ఈ 18 నెలల్లో.. ఒక్క శాతమైనా చేయలేదు

ABN , First Publish Date - 2020-12-15T09:18:21+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల్లో పోలవరం ప్రాజెక్టు పనులు కేవలం ఒక శాతానికి లోపే జరిగాయని

ఈ 18 నెలల్లో.. ఒక్క శాతమైనా చేయలేదు

పోలవరం వెళ్లడానికి జగన్‌ సిగ్గుపడాలి

నిర్వాసితులకు పరిహారమివ్వకుండా ప్రాజెక్టులో నీటి నిల్వ ఎలా?

ప్రాజెక్టును చంపిన పాపం.. ఆయన్ను ఊరికే వదిలిపెట్టదు

మూల్యం చెల్లించుకోక తప్పదు.. దేవినేని ఉమ స్పష్టీకరణ


అమరావతి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల్లో పోలవరం ప్రాజెక్టు పనులు కేవలం ఒక శాతానికి లోపే జరిగాయని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. పెట్టిన ఖర్చు కూడా రూ.200 కోట్లేనన్నారు. ఇంత తక్కువ పనులు చేసి.. ప్రాజెక్టు వద్దకు వెళ్లడానికి సీఎం జగన్‌ సిగ్గుపడి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. ఆయన సోమవారమిక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ హయాంలో 71 శాతం పనులు జరిగితే... జగన్‌ జమానాలో ఇంతవరకూ జరిగింది అధికారిక లెక్కల ప్రకారమే 0.89 శాతమని తెలిపారు.


ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటి నిల్వ ఎప్పటికి చేస్తారో ముఖ్యమంత్రి తన పర్యటనలో చెప్పలేకపోయారని, ఊరకే ఊకదంపుడు మాటలు చెప్పి దులుపుకొని వెళ్లిపోయారని విమర్శించారు. ‘2022 జూన్‌ నాటికి 135 అడుగుల ఎత్తులో నీళ్లు నిలబెడతామని ఆయన చెప్పారు. దశలవారీగా పెంచుకుంటూ పోయి మరో మూడేళ్లలో 150 అడుగుల ఎత్తుకు నీటి నిల్వను చేరుస్తానని అంటున్నారు. అంత స్థాయిలో నీటి నిల్వ చేయాలంటే నిర్వాసితులకు రూ.22 వేల కోట్ల పరిహారం ఇచ్చి వారిని అక్కడ నుంచి ఖాళీ చేయించాలి. వారికి డబ్బులిచ్చే పరిస్థితి లేక.. ఏడాదిలో పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేయాల్సిన ప్రాజెక్టును మూడు నాలుగేళ్లు వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నారు. నిర్వాసితులకు పరిహారం ఇవ్వడం కోసం ప్రాజెక్టు అంచనాలు పెంచాలని టీడీపీ ప్రభుత్వం కోరితే అవినీతి కోసమని ప్రచారం చేశారు. ఇప్పుడవే అంచనాల కాగితాలు పట్టుకుని వాటిని ఆమోదించాలని ఢిల్లీ చుట్టూ  తిరుగుతున్నారు.


మీ అబద్ధాలు చూసి ఢిల్లీలో ఛీత్కరిస్తున్నా సిగ్గు లేకుండా తుడుచుకుని తిరుగుతున్నారు’ అని దుయ్యబట్టారు. ‘రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో మొత్తం 26 శాతం మైన్‌సకు పనులు అప్పగించారు. పనుల నాణ్యతపై ఎవరూ కిక్కురుమనడం లేదు. పోలవరం ప్రాజెక్టును చంపిన పాపం జగన్‌ను ఊరికే వదిలి పెట్టదు. దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని హెచ్చరించారు. జాతీయ హోదా పొందిన ప్రాజెక్టుల్లో పోలవరం మాదిరిగా అంత వేగంగా మరే ప్రాజెక్టు పనీ సాగలేదని, రాష్ట్ర భవిష్యత్‌ కోసం చంద్రబాబు ఎంతో శ్రమకోర్చి నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తే.. వైసీపీ నేతలు నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో పెట్టిన ఖర్చుపై జగన్‌ ప్రభుత్వం భూతద్దాలు పెట్టుకుని నెలల తరబడి అవినీతి కోసం వెతికిందని.. అక్కడేమీ కనిపించక ఇప్పుడా విషయం మాట్లాడడమే మానేసిందని ఎద్దేవా చేశారు. పోలవరం తుది అంచనాలు రూ.55,548.87 కోట్లకు చంద్రబాబు ప్రభుత్వం సాంకేతిక సలహా మండలి(టీఏసీ)తో ఆమోదముద్ర వేయించిందని.. దానిని కేంద్రంతో ఆమోదింపజేసుకోవడం చేతగాక వైసీపీ మంత్రులు ఆయన్ను తిట్టిపోస్తున్నారని ఉమ మండిపడ్డారు. 

Updated Date - 2020-12-15T09:18:21+05:30 IST