చట్టాలకన్నా చైతన్యమే ముఖ్యం

ABN , First Publish Date - 2020-03-08T10:10:58+05:30 IST

మహిళా దినోత్సవం అంటే కేవలం ఆడవాళ్లు, బాలికలకు సంబంధించినదే కాదని, పురుషులు సైతం మహిళలకు హాని చేయరాదన్న ఆలోచనకు వందశాతం రావాలని ’దిశ’ ప్రత్యేక అధికారి దీపికా ఎం. పాటిల్‌ అభిప్రాయపడ్డారు

చట్టాలకన్నా చైతన్యమే ముఖ్యం

స్త్రీలను వేధించకూడదనే భావన ప్రతి ఒక్కరిలోనూ పెంపొందాలి

పురుషులందరూ చెడ్డవారు కాదు వారిలో కొందరివల్లే ఈ సమస్యలు

ఉమెన్‌ డే స్ఫూర్తి మగవారిలోనూ..

మహిళలకు భరోసా కోసమే ‘దిశ’

‘దిశ’ ప్రత్యేక అధికారి దీపికా ఎం పాటిల్‌


అమరావతి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): మహిళా దినోత్సవం అంటే కేవలం ఆడవాళ్లు, బాలికలకు సంబంధించినదే కాదని, పురుషులు సైతం మహిళలకు హాని చేయరాదన్న ఆలోచనకు వందశాతం రావాలని ’దిశ’ ప్రత్యేక అధికారి దీపికా ఎం. పాటిల్‌ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేస్తున్నా, వాటిని పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నా, న్యాయస్థానాల్లో బాధ్యులకు శిక్షలు పడుతున్నా మహిళలపై లైంగిక దాడులు జరుగుతుండటం బాధాకరం అంటున్న యువ ఐపీఎస్‌ అధికారి ‘ఆంధ్రజ్యోతి’తో ముచ్చటించారు. 


నేరానికి ముందే చేరిపోయి..

‘‘మనం ఎంత నాగరికత వైపు అడుగులు వేస్తున్నా ఇప్పటికీ మహిళలు, బాలికలు, యువతులపై లైంగిక దాడులు మొదలుకొని ప్రాణాలు తీసేవరకూ అన్ని రకాల నేరాలు జరుగుతున్నాయి. దేశంలో ఐపీసీ సెక్షన్లతో పాటు నిర్భయ, పోక్సో లాంటివి ఉన్నా వీటికి అడ్డుకట్ట పడటం లేదు. రాష్ట్రంలో ఈ చర్యలను మరింత కఠినతరం చేస్తూ ప్రభుత్వం ’దిశ’ చట్టం చేసింది. రాష్ట్రపతి నుంచి దానికి ఆమోదం లభించాల్సి ఉంది. ‘దిశ’ చట్టం తెచ్చిన నేపథ్యంలో ప్రతి మహిళకు భరోసా ఇచ్చేలా డిసెంబరు 15నుంచే చర్యలు చేపట్టాం. ఫిర్యాదు అందిన రెండు, మూడు నిముషాల్లోనే ఘటనా స్థలానికి చేరుతున్నాం. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, పని చేసే చోటు, రద్దీ ప్రాంతాలు ఎక్కడ సమస్య వచ్చినా పోలీసులు నిమిషాల్లో చేరుతున్నారు’’


ఇప్పటికే చట్టాలు ఉన్నా...

‘‘ఇప్పటికే నిర్భయ, పోక్సో లాంటి చట్టాలున్నా వాటికన్నా ‘దిశ’ పదును ఎక్కువ. చట్ట పరిధి దాటకుండా సత్వర న్యాయం కోసం వచ్చిందే ఈ చట్టం. ప్రతి జిల్లాలోనూ పోలీస్‌ స్టేషన్‌, ప్రత్యేక కోర్టు, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల బలోపేతం, దర్యాప్తు వేగవంతం, నాణ్యత లోపించకుండా సమర్థమంతమైన అధికారులకు 30శాతం అధిక వేతనం చెల్లించి ప్రభుత్వం నియమించింది. రెగ్యులర్‌ డీఎస్పీతోపాటు సూపర్‌ న్యూమరీ ఉంటారు. ఎస్‌ఐలు, కింది స్థాయి సిబ్బంది కూడా ఉంటారు’’


గ్రామాలపైనా ‘దిశ’ దృష్టి

‘‘గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలతోపాటు పట్టణాల్లోని నిరుపేదలకు ఇప్పటికీ స్మార్ట్‌ ఫోన్‌లేదు. వాళ్లల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఓ వైపు ప్రచారం చేస్తూ మరోవైపు ప్రతి గ్రామానికి ఒక మహిళా రక్షణ కార్యదర్శిని నియమించాం’’


ధైర్యం చేయండి..

‘‘మహిళలు భయపడకుండా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలి. వారికోసం ఫ్రెండ్లీ పోలీస్‌స్టేషన్లున్నాయి. అక్కడికి రాలేకపోతే ‘దిశ’ యాప్‌ ఉంది. డయల్‌ 100,112, మహిళామిత్ర, వార్డు మహిళా రక్షణ కార్యదర్శి, వాట్సాఫ్‌ నం. 9121211100 అందుబాటులో ఉన్నాయి.’’


పురుషుల్లో మార్పు రావాలి...

‘‘సమాజం కోసం పురుషుల్లో బాధ్యత పెరగాలి. అతికొద్దిమంది చెడు మనస్తత్వం ఉన్న వారిని మార్చేందుకు ప్రయత్నం చేయాలి. లేక పోలీసులకు వారి తీరుపట్ల సమాచారం ఇవ్వాలి’’ 


యాప్‌ ఉంటే సేఫ్‌

‘‘దాదాపు అందరూ స్మార్ట్‌ ఫోన్‌ వాడుతున్నారు. దిశ యాప్‌ను రోజుల్లోనే లక్షలమంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.. వేలల్లో టెస్ట్‌ కాల్స్‌ వచ్చాయి. వందల్లో ఫిర్యాదులు వచ్చాయి. పదుల సంఖ్యలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం.. 51కేసుల్లో చార్జిషీట్లు కూడా దాఖలు చేశాం. టెక్నాలజీతో పాటు అన్ని విభాగాలు సమన్వయం చేసుకోవడం ద్వారానే ఇదంతా సాధ్యమయింది’’ 


‘దిశ’ సత్తా..

తూర్పు గోదావరి జిల్లాలో భర్త హింసను తట్టుకోలేక ఒక మహిళ విషం తాగి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆమెను బతికించి భర్తను జైల్లో పెట్టాం. 

బస్సులో వెళుతున్న యువతిని సాటి ప్రయాణికుడు అర్ధరాత్రి ఇబ్బంది పెడితే బస్సును వెంబడించి బాధ్యుడిని దించి అదుపులోకి తీసుకున్నాం. 

కర్ణాటకలో యువతిని రైల్లో వేధించిన వ్యక్తిని అనంతపురం జిల్లాలోకి రాగానే పట్టేశాం.

Updated Date - 2020-03-08T10:10:58+05:30 IST