కోర్టుకు హాజరుకండి
ABN , First Publish Date - 2020-12-30T08:45:20+05:30 IST
కోర్టు ధిక్కరణ పిటిషన్‌కు సంబంధించి హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్, డీజీపీ గౌతం సవాంగ్, ఐజీ మహేశ్‌చంద్ర లడ్డాలను కోర్టుకు రావాలంటూ హైకోర్టు ఆదేశించింది.

హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఐజీ, డీజీపీలకు ‘ధిక్కరణ’ నోటీసులు
అమరావతి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): కోర్టు ధిక్కరణ పిటిషన్‌కు సంబంధించి హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్, డీజీపీ గౌతం సవాంగ్, ఐజీ మహేశ్‌చంద్ర లడ్డాలను కోర్టుకు రావాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఎస్సైగా పనిచేస్తున్న యు.రామారావుకు సీఐగా ప్రమోషన్ కల్పించే ప్యానల్‌లో స్థానం కల్పించాలని హైకోర్టు కొన్నాళ్ల కిందటే ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఆదేశాలను అమలు చేయకపోవడంతో రామారావు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. హోం శాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, ఐజీలకు నోటీసులు జారీ చేసింది. మంగళవారం మరోసారి పిటిషన్ విచారణకు రాగా.. ఏలూరు రేంజ్ డీఐజీ మోహనరావు తరఫున న్యాయవాది విచారణకు హాజరయ్యారు.
అయితే.. ఈ కేసులో ఇప్పటికే నోటీసులు అందుకున్న హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, ఐజీలు న్యాయవాదులను నియమించుకోలేదు. స్వయంగా కూడా హాజరుకాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి, సదరు అధికారులు కోర్టుకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను జనవరి 25కి వాయిదా వేశారు.