజులకొకమారు రిజిస్టర్‌లో సంతకాలు చేయడం వంటి పనులకు పాల్పడేవారని తెలిపారు.