కష్టం పుట్టెడు.. సాయం పిడికెడు

ABN , First Publish Date - 2020-12-30T07:42:08+05:30 IST

ఏ నెల పంట నష్టానికి అదే నెలలో పరిహారం చెల్లిస్తామన్న సీఎం జగన్‌ నివర్‌ తుఫాన్‌ నష్టానికి ఇన్‌పుట్‌ సబ్సిడీ సొమ్మును మంగళవారం క్యాంప్‌ కార్యాలయంలో మీట నొక్కి నేరుగా రైతుల ఖాతాలకు జమ చేశారు.

కష్టం పుట్టెడు.. సాయం పిడికెడు

 • రైతుకు ‘నివర్‌’ నష్టం ఎకరానికి 30 వేలు
 • వారికి దక్కిన ‘ఉపశమనం’ రూ.5 వేలు
 • తుఫాన్‌ ముంచేసింది 17 లక్షల ఎకరాలు
 • ‘33 శాతం’ రూల్‌తో 5 లక్షలకు కుదింపు
 • ఎకరా వరికి విపత్తు శాఖ లెక్క 15 వేలు
 • సర్కారు విదిలించింది రూ.4 వేలే
 • ఎకరాకు 15 బస్తాల వరి, 6 క్వింటాళ్ల పత్తి,
 • 80ు వేరుశనగ కోల్పోయిన రైతులు
 • ఆనాడు ఎకరానికి 30 వేలు డిమాండ్‌
 • విపక్షంగా చెప్పిన మాటలు ఎక్కడని
 • సర్కారును ప్రశ్నిస్తున్న రైతు సంఘాలు

ఏ నెల నష్టం ఆ నెలే చెల్లిస్తామన్న ప్రభుత్వం చెప్పినట్టే సాయం  రైతుల ఖాతాల్లో వేసింది. కానీ, ఆ సాయం తీరు రైతులకు మరింత కష్టాన్నే మిగిల్చింది. నివర్‌ తుఫానుతో ఎకరాకు 30 వేలు నష్టపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతన్నకు సర్కారు 5 వేలు ఇచ్చి.. ప్రచార పండగ చేసుకొంది. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి) : ఏ నెల పంట నష్టానికి అదే నెలలో పరిహారం చెల్లిస్తామన్న సీఎం జగన్‌ నివర్‌ తుఫాన్‌ నష్టానికి ఇన్‌పుట్‌ సబ్సిడీ సొమ్మును మంగళవారం క్యాంప్‌ కార్యాలయంలో మీట నొక్కి నేరుగా రైతుల ఖాతాలకు జమ చేశారు. తుఫాన్‌ సాయంగా 8.34లక్షల మంది రైతులకు రూ.645.99కోట్లు ఇచ్చారు. ఈ లెక్కన సగటున ఒక్కో రైతుకు రూ.7,745, ఎకరానికి రూ.5,378 అందించారు. అయితే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ.30వేలు ఇన్‌పుట్‌ సబ్సిడీ డిమాండ్‌ చేసి, ఇప్పుడు అందులో సగం కంటే తక్కువ ఇవ్వడాన్ని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పైగా రాష్ట్ర విపత్తు పరిహార నిధి(ఎస్డీఆర్‌ఎఫ్‌) నిబంధనల ప్రకారం 33ు కంటే ఎక్కువ పంట నష్టపోయిన రైతులకు మాత్రమే ఇన్‌పుట్‌ సబ్సిడీని ఇచ్చారు. ఇదే సమయంలో ఈ నిబంధనల ప్రకారం పంటలకు ఇవ్వాల్సిన గరిష్ఠ ఇన్‌పుట్‌ సబ్సిడీలోనూ కోతలు పెట్టింది. ఉదాహరణకు దెబ్బతిన్న వరి పంటకు  ఎస్డీఆర్‌ఎఫ్‌ ప్రకారం ఇవ్వాల్సింది ఎకరానికి రూ. 15 వేలు. ఇప్పుడు ఇచ్చింది రూ. నాలుగు వేలు మాత్రమే. ఇలా జరిగిన నష్టం పుట్టెడయితే, సాయం పిడికిడంతే చేసి, ప్రచార మోత మోగించుకొంటున్నారని రైతు సంఘాలు పెదవి విరుస్తున్నాయి. 


