-
-
Home » Andhra Pradesh » Difficulties for large campuses
-
పెద్ద బడులకు కష్టాలు!
ABN , First Publish Date - 2020-12-10T09:39:33+05:30 IST
రాష్ట్రంలో ఇప్పటికే బలహీనంగా ఉన్న ప్రాథమిక విద్య పునాదులు.. ప్రభుత్వం తాజాగా అమల్లో పెట్టిన రేషనలైజేషన్ కొత్త నిబంధనలతో కదలిపోతున్నాయి. ‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయింది’ అన్న నానుడిని ఈ ప్రక్రియ నిజం చేస్తోంది.

విద్యార్థులు ఎక్కువ ఉన్నా.. టీచర్లు తక్కువ.. ప్రాథమిక విద్యకు ‘రేషనలైజేషన్’ గ్రహణం
60 మంది విద్యార్థులకు ఇద్దరేసి టీచర్లు
20 మంది పిల్లలున్న స్కూళ్లలోనూ ఇద్దరే
ప్రభుత్వ నిర్ణయంలో కొరవడిన శాస్త్రీయత
మోడల్ ప్రైమరీ స్కూళ్లకు మంగళం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో ఇప్పటికే బలహీనంగా ఉన్న ప్రాథమిక విద్య పునాదులు.. ప్రభుత్వం తాజాగా అమల్లో పెట్టిన రేషనలైజేషన్ కొత్త నిబంధనలతో కదలిపోతున్నాయి. ‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయింది’ అన్న నానుడిని ఈ ప్రక్రియ నిజం చేస్తోంది. రాష్ట్రంలో ఏ ఒక్క పాఠశాలలోనూ సింగిల్ టీచర్ ఉండరని .. కనీసం ఇద్దరు టీచర్లు ఉంటారంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన వినడానికి బాగానే ఉంది. అందుకు అనుగుణంగా కొత్త పోస్టులు మంజూరు చేసి ఉంటే ఫలితం ఉంటుంది. కానీ ఇప్పటికే ఉన్న పోస్టులనే సర్దుబాటు చేయాలన్న నిబంధన పెట్టారు. దీంతో పిల్లలు ఎక్కువగా ఉన్న పెద్ద ప్రాథమిక పాఠశాలలకు కష్టాలు మొదలయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ స్కూళ్లలో 5 టీచర్ పోస్టులు ఉండగా ఇప్పుడు వాటిలో రెండింటిని తీసేశారు.
గతంలో 60 మంది విద్యార్థులకు 1:20 నిష్పత్తిలో ముగ్గురు ఉపాధ్యాయులు ఉండేవారు. ఇప్పుడు దానిని 1:30 నిష్పత్తిగా మార్చారు. దీనివల్ల పెద్ద ప్రైమరీ స్కూళ్ల విద్యార్థులకు అన్యాయం జరిగిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 60 మంది విద్యార్థుల వరకు 2 టీచర్ పోస్టులు, 60 కంటే దాటితే మూడో పోస్టులు ఇస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ.. మౌఖిక ఆదేశాల మేరకు 74 మంది విద్యార్థులు దాటితేనే మూడో పోస్టు మంజూరు చేసినట్లు సమాచారం.
కసరత్తు ఏదీ...?
రాష్ట్రంలో 30,532 ప్రైమరీ స్కూళ్లు ఉండగా, వీటిల్లో 7,774 సింగిల్ టీచర్ స్కూళ్లు, 18,024 స్కూళ్లు కేవలం ఇద్దరు టీచర్లతో నడిచేవి ఉన్నాయి. వాటిల్లో విద్యాబోధన మరింత మెరుగ్గా సాగేలా చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. ఆ దిశగా అడుగులు పడలేదు. సరైన కసరత్తు లేకుండా ప్రభుత్వం మారగానే రేషనలైజేషన్ నిబంధనలూ మార్చారు. కొత్త పోస్టులను మంజూరు చేయకుండా ఉన్నవాటినే సర్దుబాటు చేయాలన్న నిర్ణయంలో శాస్త్రీయత లోపించింది. ఆచరణలో వచ్చే ఇబ్బందులను గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైంది. విద్యార్థులు ఎక్కువ ఉన్న స్కూళ్లలో తక్కువ పోస్టులు ఉండేలా నిబంధన పెట్టారు. దీనివల్ల ఆయా పాఠశాలల విద్యార్థులకు తగినంత మంది టీచర్లు కరువయ్యారు.
దరిమిలా సరైన బోధన లభించని పరిస్థితి ఏర్పడింది. 10 మంది, 20 మంది పిల్లలు ఉన్న ప్రైమరీ పాఠశాలల్లో ఇద్దరు టీచర్లు ఉండే పరిస్థితి నెలకొంది.. ఆయా స్కూళ్లలో ఒక రెగ్యులర్ టీచర్, ఒక విద్యా వాలంటీర్‌ను నియమిస్తే ఇబ్బంది ఉండదు. కానీ రెండు పోస్టులూ రెగ్యులర్ పోస్టులు ఇవ్వడం వల్ల కొత్త సమస్యలు ఏర్పడుతున్నాయి. అంటే ఎక్కువ మంది ఉన్న చోట తక్కువ మంది టీచర్లు, తక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట అవసరానికి మించి (ఎక్కువ మంది) టీచర్లు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి అసంబద్ధాల కారణంగా.. ప్రాథమిక విద్యారంగం మరిన్ని ఇక్కట్లు ఎదుర్కొనటం ఖాయమని విద్యావేత్తలు చెబుతున్నారు.
3,884 స్కూళ్లకు రెండు వందలే!
గత ప్రభుత్వం మోడల్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థను తీసుకొచ్చి.. రాష్ట్రవ్యాప్తంగా 3,884 ప్రాథమిక పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా మార్చింది. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా సబ్జెక్టుల వారీగా, అన్ని తరగతులకు టీచర్లు ఉండేలా చర్యలు తీసుకుంది. కానీ వైసీపీ ప్రభుత్వం రాగానే మోడల్ స్కూళ్ల వ్యవస్థకు మంగళం పాడింది. ఆ ప్రభుత్వం పెడితే మేం కొనసాగించాలా.. అలా కుదరదని కేవలం 200 లోపు స్కూళ్లనే కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం.