-
-
Home » Andhra Pradesh » Devineni Uma
-
బూతులతో పోలవరం పూర్తవుతుందా?
ABN , First Publish Date - 2020-10-31T07:30:45+05:30 IST
టీడీపీ నేతలను బూతులు తిడితే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు.

వైసీపీ మంత్రులకు దేవినేని ఉమా ప్రశ్న
అమరావతి/జి.కొండూరు, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): టీడీపీ నేతలను బూతులు తిడితే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. నిర్మాణ వ్యయం కోత కోయడంపై కేంద్రాన్ని నిలదీయడం చేతగాక మంత్రులు బూతులు తిడుతున్నారని, ఎంత పక్కదారి పట్టించాలనుకున్నా వారి చేతగానితనం ప్రజలకు కనిపిస్తూనే ఉందన్నారు. కేసులకు భయపడి సీఎం జగన్ కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారని చెప్పారు. తాడేపల్లి రాజప్రసాదం నుంచి బయటకొచ్చి మాట్లాడే సాహసం కూడా లేకుండా పోయిందన్నారు. ‘చంద్రబాబును ఎంత తిట్టినా ఆయన హయాంలో పోలవరం 71శాతం నిర్మాణం పూర్తయిందని వైసీపీ ఎంపీలు వేసిన ప్రశ్నలకు పార్లమెంటులోనే కేంద్రం సమాధానం చెప్పింది.
ఈ ఏడాదిన్నరలో అంతకుమించి అదనంగా ఒక్క శాతం కూడా కట్టలేకపోయారన్నారు’ అని స్పష్టంచేశారు. ‘వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు కొట్టేయాలని జగన్ దురాశతో ప్రయత్నం చేశారు. దానికోసం అప్పుడు పనులు పొందిన కాంట్రాక్టు కంపెనీని బలవంతంగా తప్పించారు. ఆ వివాదంతో పదేళ్ల పాటు ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయింది. మళ్లీ చంద్రబాబు హయాంలోనే మొదలైంది. జగన్ రాగానే పోలవరానికి గ్రహణం పట్టింది’ అని విమర్శించారు. రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తిచేస్తే టీడీపీని మూసేస్తారా, 2020-21 నాటికి పోలవరం పూర్తి అని ప్రగల్భాలు పలికిన మంత్రి అనిల్‌కుమార్ నేడు ముఖం చాటేశారన్నారు. భూసేకరణకు, ఆర్‌అండ్‌ఆర్‌కు ఎంతఖర్చు చేశారో చెప్పేందుకు ప్రభుత్వానికి 24గంటల సమయం ఇస్తున్నానని లేకుంటే తానే మీడియాకు పూర్తి వివరాలు అందిస్తానని కృష్ణాజిల్లా జి.కొండూరులో ఉమా పేర్కొన్నారు.