గత నెలలో ఏపీ-తమిళనాడు సరిహద్దులో తీరం దాటిన నివర్‌ తుఫాన్‌ మన రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో విరుచుపడింది. దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమలోని అన్ని జిల్లాల్లో పంటనష్టం తీవ్రంగా జరిగింది. కోత దశలో ఉన్న వరిని తుఫాన్‌ బాగా దెబ్బతీసింది. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఎకరానికి 12బస్తాలు కూడా దిగుబడి రాలేదు. పైగా గింజతడిసి, మొలకొచ్చి, రంగు మారిపోయి, రైతుకు మద్దతు ధర దక్కడంలేదు. ఎకరానికి 15బస్తాల దిగుబడిని అన్నదాతలు నష్టపోయారు. పైగా కోత కూలీ ఖర్చులు కూడా పెరిగాయి. అలాగే పత్తి తీసే దశలో తుఫాన్‌ వర్షాలకు పూత, కాయ పాడయ్యాయి. పత్తి ఎకరానికి ఐదారు క్వింటాళ్ల దాకా నష్టపోయారు. రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ పంట ఎకరానికి 80-90ు మేర దెబ్బతిన్నది. ఉద్యాన పంటలకూ నష్టం వాటిల్లింది. వరి ధాన్యం 15 బస్తాల దాకా ఉత్పత్తితగ్గి, 70కిలోల బస్తా రూ.1500చొప్పున ఎకరానికి రూ.25వేలు, ఇతర కూలీ ఖర్చులు రూ.10వేలదాకా నష్టం వాటిల్లింది. పత్తి ఎకరానికి 6క్వింటాళ్ల నష్టానికి రూ.35వేలు దాకా రైతులు కోల్పోయారు. వేరుశనగ వేసిన రైతులకు ఎకరానికి రూ.50వేలదాకా నష్టమే. ఇలా ఏ పంటకైనా ఎకరానికి కనీసం రూ.30 వేలుపైగా నష్టం వాటిల్లితే, రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీగా ఎకరానికి రూ. ఐదారు వేల మించి ఇవ్వకపోవడాన్ని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.


కావాల్సిందెంతో.. ఇచ్చింది కొంతే..

‘ఉపశమన సాయం’(స్కేల్‌ ఆఫ్‌ రిలీఫ్‌) కింద ఎస్‌డీఆర్‌ఎఫ్‌ మార్గదర్శకాల ప్రకారం హెక్టారుకు వరి, పత్తి, చెరుకు, వేరుశనగకు  రూ.15వేలు, మొక్కజొన్నకు రూ.12,500, అపరాలు, సన్‌ఫ్లవర్‌, సోయాబిన్‌, గోధుమ, పొగాకుకు రూ.10వేలు, జొన్న, సజ్జ, రాగి, ఆముదం, నువ్వులకు రూ.6,800, కొర్ర, సామ,వరిగ, ఆవాలు, కుసుమ, జనుముకు రూ.5వేలు ఇవ్వాల్సి ఉంది. అలాగే, వర్షాధార పంటలకు రూ.6,800, నీటి పారుదల ఉన్న పంటలకు రూ.13,500 ఇవ్వాల్సి ఉంది. కానీ ఎస్డీఆర్‌ఎఫ్‌ మార్గదర్శకాల ప్రకారం నష్టాన్ని అంచనా వేసి, ఇన్‌పుట్‌ సబ్సిడీని ఇస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. వాస్తవంగా వరి పంట దెబ్బతిన్న అన్నదాతలకు ఇచ్చింది హెక్టారుకు రూ.4వేలు మాత్రమే. పత్తి, వేరుశనగ, వంటి పంటలకు గరిష్ఠంగా హెక్టారుకు రూ.6వేలు , చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, ఉద్యాన రైతులకు హెక్టారుకు రూ.2-3వేలు మించి ఇవ్వలేదని రైతులు పెదవి విరుస్తున్నారు. కాగా, గత ప్రభుత్వంలో వరికి ఇన్‌పుట్‌ సబ్సిడీ హెక్టారుకు రూ.16వేల నుంచి రూ.20వేలకు పెంచితే, ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ రూ.15వేలుకే పరిమితం చేశారు. అయినా నిర్ణయించిన మొత్తాన్నీ ఇవ్వకుండా అందులో పావు వంతు మాత్రమే ఇచ్చింది. ఈ మాత్రం దానికే ప్రకటనల ఖర్చు మాత్రం ప్రభుత్వ ఖజానా నుంచి ఎక్కువగానే ఖర్చు చేసిందని రైతు నేతలే విమర్శిస్తున్నారు. 


రాయితీలో మతలబులెన్నో..

ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపుల్లో అనేక మతలబులు కన్పిస్తున్నాయి. జూలై నుంచి సెప్టెంబరు వరకు భారీ వర్షాలు, వరదలకు పంట నష్టపోయిన 1.66లక్షల మంది రైతులకు రూ.136కోట్లు ఇచ్చారు. అక్టోబరులో వాయుగుండంతో పంట దెబ్బతిన్న రైతుల సంఖ్య ఎక్కువ. వారికి సాయం మాత్రం తగ్గించారు. ఆ సమయంలో దెబ్బతిన్న 1.98లక్షల మంది రైతులకు ఇచ్చింది రూ.132కోట్లు మాత్రమే. నవంబరులో నివర్‌ తుఫాన్‌కు దెబ్బతిన్న 12.01లక్షల ఎకరాల పంటలకు సంబంధించి, 8.34లక్షల మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.645.99కోట్లు విడుదల చేసింది. తుఫాన్‌ పంట నష్టం ప్రాథమికంగా 17 లక్షలఎకరాలల్లో ఉండగా, ఈ-క్రాప్‌ బుకింగ్‌ లింక్‌పెట్టి, ఎస్టీఆర్‌ఎఫ్‌ నిబంధల ప్రకారం 33ు కంటే అధికంగా పంట దెబ్బతింటేనే ఇన్‌పుట్‌ సబ్సిడీకి అర్హులుగా నిర్ణయించారు. దీనిపై దాదాపు 20రోజుల కసరత్తు చేసి, ఐదు లక్షల ఎకరాల్లో పంటనష్టాన్ని కుదించేశారు.

Updated Date - 2020-12-30T07:42:08+05:30 IST