భక్తులే టార్గెట్‌

ABN , First Publish Date - 2020-12-27T07:36:08+05:30 IST

తెలుగు భక్తులే టార్గెట్‌గా సైబర్‌ నేరగాళ్లు శబరిమల ప్రత్యేక దర్శనం పేరుతో దోపిడీకి తెర తీశారు. ఈ

భక్తులే టార్గెట్‌

  • శబరి దర్శనం పేరుతో మోసాలు
  • నేరగాళ్ల వర్చువల్‌ క్యూ దందా
  • 2వేలు కడితే ప్రత్యేక దర్శనమని బురిడీ
  • మోసపోతున్న తెలుగు రాష్ట్రాల భక్తులు
  • వెనక్కి తిప్పి పంపుతున్న కేరళ పోలీసులు
  • స్లాట్‌ ఉన్నా.. ముందే రావొద్దని విజ్ఞప్తులు

(సెంట్రల్‌ డెస్క్‌)

తెలుగు భక్తులే టార్గెట్‌గా సైబర్‌ నేరగాళ్లు శబరిమల ప్రత్యేక దర్శనం పేరుతో దోపిడీకి తెర తీశారు. ఈ ఏడాది కొవిడ్‌-19 కల్లోలం నేపథ్యంలో ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు (టీడీబీ) పరిమిత సంఖ్యలో భక్తులను శబరిమలకు అనుమతినిస్తోంది. తొలుత రోజుకు వెయ్యి మంది భక్తులు.. వారాంతాల్లో రెండు వేల మందికి దర్శనభాగ్యం కల్పిస్తూ.. ఆన్‌లైన్‌ (WWW.sabarimalaonline.org)లో స్లాట్లను విడుదల చేసింది.


అంటే.. లక్షల మంది భక్తులు హాజరయ్యే మండల, మకరవిళక్కు సీజన్‌లో ఈ సారి కేవలం 85వేల మందికి మాత్రమే అనుమతినిచ్చింది. నవంబరు 1న స్లాట్లను తెరవగానే అరగంటలో అవి బుక్‌ అయ్యాయి. ఆ తర్వాత భక్తుల విజ్ఞప్తి మేరకు రోజుకు వెయ్యేసి స్లాట్లను పెంచింది. అవి కూడా తెరిచిన గంటలోపే అయిపోయాయి. ఇంటర్నెట్‌పై అవగాహన ఉండి, డిజిటల్‌ చెల్లింపులు చేసే భక్తులకే ఈ సారి శబరిమల దర్శనానికి అనుమతులు లభించాయి. నెట్‌పై పెద్దగా అవగాహన లేని వారికి ఆ అవకాశం లేకుండా పోయింది. వారి సెంటిమెంట్‌ను ఆసరాగా తీసుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు.. ఇప్పుడు ‘శబరిమల స్పెషల్‌ దర్శనం’ పేరుతో మోసాలకు తెర తీశారు.


‘‘గూగుల్‌లో అయ్యప్ప స్పెషల్‌ దర్శనం అని సెర్చ్‌ చేస్తే.. అధికారిక వెబ్‌సైట్‌తో పాటు మరికొన్ని వెబ్‌సైట్లు కనిపించాయి. శబరిమల, ట్రావెన్‌కోర్‌, టీడీబీ పేర్లతో ఉన్న ఆ సైట్లను పరిశీలిస్తే రూ.5 వేలకు నలుగురు భక్తులకు ప్రత్యేక దర్శనం అనే ప్రకటన ఉంది. డబ్బులు చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకున్నాం. నీలక్కల్‌ వద్ద పోలీసులు ఆపేశారు. ఫేక్‌ స్లాట్‌ బుకింగ్‌ అన్నారు. ఇంకొందరు భక్తులైతే ఏకంగా రూ.10వేలకు పుష్పాభిషేక పూజ పేరుతో ఉన్న టోకెన్లు తీసుకుని మోసపోయారు’’ అని మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన సురేశ్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.


అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌ జరిగింది హైదరాబాద్‌లో కాబట్టి అక్కడే ఫిర్యాదు చేయాలని సూచించారని ఆయన వివరించారు. నీలక్కల్‌, పంపా వద్ద పరిశీలన జరిపిన ‘ఆంధ్రజ్యోతి’కి 20 మంది వరకు ఇలాంటి బాధితులు కనిపించారు.www.sabarimalaonline.org తప్ప మరే అధికారిక వెబ్‌సైట్‌ లేదని, భక్తులు మోసగాళ్ల బారిన పడొద్దని కేరళ పోలీసులు సూచిస్తున్నారు.




ముందే వెళ్తే.. ఇబ్బందులే

ఈ సంవత్సరం వారాంతాల్లో గంటకు 250 మంది.. ఇతర రోజుల్లో గంటకు 200 మందికి స్లాట్లు కేటాయించారు. ఏ తేదీకి స్లాట్‌ బుక్‌ అయ్యిందో.. అదే రోజు నీలక్కల్‌కు చేరుకోవాలి. గంటకు 500 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించేలా నీలక్కల్‌ వద్ద కరోనా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. స్లాట్‌ కంటే కొంత ఆలస్యంగా వచ్చే భక్తులను కూడా అనుమతిస్తున్నారు.


