ఏ జిల్లా.. మీదే జిల్లా..?
ABN , First Publish Date - 2020-07-19T08:20:05+05:30 IST
‘లోక్‌సభ నియోజకవర్గాల వారీగానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తేల్చేశారు. ‘చిన్న చిన్న సమస్యలున్నా సర్దుకుపోవాలి’ అని కూడా సూచించారు. ‘ప్రతి లోక్‌సభ

- 1979లో విజయనగరమే ఆఖరు
- మళ్లీ జిల్లాలపై ‘కమిటీ కసరత్తు’.. లోక్‌సభ స్థానమే ప్రాతిపదిక
- ముఖ్యమంత్రి జగన్ విస్పష్ట ప్రకటన
- క్షేత్రస్థాయిలో అనేక చిత్ర విచిత్రాలు
- రేపటి నుంచి ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు
‘లోక్‌సభ నియోజకవర్గాల వారీగానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తేల్చేశారు. ‘చిన్న చిన్న సమస్యలున్నా సర్దుకుపోవాలి’ అని కూడా సూచించారు. ‘ప్రతి లోక్‌సభ నియోజకవర్గం ఒక జిల్లా’ అని సింపుల్‌గా తేల్చేసినా... క్షేత్రస్థాయిలోకి వెళితే ఎన్నెన్నో తతంగాలు! ఈ భౌగోళిక విభజనతో ముడిపడిన రాజకీయ, భావోద్వేగ అంశాలు! మరెన్నో చిత్ర విచిత్రమైన విశేషాలు! ‘ఉభయ’ గోదావరి జిల్లాలు ఎన్నవుతాయో, ఏమవుతాయో! ‘కృష్ణా’ జిల్లాలో ఉన్న వారు ‘గోదావరి’లో కలిసిపోతారు. ‘తిరుపతి’ పక్కనే ఉన్న చంద్రగిరివాసులు చిత్తూరు జిల్లా వాళ్లవుతారు! అబ్బో... ‘అరకు జిల్లా’ కథ మరింత పెద్దది! ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఉన్న కొన్ని నియోజక వర్గాల ప్రజలు ‘సీమ’ వాసులవుతారు! ఇలా ఎన్నో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటాయి. పరిపాలనాపరంగా, రాజకీయంగా భారీ మార్పు చేర్పులు జరుగుతాయి. కొత్త జిల్లాలు ‘ఫలానా’ విధంగా ఉండాలని కొందరు... ఇలా వద్దని మరికొందరు! రకరకాల డిమాండ్లు! కరోనా కాలంలోనూ ప్రజల్లో దీనిపై ఇప్పటికే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
1979 తర్వాత..
లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే... ఇప్పుడున్న 13 జిల్లాలు పాతిక అవుతాయి. రెవెన్యూ శాఖ ఇప్పటికే దీనిపై కసరత్తు చేసి... మొత్తం 28 జిల్లాలు ఉండాలని ప్రతిపాదించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను సమర్పించాల్సి ఉంది. సీమాంధ్రలో చివరిసారిగా ఏర్పడిన జిల్లా... విజయనగరం. శ్రీకాకుళం నుంచి కొంత, విశాఖపట్నం నుంచి కొన్ని ప్రాంతాలను కలిపి 1979లో విజయనగరం జిల్లాను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కొత్త జిల్లాలేవీ ఏర్పాటు కాలేదు. మళ్లీ ఇప్పుడు కొత్త జిల్లాల సందడి మొదలైంది. 2021 - జన గణన ముగిసేదాకా... దేశంలో ఎక్కడా జిల్లాల సరిహద్దులు మార్చకూడదు. అయితే... జిల్లాల ఏర్పాటుకు కసరత్తు మాత్రం చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు శ్రీకారం చుట్టింది! ముఖ్యమంత్రి చెప్పినట్లు ‘లోక్‌సభ నియోజకవర్గాలే’ ప్రాతిపదికగా జిల్లాల విభజన జరిగితే... అవి ఎలా ఉంటాయి, ఎలాంటి మార్పు చేర్పులు జరుగుతాయి, దీనిపై ప్రజలు, నేతలు ఏమనుకుంటున్నారు?
- క్షేత్రస్థాయి పరిశీలనతో ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు... రేపటి నుంచి!