కార్స్‌పై తొలగిన భ్రమలు!

ABN , First Publish Date - 2020-12-28T09:41:47+05:30 IST

భూముల సమగ్ర సర్వే ప్రారంభించిన తర్వాతే రాష్ట్రప్రభుత్వానికి అసలు నిజాలు ఒక్కటొక్కటిగా కనిపిస్తున్నాయా..?

కార్స్‌పై తొలగిన భ్రమలు!

మళ్లీ డీజీపీఎస్‌ పరికరాల వినియోగం..

కొలతల్లో తేడా రానివ్వబోమని సీఎం జగన్‌ విస్పష్ట ప్రకటన

ఆ తర్వాతే సర్వే విధానంలో మార్పు

సాంప్రదాయక పద్ధతుల్లోనూ రీసర్వే

డీజీపీఎ్‌సపై సర్వేయర్లకు శిక్షణ

రెండు నెలల్లో ట్రైనింగ్‌ పూర్తి


లోపాలపుట్టగా తేలిన కార్స్‌ టెక్నాలజీకి రాష్ట్రప్రభుత్వం దాదాపు సెలవిచ్చినట్లే కనిపిస్తోంది. రీసర్వే సందర్భంగా భూమి కొలతల్లో అంగుళం కూడా తేడా రాదని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటన దరిమిలా.. పాతపద్ధతుల్లోనూ సర్వే నిర్వహించాలని సర్వే శాఖ నిర్ణయించినట్లు సమాచారం.


(అమరావతి-ఆంధ్రజ్యోతి): భూముల సమగ్ర సర్వే ప్రారంభించిన తర్వాతే రాష్ట్రప్రభుత్వానికి అసలు నిజాలు ఒక్కటొక్కటిగా కనిపిస్తున్నాయా..? ఇంతకాలం కార్స్‌ నెట్‌వర్క్‌ పేరిట అధికార యంత్రాంగం చేసిన హడావుడిపై భ్రమలు తొలగిపోయాయా..? కార్స్‌ ఒక్కదాన్నే నమ్ముకుంటే రీసర్వేను విజయవంతంగా పూర్తిచేయలేమన్న నిర్ణయానికి వచ్చారా?.. తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. కార్స్‌ ఉంటుందని చెబుతూనే ఇతర  ప్రత్యామ్నాయాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై సర్కారు దృష్టిపెట్టింది. కార్స్‌లోని ఫార్స్‌ అంశాలను కళ్లకు కట్టినట్లు సర్వే ఆఫ్‌ ఇండియా (ఎస్‌వోఐ)లేఖ రూపంలో స్పష్టంగా తెలియజేశాక.. భూము ల సర్వేలో ఇప్పటికే అమల్లో ఉన్న సాంప్రదాయిక విధానాలపై దృష్టిపెట్టింది. సర్వే కోసం డీజీపీఎస్‌ (డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం) పద్ధతిని వాడుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ సర్వేయర్లకు శిక్షణ ఇప్పించబోతోంది. శిక్షణ కోసం ఏజెన్సీని ఎంపిక చేసేందుకు టెండర్లు పిలిచింది. ఈ మేరకు రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎ్‌ఫపీ-టెండర్‌ డాక్యుమెంట్‌)ను విడుదల చేసింది. భూముల సమగ్ర సర్వే ప్రారంభమయ్యాకే ఈ శిక్షణ కార్యక్రమాన్ని తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. ఏడు వేల మంది గ్రామ సర్వేయర్లకు రెండు నెలల కాల వ్యవధిలో  శిక్షణ ఇవ్వాలని ఆర్‌ఎ్‌ఫపీలో పేర్కొన్నారు. టెండర్‌ దక్కించుకునే సంస్ధే ఒక్కొక్కరికీ ఏడు రోజుల పాటు శిక్షణ ఇస్తుంది.  


సర్వే ఆఫ్‌ ఇండియా హెచ్చరికతో..

కంటిన్యుయస్‌ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ స్టేషన్‌(కార్స్‌) టెక్నాలజీతో భూములు సర్వే చేస్తామని తొలుత ప్రభుత్వం ప్రకటించింది. 70కార్స్‌ బేస్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే కార్స్‌ బేస్‌ స్టేషన్‌ పనితీరు, సాప్ట్‌వేర్‌లలో లోపాలున్నాయని సర్వే ఆఫ్‌ ఇండియా అక్టోబరులోనే సర్కారుకు లేఖ రాసింది. కార్స్‌తో సర్వే చేస్తే కొలతల్లో మూడు మీటర్ల తేడాలు వస్తున్నాయని, ఇదేం చిన్న విషయం కాదని హెచ్చరించింది. దీంతో ఇప్పటికప్పుడు తప్పులను సరిదిద్దడం సాధ్యమయ్యే పని కాకపోవడంతో సర్వే ఆఫ్‌ ఇండి యాతోనే డ్రోన్‌ సర్వే చేయించాలని నిర్ణయించింది.