అందుకే.. స్లాట్‌ బుక్‌ అయిన తేదీకి నీలక్కల్‌లో ఉంటే సరిపోతుంది. నీలక్కల్‌లోని ‘వర్చువల్‌ క్యూ’ పోలీసు వెరిఫికేషన్‌ వద్ద సిబ్బంది.. తర్వాతి రోజు స్లాట్‌ బుక్‌ అయిన వారి పత్రాలనూ పరిశీలించి.. ‘పంచింగ్‌’ చేస్తున్నారు. దీంతో.. అలాంటి భక్తులంతా తమకు ఒకరోజు ముందే దర్శనానికి అనుమతి లభించిందని భావిస్తూ.. పంపాకు వెళ్తున్నారు. పంపా గణపతి ఆలయం వద్ద పోలీసు వెరిఫికేషన్‌లో.. టైమ్‌ స్లాట్‌ ప్రకారమే భక్తులను కొండపైకి అనుమతినిస్తున్నారు. మిగతా వారిని నీలక్కల్‌కు తిరిగి వెళ్లాలని సూచిస్తున్నారు.


ఇలా అయితేనే.. రికమండేషన్లు పనిచేస్తాయి

రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రుల రికమండేషన్‌ లేఖలతో కొందరు భక్తులు శబరికి వెళ్లి ఇబ్బంది పడుతున్నారు. అలాంటి లేఖలేమీ పనిచేయవని కేరళ పోలీసులు చెబుతున్నారు. అయితే.. అధికారిక పద్ధతులను పాటిస్తే.. సరైన పద్ధతిలో.. సరైన అధికారికి రాసిన రికమండేషన్‌ లేఖలు పనిచేస్తున్నాయి. సిఫారసు లేఖలను ముందుగా సంబంధిత మంత్రి కార్యాలయం నుంచి పథనంతిట్ట ఎస్పీ కార్యాలయానికి ఫాక్స్‌ చేయాల్సి ఉంటుంది. ఎస్పీ కార్యాలయ అధికారులు సదరు మంత్రి కార్యాలయానికి ఫోన్‌ చేసి, ఎంత మంది భక్తులు వస్తున్నారు? ఏ తేదీకి? ఏ సమయానికి? అనే వివరాలు తెలుసుకుంటారు. ఆ తర్వాత ప్రత్యేక పాస్‌లు జారీ చేస్తారు. పాస్‌లు లేకుండా.. కేవలం సిఫారసు లేఖలతో వెళ్లే వారిని కేరళ పోలీసులు నీలక్కల్‌ నుంచే వెనక్కి పంపుతున్నారు.




వాహనాల్లో వెళ్తే..

కొవిడ్‌-19 నేపథ్యంలో భక్తులు ఈ సంవత్సరం విమానాలు, రైలు ప్రయాణాలకు దూరంగా ఉంటున్నారు. సొంత/అద్దె వాహనాల్లో శబరికి వెళ్తున్నారు. అలాంటి వారు నీలక్కల్‌ వద్దే వాహనాలను పార్క్‌ చేసి, అక్కడి నుంచి కేరళ సర్కారు ఏర్పాటు చేసిన బస్సుల్లో కొండకు వెళ్లడం మంచిది. వాహనానికి దీక్షలో లేని/స్లాట్‌ బుకింగ్‌ కాని డ్రైవర్‌ ఉంటే.. నీలక్కల్‌ వద్ద పోలీసు వెరిఫికేషన్‌ తర్వాత ఉచితంగా వాహనం పాస్‌ తీసుకునే అవకాశం ఉంది. సంబంధిత భక్తులను పంపా వద్ద దింపేసి, డ్రైవర్‌ వాహనాన్ని తిరిగి నీలక్కల్‌కు తీసుకురావాల్సి ఉంటుంది.


మణికొండకు చెందిన శ్రీనివాసులు గురుస్వామి 33 ఏళ్లుగా శబరిమలకు వెళ్తున్నారు. ఈ సారి స్లాట్‌ విధానం వల్ల ‘వర్చువల్‌ క్యూ’ బుకింగ్‌ అవ్వలేదు. దీంతో.. గూగుల్‌లో స్లాట్‌ బుకింగ్‌ కోసం ప్రయత్నించారు. ఓ వెబ్‌సైట్‌లో రూ. 2 వేలు కడితే స్పెషల్‌ దర్శనం అని ఉండటంతో.. బుక్‌ చేశారు. తీరా ఇరుముడి కట్టుకుని, శబరి కొండకు వెళ్తే.. పోలీసులు నీలక్కల్‌ నుంచే తిప్పి పంపించారు. ఇలా వందల మంది తెలుగు భక్తులు శబరి యాత్రకు వచ్చి, చేదు అనుభవాలతో వెనక్కి వెళ్తున్నారు.


Updated Date - 2020-12-27T07:36:08+05:30 IST