ప్రశ్నించే వ్యక్తులందరినీ హింసిస్తారా..?: దేవినేని ఉమా

ABN , First Publish Date - 2020-05-17T20:46:29+05:30 IST

డాక్టర్ సుధాకర్‌పై దాడి సీఎం నియంతృత్వానికి పరాకాష్టని టీడీపీ నేత..

ప్రశ్నించే వ్యక్తులందరినీ హింసిస్తారా..?: దేవినేని ఉమా

కృష్ణాజిల్లా: డాక్టర్ సుధాకర్‌పై దాడి సీఎం నియంతృత్వానికి  పరాకాష్టని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులు డాక్టర్ చేతులు కట్టేయడం, లాఠీలతో కొట్టడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రశ్నించే వ్యక్తులందరినీ హింసిస్తారా..? అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజ్యాంగాన్నే అపహాస్యం చేస్తారా..? అంటూ వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. డాక్టర్ సుధాకర్ ఉదంతంపై సమగ్ర విచారణ జరపాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.


నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో ఎనస్ధీషియన్‌గా పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్.. ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవని తనకు మాస్కులు, పీపీఈ కిట్లు లేవంటూ ప్రశ్నించడం తప్పా..? అని దేవినేని ఉమా అన్నారు. శనివారం (నిన్న) విశాఖ నడిబొడ్డులో డాక్టర్ సుధాకర్‌పై దాడి సీఎం నియంతృత్వానికి పరాకాష్ట అని అన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ఉన్న డాక్టర్లను త్రివిధ దళాలు సైతం మెచ్చుకుని పూల వర్షం కురిపిస్తుంటే,  ఏపీలో మాత్రం చేతులు కట్టేయడం, లాఠీలతో కొట్టడం లాంటి హేయమైన పనులు చేస్తుందన్నారు. కరోనా నేపథ్యంలో సస్పెన్షన్ వేటుకు గురైన డాక్టర్ సుధాకర్‌ పట్ల ప్రభుత్వం కక్ష కట్టి వేధిస్తోందన్నారు. ఈ దురాగతానికి నైతిక బాధ్యత సీఎం జగన్‌దేనన్నారు. దళితుల పట్ల జగన్ దుర్మార్గాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాలను అందరూ గర్హించాలని, డాక్టర్ సుధాకర్ ఉదంతంపై సమగ్ర విచారణ జరపాలని దేవినేని ఉమా కోరారు.


Updated Date - 2020-05-17T20:46:29+05:30 IST