తీవ్రవాదుల్లో కలుస్తాం

ABN , First Publish Date - 2020-08-20T08:34:40+05:30 IST

అమరావతి కోసం ఆందోళనలు చేస్తున్న రైతులు, మహిళలు.. ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తమ గోడును పట్టించుకునే నాథుడు లేనప్పుడు, శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అవకాశం కూడా లేనప్పుడు తీవ్రవాదుల్లో కలవడమే ఉత్తమమని సంచలన వ్యాఖ్యలు చేశారు...

తీవ్రవాదుల్లో కలుస్తాం

  • నిరసనకూ స్వేచ్ఛ లేనప్పుడు బతుకెందుకు?
  • రాజధాని రైతులు, మహిళల తీవ్ర ఆవేదన
  • అమరావతిలో పోలీసుల హల్‌చల్‌
  • రైతుల ముందస్తు అరెస్టు, విడుదల
  • మందడంలో మహిళలపై జులుం

గుంటూరు, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): అమరావతి కోసం ఆందోళనలు చేస్తున్న రైతులు, మహిళలు.. ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తమ గోడును పట్టించుకునే నాథుడు లేనప్పుడు, శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అవకాశం కూడా లేనప్పుడు తీవ్రవాదుల్లో కలవడమే ఉత్తమమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై తాము రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖలు రాయనున్నట్టు వెల్లడించారు. మరోపక్క, రాజధాని అమరావతిలో పోలీసులు బుధవారం హల్‌చల్‌ చేశారు. కేబినెట్‌ భేటీ నిమిత్తం సీఎం జగన్‌, మంత్రులు సచివాలయానికి వెళ్తున్న నేపథ్యంలో అమరావతిలో భారీగా మోహరించారు. రైతు నేతలను అరెస్టు చేశారు. మందడంలో మహిళలపై  జులుం ప్రదర్శించారు.


నిరసన శిబిరాల నుంచి బలవంతంగా ఖాళీ చేయించారు. తాము ఎవరి కాన్వాయ్‌నీ అడ్డగించబోమని, గాంధేయ విధానంలో నిరసన తెలుపుతామని మహిళలు దండాలు పెట్టి వేడుకున్నా పోలీసులు కనికరించలేదు. దీంతో మందడంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ‘‘మాకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా? మా సొంత స్థలాల్లో శాంతియుత దీక్షలను చేసుకుంటున్నా అడ్డుకోవడం ఏమిటి’’ అని మండిపడ్డారు. మందడంలో తమను పోలీసులు నిలువరించడంపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్‌ భేటీ కోసం సీఎం జగన్‌ సచివాలయానికి వస్తున్న నేపథ్యంలో పలువురు రైతులను, రైతు సంఘాల నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. కొనపాటి రమేశ్‌బాబు, బుచ్చిబాబు, గాదె శ్రీనివాసులను అదుపులోకి తీసుకుని సమావేశం అయిన తరువాత విడుదల చేశారు. ఉద్యమంలో చురుగ్గా ఉంటున్న వారిని పోలీసులు కేసులు పేరుతో భయపెట్టి గృహ నిర్బంధం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెవులుండి వినపడనట్లుగా వ్యవహరిస్తున్నాయని, 246 రోజులుగా తమ గోడు వెళ్లబోసుకుంటున్నా పట్టించుకోవడం లేదని తుళ్లూరు రైతులు కంచాన్ని గరిటెతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి నిరసన తెలుపుతున్నా పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, అమరావతి ఆందోళనలు బుధవారానికి 246వ రోజుకు చేరాయి. 


సుప్రీంలోనూ జయం రైతులదే!

అమరావతి జేఏసీ ఆశాభావం

విజయవాడ: సుప్రీంకోర్టులోనూ రైతులకు న్యాయం జరుగుతుందని అమరావతి జేఏసీ నేతలు శివారెడ్డి, గద్దె తిరుపతిరావు, వీఆర్‌ స్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. కేబినెట్‌ భేటీ పేరుతో పోలీసులు మందడంలోని రైతులను, మహిళలను అడ్డుకున్నారని, మరో ముగ్గురు రైతులను అరెస్టు చేశారని ఇలాంటి చర్యలు దారుణమని అన్నారు. 


Read more