మాజీ మంత్రి జవహర్‌పై జిల్లా ఎస్పీ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-10-07T23:50:23+05:30 IST

కొవ్వూరు పోలీసులపై మాజీ మంత్రి జవహర్ చేసిన వ్యాఖ్యలను పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్ తిప్పికొట్టారు. కొవ్వూరు డీఎస్పీ

మాజీ మంత్రి జవహర్‌పై జిల్లా ఎస్పీ కీలక వ్యాఖ్యలు

ఏలూరు: కొవ్వూరు పోలీసులపై మాజీ మంత్రి జవహర్ చేసిన వ్యాఖ్యలను పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్ తిప్పికొట్టారు. కొవ్వూరు డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ మాజీ మంత్రి జవహర్‌పై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మీరు ఖద్దర్ వేసుకున్నారా? ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు అని వ్యాఖ్యానించడం తమకు బాధ కలిగించింది. మాజీ మంత్రి జవహర్.. ఆయన ఇంటికి వెళ్లడం అనేది మేం తప్పుపట్టడం లేదు. దానికి అడ్డంకులు కలిగించలేదు. ఆ రోజు ఎస్ఐ కానీ, సీఐ గానీ చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. కోవిడ్ సమయంలో మాజీ మంత్రి 200 మందితో ర్యాలీగా వెళ్లడాన్ని మాత్రమే తప్పు పడుతున్నాం. ఏదైనా విషయంలో కానీ, సందర్భంలో కానీ నిర్వహించే ర్యాలీకి పర్మిషన్ తీసుకోవాలి. అలా కాని పక్షంలో సామాన్య ప్రజలు ఆ ర్యాలీ వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ముందస్తు పోలీస్ పర్మిషన్ తీసుకోవడం వల్ల తగు జాగ్రత్తలు చేపట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ర్యాలీ నిర్వహించే మార్గంలో చర్యలు తీసుకుంటాం. పర్మిషన్ లేకుండా ర్యాలీ చేయడం తప్పని తెలిసికూడా.. ఇది భారత దేశమా లేక ఏదైనా దేశమా అని మాజీ మంత్రి మాట్లాడటం సరికాదు’ అని హితవు పలికారు.


‘పోలీసులు చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తూ ఉంటే రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదు. ఇటువంటి ఆరోపణలు చేసి  పోలీసువారి మనోభావాలు దెబ్బ తినే విధంగా ప్రవర్తించడం మంచిదికాదు. ర్యాలీ ఎవరు చేసినా, సభలు ఎవరు నిర్వహించినా పోలీస్ పర్మిషన్ తప్పనిసరి. ఆఖరికి మైకులకు కూడా పర్మిషన్ అవసరం. ఎవరైనా చట్టాని గౌరవించాల్సిందే. చట్టం అనేది అందరికీ సమానమే. ఎవరైనా పర్మిషన్ లేకుండా చట్టాన్ని అతిక్రమించి ర్యాలీలు, సభలు నిర్వహిస్తే చట్టం తన పని తాను చేసుకు పోతుంది. ఎస్ఐ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు, డీజీపీ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అని మాట్లాడటం సరికాదు. ఇంకోసారి ఎప్పుడూ కూడా ఈ విధంగా మాట్లాడకండి. మీరు సరైన భాషను ఉపయోగించండి. మీ రాజకీయాలకు మేం అడ్డుకాదు. మీ రాజకీయాలు మీరు చేసుకోండి. మీ రాజకీయాల కోసం పోలీసు వారిని లాగొద్దు’ అని మాజీ మంత్రికి ఎస్పీ సూచించారు.

Updated Date - 2020-10-07T23:50:23+05:30 IST