బస్సుల బంద్‌తో బాదుడే!

ABN , First Publish Date - 2020-03-24T09:42:38+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా సర్కారీ బస్సులు ఆగిపోయాయి. ఒక్కరోజు అనుకున్నది తొమ్మిది రోజులకు పెరగడంతో బస్సులన్నీ

బస్సుల బంద్‌తో బాదుడే!

మామూలు కన్నా మూడురెట్లు 

అదనంగా ట్యాక్సీల వసూలు

అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సర్కారీ బస్సులు ఆగిపోయాయి. ఒక్కరోజు అనుకున్నది తొమ్మిది రోజులకు పెరగడంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. కరోనా తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ లాక్‌ డౌన్‌ నిర్ణయం మేరకు పీటీడీ అధికారులు ఈ నెల 31 వరకూ బస్సులు ఆపేశారు. ఇదే అవకాశం గా భావించిన ప్రైవేటు వాహనదారులు చెలరేగిపోతున్నారు. సాధారణ రోజుల్లో ఉండే చార్జీలకు రెట్టింపు వసూలు చేస్తూ ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారిని టాక్సీ లు, పొరుగు ఊళ్లకు జిల్లాలోనే ఇతర పట్టణాలకు వెళ్లే వారిని ఆటోలు పిండేశాయి. తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సిన ప్రయాణికులు ఈ బాదుడును భరించాల్సి వచ్చింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ, కర్నూలు వైపు వచ్చేవారి నుంచి మూడు రెట్లు అదనంగా వసూలు చేశారు. 


డీజీపీ సవాంగ్‌ సమీక్ష

రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిని గమనించిన డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఎప్పటికప్పుడు వీడియో ద్వారా వీక్షించారు. జిల్లాల ఎస్పీలు, విజయవాడ, విశాఖ కమిషనర్లతో ఆయన సమీక్షించారు. అనవసరంగా రోడ్డుపైకి వచ్చే వాహనాలను వెనక్కి పంపాలని, ప్రభుత్వ జీవో ప్రకారం అందులో ఉన్న నిబంధనలు అమలు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అత్యవసరాలైన పాలు, కూరగాయల్లాంటివి కొనుగోలు చేయడానికి ప్రజలకు కొంత సేపు సమయం ఇవ్వాలని, ఆ తర్వాత ఎవరినీ రోడ్లపైకి రానీవద్దని సూచించారు. అత్యవసరమైతే కారణాలు కనుక్కుని సహేతుకంగా ఉంటే అనుమతించాలన్నారు. వీలైనంతవరకూ సర్ది చెప్పాలని, వినకుండా విసిగించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. వైరస్‌ వ్యాప్తి చేసే వ్యక్తులపై తీసుకునే ఐపీసీ 269, 270 సెక్షన్లను వివరిస్తూ ఒకటి ఆర్నెళ్లు, మరొకటి రెండేళ్లు శిక్షపడే అవకాశం ఉందని క్షేత్రస్థా యి పోలీసులకు వివరించిన డీజీపీ సవాం గ్‌.. సెక్షన్లు ఏమి చెబుతున్నాయో వాట్సాప్‌ ద్వారా పోలీసులకు, విలేకరులకు పంపారు.


మధ్యాహ్నం తర్వాతే అదుపులోకి.

సోమవారం మధ్యాహ్నం డీజీపీ  ఆదేశాలతోపాటు మొబైల్‌కు సందేశాలు రావడం తో పోలీసులు రోడ్లపై బారికేడ్లు అడ్డుపెట్టి రోప్‌ కట్టేశారు. ప్రభుత్వం అనుమతించిన వాహనాలు మినహా మిగతా వాటిని దాదా పు నిలిపేశారు. ఆటోలను సీజ్‌ చేశారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. 

Read more