డిప్యూటీ స్పీకర్‌ రాజీనామా..!

ABN , First Publish Date - 2020-03-18T16:44:36+05:30 IST

జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన చిక్కబళ్ళాపుర జిల్లా చింతామణి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మారిన తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా

డిప్యూటీ స్పీకర్‌ రాజీనామా..!

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన చిక్కబళ్ళాపుర జిల్లా చింతామణి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మారిన తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి తప్పుకున్నారు. శాసనసభలో మంగళవారం ఆయనపై అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టడానికి కొన్ని గంటల ముందుగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా శాసనసభ లాంజ్‌లో కొద్దిసేపు ‘పెన్‌కౌంటర్‌’తో తన మనసులోని మాటలను పంచుకున్నారు.

ప్రశ్న: డిప్యూటీ స్పీకర్‌గా తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ముందే ఊహించారా..?
జవాబు: రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలి బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక దశలో రాజీనామా చేయాలని భా వించా. అయితే అధికార పార్టీ నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో పదవిలో కొనసాగా. ఎప్పటికైనా ఈ పదవిని త్యజించాల్సి వస్తుందని ఊహించా. డి ప్యూటీ స్పీకర్‌గా ఎంతో సంతృప్తి చెందా. పదవినుంచి తప్పుకోవాల్సి వచ్చినందుకు ఏమాత్రం బాధపడడం లేదు. ఈ కీలక పదవిని అప్పగించిన మా పార్టీ నేతలకు సదా కృతజ్ఞడినై ఉంటా.

ప్రశ్న: రాజకీయాల్లో మున్ముందు మీరు పోషించే పాత్ర..? 
జవాబు: చింతామణి శాసనసభ నియోజకవర్గ అభివృద్ధికి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇక పూర్తిగా నియోజకవర్గంపైనే దృష్టి సారిస్తా. ప్రత్యేకించి వేసవి కాలంలో పట్టణ ప్రజల తాగునీటి దాహార్తిని తీర్చేందుకు తొలి ప్రాధాన్యం ఇస్తా.

ప్రశ్న: డిప్యూటీ స్పీకర్‌గా మీ అనుభూతులేమిటి..? 
జవాబు: శాసనసభలో స్పీకర్‌ లేని సమయంలో డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించడమే నా కర్తవ్యం. ఈ కొత్త పదవి ఎంతో అనుభూతినిచ్చింది. డిప్యూటీ స్పీకర్‌గా చాలా నేర్చుకున్నా. సభను క్రమశిక్షనతో నడిపించాను. రాజకీయాల్లో ఒక మెట్టు ఎదిగేందుకు ఈ పదవి బాగా దోహదపడింది.

Updated Date - 2020-03-18T16:44:36+05:30 IST