ఆ భూమిని ఎవ్వరికీ కేటాయించకండి

ABN , First Publish Date - 2020-07-19T08:47:48+05:30 IST

‘నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు’ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ చట్ట నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని, అందువల్ల ప్రైవేటు

ఆ భూమిని ఎవ్వరికీ కేటాయించకండి

  • ప్రైవేట్‌ సంప్రదింపుల ద్వారా భూసేకరణ చట్ట విరుద్ధం
  • అధికార పార్టీ నేతలే భూముల ధర నిర్ణయిస్తున్నారు
  • ప్రతిగా భూ యజమానుల నుంచి డబ్బు గుంజుతున్నారు
  • హైకోర్టులో బీజేపీ నేత పిల్‌ దాఖలు


అమరావతి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ‘నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు’ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ చట్ట నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని, అందువల్ల ప్రైవేటు సంప్రదింపుల ద్వారా సేకరించిన భూమిని ఎవ్వరికీ కేటాయించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని, ప్రైవేటు సంప్రదింపుల పేరుతో సేకరించిన భూమిపై లబ్దిదారులకు ఎలాంటి హక్కులు కల్పించకుండా ప్రతివాదులను ఆదేశించాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్‌రాజు హైకోర్టులో ఈ పిల్‌ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించిందని, దానికి సంబంధించి గత ఏడాది ఆగస్టు 19వ తేదీన జీవో జారీ చేసిందని తెలిపారు. ఆ మేరకు ఇళ్లస్థలాలకు తప్పనిసరిగా భూసేకరణ, లేదా కొనుగోలు ద్వారా భూముల్ని సేకరించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయన్నారు. దాంతో కలెక్టర్లు చట్టవ్యతిరేకంగా వ్యవసాయ, ప్రైవేటు వ్యవసాయేతర, అసైన్డ్‌ భూముల్ని తీసుకోవడం మొదలు పెట్టారన్నారు. 2013లో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణచట్టానికి అనుగుణంగా రాష్ట్రప్రభుత్వం నడచుకోవాల్సి ఉన్నా ఇందుకు విరుద్ధంగా భూసేకరణ జరుగుతోందన్నారు.


‘‘అన్ని జిల్లాల కలెక్టర్లు చట్టవిరుద్ధంగా ప్రైవేట్‌, అసైన్డ్‌ భూముల్ని సేకరిస్తున్నారు. తహశీల్దారులు, రాజకీయ నేపథ్యమున్న తమ సిబ్బంది స్థానిక నేతల ద్వారా భూముల యజమానులను సంప్రదిస్తున్నారు. భూసేకరణలో అధికార పార్టీ స్థానిక నేతలు మధ్యవర్తుల్లా వ్యవహరిస్తూ వారే భూములకు ధర నిర్ణయిస్తున్నారు. సదరు భూములకు నిర్ణయించిన ధరకంటే అధికంగా తమ వల్లనే వచ్చిందని, అందువల్ల తమకూ కొంత ఇవ్వాలని స్థానిక నేతలు భూయజమానులకు అడుగుతున్నారు. మరికొన్ని చోట్ల అధికారులు వివాదాస్పద భూములను తీసుకుంటున్నారు. ఇంకొన్ని చోట్ల నకిలీ యజమానులను ప్రోత్సహిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పారదర్శకత కరువైన కారణంగా బాధితులు తమ విలువైన భూమి, డబ్బు నష్టపోతున్నారు’’ అని ఆ పిల్‌లో బీజేపీ నేత పేర్కొన్నారు. ప్రతివాదులుగా రాష్ట్ర రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ముఖ్య కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, భూపరిపాలనా విభాగ చీఫ్‌ కమిషనర్‌, 13 జిల్లాల కలెక్టర్లను పేర్కొన్నారు.

Updated Date - 2020-07-19T08:47:48+05:30 IST