ఆ మేరకు అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. కార్స్‌ను నమ్ముకునే తొలుత 9 వేల జీఎన్‌ఎ్‌సఎస్‌ రోవర్లు కొనుగోలు చేయాలని భావించారు. అయితే ఆ టెక్నాలజీపై తీవ్ర విమర్శలు వస్తుండడంతో రోవర్ల సంఖ్యను 500కి కుదించారు. దీనికి 25 శాతం అటూ ఇటూగా ఇప్పుడు కొనుగోలు ఉంటుందని ఆర్‌ఎఫ్‌పీలో పేర్కొన్నారు. కంపెనీలు బిడ్లు  దాఖలు చేశాయి. ఈ నెలాఖరు నాటికే 150 రోవర్లు సర్వే శాఖకు సరఫరా చేయాల్సి ఉంది. కానీ ఇప్పటిదాకా టెండరే ఖరారు కాలేదు. ఇప్పుడు మళ్లీ కొత్తగా డీజీపీఎస్‌ మెషీన్‌ ట్రైనింగ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. భూముల సమగ్ర సర్వే ప్రారంభం సందర్భంగా సీఎం జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలే ఈ పరిణామాలకు కారణమని తెలుస్తోంది. భూమి కొలతల్లో తప్పులు లేకుండా ఇప్పటికే అమల్లో ఉన్న సాంప్రదాయిక సర్వే విధానాలు కూడా పాటించాలని స్పష్టమైన ఆదేశాలు వెలువడినట్లు తెలిసింది. 


డీజీపీఎ్‌సలే ఎందుకు..? 

ఇప్పుడున్న టెక్నాలజీల్లో కార్స్‌ ఆధునికమైనది. అయితే ఇది ఒకేచోట బేస్‌ స్టేషన్‌ రూపంలో ఉంటుంది. ఎక్కువ శాటిలైట్లతో అనుసంధానమై.. ప్రతి సెకనుకు డేటాను తీసుకుని సేవ్‌చేసి పెడుతుంది. అయితే మన రాష్ట్రం సమకూర్చుకున్న టెక్నాలజీలో సమస్యలున్నాయని ఎస్‌వోఐ వెలుగులోకి తెచ్చింది.  ఈ నేపఽథ్యంలో డీజీపీఎస్‌ మెషీన్లను తెరపైకి తీసుకొచ్చారు.  డీజీపీఎస్‌ కూడా శాటిలైట్లతో అనుసంధానమవుతుంది. ఇప్పటికే ఈ టెక్నాలజీ వాడుతున్నారు కాబట్టి దీనిని నేర్చుకోవడం, వినియోగించుకోవడం సులభం. పైగా ఈ మెషీన్లను ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లవచ్చు. కార్స్‌కు ఆ అవకాశం లేదు. సర్వే శాఖలో పనిచేస్తున్న సర్వేయర్లు, ఔట్‌సోర్సింగ్‌లో ఉన్నవారికి డీజీపీఎస్‌ సుపరిచితం. దీనిపై వారు సమగ్ర శిక్షణ తీసుకున్నారు కూడా. ఇటీవల నియమితులైన గ్రామ సర్వేయర్లకు ఈ టెక్నాలజీపై శిక్షణ ఇవ్వాల్సి ఉంది.


ఎలాగూ కార్స్‌ వచ్చింది కాబట్టి దానిపై, ఆ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే జీఎన్‌ఎస్‌ రోవర్లపై శిక్షణ ఇద్దామని అధికారులు భావించారు. అయితే కార్స్‌ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో.. సర్వే పనులు ప్రారంభించేందుకు డీజీపీఎ్‌సపైనే శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. డీజీపీఎస్‌ టెక్నాలజీతో భూములు సర్వే చేసినప్పుడు కొలతల్లో పెద్దగా తేడాలు లేవని.. చిన్న చిన్న తేడాలు వచ్చినా సర్దుబాటు చేయవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2020-12-28T09:41:47+05:30 IST